ఇంతకీ కవితని జైల్లో ఎందుకు పెట్టినట్లు, ప్రొ. మాడభూషి శ్రీధర్ ప్రశ్న
మొన్న సిసోడియా, నిన్న కవిత, ఎప్పుడు కెజ్రీవాల్? రూల్, రూలర్లు, రూల్ ఆఫ్ లా అనేది ఉందా లేదా? చార్జ్ షీట్ బరువు ను బట్టి బెయిల్ నిరాకరిస్తారా?
నిజానికి ఈ కేసు ఇపుడు శిక్షార్హత దశలో లేదు. అయినా సరే చార్జిషీట్ తరువాత కస్టడీ పేరుతో జైలులో ఉండవలసి వచ్చింది. ఇలాంటపుడు బెయిల్ వస్తే విడుదల కావడం అనేది వాళ్ల అదృష్టం. సుప్రీంకోర్టు అనే ఒక అత్యున్నత న్యాయస్థానం ఉంది కనుక వాళ్లు బతికిపోతున్నారు. అదే లేకపోతే గతి ఏమిటి? అంటే ఇపుడు దేశంలో రూల్ ని రూలర్లు నిర్ణయిస్తున్నారు. రూల్ ఆఫ్ లా కాదు. రూల్ ఆఫ్ లా కాపాడాలని సుప్రీంకోర్టు పదేపదే నిలదీయకపోతే మంత్రులకైనా, ముఖ్యమంత్రులకైనా రూలర్లకు నచ్చకపోతే దిక్కూ మొక్కూ ఉండదు.మామూలు వ్యక్తుల సంగతి చెప్పనవసరం లేదు.
వందలాది సాక్షులు, లక్షలాది పేజీలు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 165 రోజులో ఉన్నారు. ఎందుకున్నారో తెలియదు. ఆ కస్టడీ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో ఆమెను బెయిల్ మీద విడుదల చేసారు. 20 నెలలపాటు విచారణ జరిపి, 493 మంది సాక్షులను, 57 మంది నిందితులను ప్రశ్నించి, 50 వేల పేజీల డాక్యుమెంట్లు సమర్పించినా కవిత కేసులో ఇప్పటివరకు తేల్చిందేమీ లేదు. ఇంత కష్టపడి ఏమి సాధించారో చెప్పండి అని సీబీఐ, ఈడీ లాయర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చాలా స్ఫష్టంగా అడిగారు. మొబైల్ ఫోన్ లో మెసేజ్‌లు డిలీట్ చేయడం, ఫోన్ ఫార్మాట్ చేశారనే అల్ప విషయాలు తప్ప ఏమైనా బలమయిన సాక్ష్యాలు ఉంటే చూపెట్టాలని కోర్టు వాళ్లని అడిగింది. ఏమీ చూపలేక పోయారు. సీబీఐ చార్జిషీట్ ఎపుడో దాఖలు చేసి ఉండటం, ఈడీ దర్యాప్తు పూర్తై ఉండటం, మహిళకు ఉన్న ప్రత్యేక వెసులుబాటు దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం తేల్చింది.
బరువైన చార్జిషీట్
అయితే అంత విలువైన చార్జ్ షీట్ లో ఏముంది? లక్షల అక్షరాల బరువు, కనిపించని లక్షల రూపాయలు, చార్జిషీట్ ఒడ్డు, పొడుగు, ఎత్తు వెడల్పు. అంతేనా. వీటి ఆధారంగా నేర నిర్ధారణ జరగదు. ఈ చార్జ్ షీట్ బరువును చూసి సాధారణ మనుషులంతా భయపడే అవకాశం ఉంది. చార్జ్ షీట్ పొడవు, బరువు వల్లనే కవితను జైల్లో పెట్టారనుకోవాలి. చిత్రమేమిటంటే, మా జీ తెలంగాణా మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసిఆర్ ) కూతురైన కవితని ‘అప్రూవర్’ గా మారిన ఒక నిందితుడు చెప్పిన మాటల ఆధారంగా అరెస్టు చేయడం, జైలుపాలు చేయడం జరిగింది. ఇది దారుణం. ఒక్క కవితకే కాదు ప్రభువులకు నచ్చని ప్రముఖులందరి గతి ఇదే. కేంద్రప్రభుత్వం పెద్దలు కేవలం అప్రూవర్ ల వెల్లడించారని చెప్పే విషయాల మీద ప్రముఖలను అనుమానితులుగా చేస్తున్నదంటే దేశంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అప్రూవర్ అంటే ఎవరు? ఎక్కడనించి పుడుతారు?
పుట్టుకతో ఎవరు అప్రూవర్ కాలేరు. కేసు మధ్యలో ఉన్నట్లుండి అప్రూవర్ పుడతాడు. ముందు ఎవరో ఒకరి నెత్తిన నిందవేస్తారు. తానే నేరం చేయలేదని ఆ అనుమానితుడు అంటాడు. వాదిస్తాడు. వందలాది గంటల తరువాత కూడా తాను నేరంచేయలేదనే అంటూ ఉంటాడు. అరెస్టు అయిన తరువాత కూడా నేరం చేయలేదనే అంటాడు. అప్పుడు ఇంటరాగేషన్ మొదలవుతుంది. ఆదశలో ఏమయినా జరగవచ్చు. హింసిస్తున్నారని అనడానికి వీల్లేదు. కాని వందలాది గంటలు ప్రశ్నలతో వేధిస్తారు. దాని కన్నా లాఠీ దెబ్బలే నయమనిపించేలా పోలీసు ప్రశ్నలతో పిచ్చివాళ్లయిపోతారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ పెద్దలు లేదా దర్యాప్తు చేసే వాళ్లకు చాలా అధికారం ఉంటుంది. వీళ్లు ఎవరినైనా అరెస్టు చేస్తారు. ఒక సారి అరెస్టు అయ్యాక ఎక్కడో ఉన్న ప్రభుత్వ పెద్దల దయతో మాత్రమే విడుదల సాధ్యం. ఇంటరాగేషన్ బాధ పడలేక ‘‘నేనే నేరం చేసాను’’ అని చాలా మంది ఒప్పుకుంటారు. ఇలా ఒప్పుకున్నవాడే అప్రూవర్. ఈ అప్రూవర్ ని ఎవరిమీద నైనా ప్రయోగించవచ్చు. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో కవిత మీద అప్రూవర్ ను ప్రయోగించారు. ఇతర కేసులలో ఇతర ప్రముఖుల మీద ప్రయోగించవచ్చు. దీనితో ఆ ప్రముఖునికి కష్టాలు మొదలవుతాయి. అప్రూవర్ ఒప్పుకున్నాడు కదా నీవు ఒప్పుకో అంటారు. ఇలా మొత్తం కవిత కేసంతా అప్రూవర్ ద్వారానే నడుస్తూ వచ్చింది.
సుప్రీంకోర్టు సంధించిన ‘ఫెంటాస్టిక్’ ప్రశ్నలు
ఈ అప్రూవర్ ని ప్రయోగించే కవితని 5 నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి తెచ్చారని కవిత లాయర్లు నిలదీసారు. "దర్యాప్తు చేస్తున్న వాళ్లు ఎవరినో ఒకరిని నిందించి, బంధించి, మొదట సాక్షి అని, ఆ తరువాత సాక్షికాదు నిందితుడే అని, లేదా ఇపుడు ఆయన ఆప్రూవర్ అయ్యాడు అని ఇటువంటి పనులు చేస్తారా," అని కవితకు బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ అడిషినల్ సోలసిటర్ జనరల్ ఎస్ వి రాజుని అడిగారు.
చదువుకున్న వ్యక్తి, నాగరికురాలు అయిన కవితకి బెయిల్ ఇవ్వలేదంట డిల్లీ హైకోర్టు పెద్దలు ఎంతు ఫెంటాస్టిక్ గా పనిచేశారో కనిపిస్తున్నదని గవాయ్ వ్యాఖ్యానించారు. కాని ‘ఒక నిందితుడిని అప్రూవర్ గా మార్చి సమాచారం రాబట్టాం అందుకని జైల్లో పడేస్తాం, బెయిల్ ఇవ్వనే ఇవ్వం అని వాదించడం కూడా మామూలైపోయింది. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులు నిందితులు అయినపుడు న్యాయం అన్యాయ తారు మారు అవుతాయి. ఒక సారి అరెస్టు అయితే బెయిల్ రావడం చాలా కష్టం. ఇక సుప్రీంకోర్టు దాకా వెళ్లి పోరాడి న్యాయం కోసం బెయిల్ సాధించడం మాత్రం మామూలు విషయం కాదు. అందరి చేతా కాదు, ఒక వేళ అంత దాకా వెళ్లగలిగినా అది చాలా వరకు అదృష్టం, ప్లస్ న్యాయం మీద అధార పడిఉంటుంది. కాని అప్పటికీ బెయిల్ రాకపోతే వారి గతి ఏమిటి అనేది ప్రశ్న. పి ఎం ఎల్ ఎ ( ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్)ని, అధికారంలో ఉన్న వారు రాజకీయావసరాలకోసం వాడుకోవడం నిత్యం కనబడుతూ ఉన్నది. ఇది దారుణం. రెండు రోజుల ఇలాంటి కేసులో సుప్రీంకోర్టు ఝార్ఖండ్ హైకోర్ట్ కు చాలా కఠినంగా చెప్పవలసి వచ్చింది.
బెయిల్ ఎవరికీ దరొకని అరుదైన అవకాశం చేయరాదు. కానీ చేశారు. ఉదాహరణ కవితే. బెదికించడానికి బెయిల్ వాడడానికి వీల్లేదు. అదే జరుగుతూ ఉంది, ఉదాహరణ కవితే. . కానీ ఇడి ఎంచేసింది, బెయిల్ ఇజ్ ఎక్సెప్షన్, నాట్ రూల్ అన్నట్లు పరిస్థితి సృష్టించింది. బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ (bail is the rule and jail is the exception) అని చాలా సార్లు సుప్రీంకోర్టు చెబుతూనే ఉన్నా ఖాతరు చేయలేదు. తాజాగా ప్రేమ్ ప్రకాశ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా త్రూ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఎస్ ల్ పి) (క్రిమినల్ నెంబర్ 5416, 2024) కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్బి ఆర్ గవాయ్ , జస్టిస్ కె ఎన్ విశ్వనాథన్ 28.8.2024 నాడు తీర్పు ఇస్తూ ఈ విషయమే మళ్లీ చెప్పారు. చట్టవ్యతిరేకంగా గనుల తవ్వాడనే అనుమానంపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అనుచరుడు ప్రేమ్ ప్రకాశ్ మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరొక్టరేట్ (ఇడి) కేసు వేసింది.
ఈడి కేసులు, రాజకీయాలు: బిజెపి, తెలుగుదేశం వగైరా
ఇక కవిత విషయానికి వద్దాం. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒకపార్టమెంట్ సభ్యుడు. ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని ఇడి పెద్దలు ఆ మద్య ఢిల్లీ ఎక్సైజ్ కేసులో పెట్టారు. ముందు నేరం ఒప్పుకోలేదు. అతన్ని అప్రూవర్ గా మార్చేయాలని నిర్విరామ కృషి చేసారు. దాని అర్థం అంటే నేరం ఒప్పుకునేలా చేయడం. ఆ కేసులో కవితను ఇరికించిన వ్యక్తి ఆయనే. ఇంక రాజకీయం గురించి ఆలోచించండి. ఎంపీ మాగుంట తెలుగుదేశం పార్టీ . కవిత బి ఆర్ ఎస్ మాజీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసి ఆర్ కూతురు ఆమె తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడారు. మాగుంట ప్రస్తుతం బిజెపి నాయకత్వంలో ఉన్న ఎన్ డి ఏ సంకీర్ణంలో తెలుగుదేశం భాగస్వామి. ఇక అటు డిల్లీలో బిజెపితో పోరాడుతున్నదెవరు? ముఖ్యమంత్రి కేజ్రీవాల్. కేసులకి నేరాలకంటే రాజకీయాల వాసన ఎక్కువగా ఉంటుంది.
PMLA, రాజ్యాంగం ప్రస్తావన
PMLA సెక్షన్ 45 కింద ప్రాథమిక హక్కు బెయిల్ అనే సూత్రం (bail is the rule and jail is the exception) తప్పడానికి వీల్లేదని చెప్పింది.ఇడి దీన్ని తిరగరాసి, బెయిల్ ఎక్సెప్షన్ , జైల్ రూల్ అని చెబుతున్న విషయాన్ని సుప్రీంకోర్టు జార్ఖండ్ కేసులో ప్రస్తావించింది. బెయిల్ నిరాకరించడానికి కేవలం రెండే షరతులు ఉన్నాయి 1. ఆరోపణ సరైనదై ఉండాలి, 2 సహేతకుమైఉండాలి. ఇదిగాక మరే కారణమూ ఉండకూడదు. ఆర్టికిల్ 21 కింద జీవన, వ్యక్తి స్వేచ్ఛ కేవలం చట్టం నిర్దేశించిన ప్రక్రియద్వారా మాత్రమే అని రాజ్యాంగం ఘంటా పథంగా చెబుతున్నది.
కనీసం ప్రాథమిక వాస్తవాలను చూపలేకపోతే బెయిల్ ఇవ్వక తప్పదు. కవిత కేసులో బెయిల్ వ్యతిరేకించడానికి దర్యాప్తు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇడి పెద్దలు ప్రాథమిక కొన్ని అంశాలను కోర్టుకు వివరించాలి. తప్పు చేశారడనడానికి కనీస కారణాలు చెప్పకపోతే బెయిల్ ఇవ్వవలసి వస్తుంది అని విజయ్ మదన్ లాల్ చౌదరీ కేసులో 2022 లోనూ, 28.8.2024 నాడు ప్రేమ్ ప్రకాశ్ తాజాతీర్పులో సుప్రీంకోర్టు వివరించింది. చౌదరీ కేసును సుప్రీంకోర్టు ప్రస్తావించింది. మనీ లాడరింగ్ అనే నేరాన్ని చేసి ఉంటాడని అనుకుంటూ ప్రిజంప్షన్ ను ఉపయోగిస్తారు. అంటే అది నేరం చేసి సమకూర్చుకున్న సంపద మనీ లాండరింగ్ లో ఉందని ఊహించడం (ప్రిజంప్షన్) అవుతుంది (Legal Presumption that proceeds of crime are involved money laundering). ఊహించడం దశలోనే నేరం జరిగినట్లుగా చూపడం చాలా అన్యాయం. అయితే, న్యాయస్థానం అది అన్యాయమే అని అనుకుంటేనే బెయిల్ మీద విడుదల సాధ్యమవుతుంది.
మూడు అత్యవసర అంశాలు
1. చేసిన పని, నిందితుడి నేరానికి సంబంధించిది అయిఉండాలి.
2. నేరాల ద్వారా సంపాదించిన ఆస్తి అయిఉండాలి.
3. ఆ నిందితుడు నేరుగా లేదా పరోక్షంగా ఏదోరకమైన నేర చర్యలతో సంబంధించిన వాడైఅయి ఉండాలి. (Prem Prakash v. Union of India through the Directorate of Enforcement| SLP (Crl) No. 5416/2024 (2024 LiveLaw (SC) 617) సుప్రీంకోర్టు ఈ మూడు అంశాలు లేవని అనుమానిస్తే బెయిల్ ఇవ్వాల్సిందే. ఆ అనుమానాలు వచ్చిన తరువాత ట్రయల్ లో కూడా ఆ అంశాలు ఉన్నాయని రుజువు అయితే శిక్ష కూడా ఇవ్వవచ్చు, అందాకా అంటే శిక్ష పడడానికి ముందున్న కాలంలో బెయిల్ ఇవ్వాల్సిందే. న్యాయస్థానం నిందితుడిని నేరాలను నిర్ధారణ చేసిన తరువాతనే శిక్ష ఉంటుంది.
మరో ఉదాహరణ మనీష్ సిసోడియా
ఢిల్లీ ప్రభుత్వ ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను 17 నెలల దాకా జైల్లో ఉంచే అధికారం ఏ రాజ్యాంగం ఇచ్చింది. అంతకుముందే రద్దయిన ఎక్సైస్ పాలసీ కింద అరెస్టు అయిన ఆమ్ ఆద్మీ పార్టీ చట్టం నాయకుడు. ఆయన ఇప్పటికీ కేంద్ర నియంతృత్వ పైన ఇంకా పోరాడుతానంటున్నాడు. అంతే కాదు తనని డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేదాకా జైల్లో ఉంచాలని కుట్ర చేసారని సిసోడియా ప్రకటించారు. ఆ కుట్రలో బిజెపి ఓడిపోయిందని సిసోడియా ధైర్యంగా ప్రకటించారు. రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రాథమిక హక్కును భంగం చేస్తూ ట్రయల్ ఎన్నాళ్లు కొనసాగిస్తారు అని సుప్రీంకోర్టు సిసోడియా కేసులో విమర్శించారు? మరి ఇన్నాళ్లు అతను జైల్లో ఉన్న హక్కు భంగమయినందుకు జవాబు ఏమిటి. పరిష్కారం ఏమిటి? అదీ మనదేశానికి ప్రజాస్వామ్యం అనుకుంటే ఈ హక్కు ఉంటే ఖచ్చితంగా పరిష్కారం ఉండాలనేది ప్రపంచమంతా న్యాయసూత్రం అమలులో ఉండాలి. దానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన జవాబు ఏమిటి? జైల్లో బంధించిన ప్రతి క్షణానికి పర్సనల్ లిబర్టీ లెక్క కట్టి చెప్పాలి అని సిబిఐకి, డైరెక్టరీట్ ఎన్ ఫోర్స్ మెంట్ లను సుప్రీంకోర్టు నిలదీసింది.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయ్యి, 17 నెలలకు పైగా జైలు జీవితం అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత మనీశ్ సిసోడియా కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ ఇపుడు అరెస్టుకు సంబంధించి జవాబు ఇవ్వాలి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆగస్టు 9న ఆయనను విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో, ఇద్దరి ష్యూరిటీ తీసుకుని ఆయనను విడుదల చేయాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, ప్రతీ సోమవారం, గురువారం ఏజెన్సీల అధికారుల ముందు హాజరుకావాలని ధర్మాసనం కొన్ని షరతులు కూడా విధించింది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో కిందటేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియాను అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఈ సందర్భంగా సిసోడియా అన్నమాటలు విలువైనవి
‘ఈ తీర్పు నియంతృత్వానికి పెద్ద చెంపపెట్టు. ఇందుకు నేను సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఏ నియంతృత్వ ప్రభుత్వం కూడా అమాయకుడిని జైలులో పెట్టలేదు. నాతో మీరూ బాధను అనుభవించారు. ప్రతి స్కూలు విద్యార్థి నేను బయటకు రావాలని ఎదురుచూశారు. ఈ తీర్పు తర్వాత నేను బాబాసాహెబ్ అంబేద్కర్‌కు రుణపడి ఉన్నట్టు అనిపిస్తున్నది. రాజ్యాంగం ద్వారానే ఈ న్యాయపోరాటానికి తార్కిక ముగింపు దక్కింది’ అని మనీశ్ సిసోడియా అన్నారు. ఆయన మీద 493 సాక్షులను వరసగా నిలబెట్టారు. కనీసం ఒక లక్ష పేజీల డాకుమెంట్ల కోర్టు లో ఇచ్చారు. ఆరోపణల ద్వారా 2020 సెప్టెంబర్ 4న కేసు పెట్టారు. కింద ఉన్న ట్రయల్ కోర్టులు, హైకోర్టులు కూడా బెయిల్ కేసుల చర్చలేకుండా తెరిచి వెంటనే మూసేసే తీర్పులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. (the grant of bail was not a “snake-and-ladder game” and it would be a “travesty of justice” to relegate the bail plea to the trial court. “Procedure is the handmaid of justice not the mistress of Justice: the Supreme Court)
ఇంతకుముందు సిబిఐ కేసులో ఇడి కేసుల్లో బెయిల్ ఇవ్వండి అని పదమూడు సార్లు అర్థించారు. ఆరోగ్యం బాగులేదని భార్యకు సాయం చేయడానికి విడుదల్ ఇవ్వమని అడిగారు. సిసోడియా గారికి వ్యతిరేకంగా 19వేల కాగితాలను సిబిఐ ఇడి పెద్దలు కోర్టుకు సమర్పించారు. అవిచూడడానికే 3 నెలలు పట్టింది. అందులో ఒక సహేతుకమైన పేజీ ఒక్కటీ లేదు, కేసును కేవలం ఆలస్యం చేయడానికి ప్రయత్నం అని సుప్రీంకోర్టు వివరించింది. ఇడి అధికార బృందం వారి వాదనల్లో ఎన్నో సార్లు తమ పాయింట్స్ ని తామే వ్యతిరేకించారని సుప్రీంకోర్టు వివరించింది. సుప్రీంకోర్టుకు సమయం దొరికి తీర్పు ఇచ్చేదాకా సిసోడియా జైల్లో ఉండాలన్న మాట. శ్రీమతి కవిత వ్యవహారం కూడా అదే అని తేలింది. అంటే ప్రభుత్వం అప్పీలు మీద అప్పీలు వేస్తూనే ఉంటుంది, అందాక జైల్లోనే ఉండాలి. అంతేనా. ఇటువంటి భయంకరమైన అప్పీళ్లను పంపించి కేసులను వాయిదా వేయడానికి కావలసినంత అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు ఇస్తూ భారతీయ సురక్ష సంహితని పార్లమెంటు తయారు చేసింది.
మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, శ్రీమతి కవితకు బెయిల్ దొరికింది సరే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే ఆరోపణను ఎందుర్కొంటున్నారు. ఎంతకాలం ఆయనకు బెయిల్ నిరాకరణ అనే కారాగార శిక్ష విధిస్తారు?
కొత్త క్రిమినల్ లా చదవండి
కొత్త కొత్త కఠినమైన సెక్షన్లు | BNSS | CrPC |
కస్టడీ కాలం | 15 రోజులు, కాని 90 దాటి పోవచ్చు సెక్షన్ 187 | 90 రోజులు (సెక్షన్ 167) |
నిందితుడు లేకపోయినా నేర నిర్ధారణ చేయవచ్చు | చేయొచ్చు సెక్షన్ 228 | చేయకూడదు. సెక్షన్ 204 |
కొత్త టెక్నాలజీ వాడవచ్చు | వాడవచ్చు, కాని ఏ విధంగా? | చట్టంలో లేదు. |
నిందితులకు రక్షణల బోలెడు ఉన్నాయి (అంటారు) | చాలా సమగ్రంగా అని చెప్పుకుంటారు. బాగా చదివితే తెలుస్తుంది | ఇదివరకు అంత సమగ్రంగా లేవు |
సామాజిక న్యాయం | ఉన్నాయని నమ్ముతున్నాం. | ఆ విషయమే లేదు |
బెయిల్ | చాలా సంక్లీష్టం, బోలెడు ఏళ్లు. ఎన్నో సంవత్సరాలపాటు జైల్ పాలు | మరీ కఠినంగా లేని నియమాలు |
మెజిస్ట్రేట్ 15 రోజుల మాత్రమే పోలీసు కస్టడి గ్రాంట్ ఇవ్వవచ్చు. కాదంటే 40 రోజులు లేదా 60 రోజులు కూడా ఇవ్వవచ్చు. పూర్తి ఛార్జిషీట్ దాఖలు చేయడానికి 60 నుంచి 90 రోజుల దాకా కస్టడీ ఇవ్వడానికి వీలుంది. భారత రాజ్యాంగం ఇచ్చిన 24 గంటల గడువు లోగా పోలీసు దర్యాప్తు పూర్తి కాకపోతే సెక్షన్ 187(2) కింద ప్రొసీజర్ (ప్రక్రియ) కొనసాగుతుంది. అంటే మొత్తం మీద దాదాపు 90 రోజుల అంతకు ఎక్కువ రోజులపాటు కూడా బంధించే అధికారం కొత్త చట్టం ఇచ్చేస్తున్నదని అర్థం చేసుకోవాలి.