సరే, మన పరువు దుబారా మాటేమిటి?
ప్రయాణికులంతా కలిసి క్షేమంగా నేపాల్ నుంచి ఆంధ్రా వచ్చేందుకు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఏర్పాట్లు చేశారని హెయిర్ హోస్టెస్ తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ ని మైక్ లో చదివారు;
ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ మనం ఒక పనికి పూనుకొన్నప్పుడు, అందుకు మనల్ని పురికొల్పిన పరిస్థితులు ఏమిటి? అనేది కీలకం అవుతుంది. ‘నేపాల్ లోని ఆంధ్రప్రదేశ్ భక్తుల భద్రత – స్వస్థలాలకు వారి తరలింపు’ ప్రభుత్వానికి ప్రాధాన్యతా అంశం అది జరగాలి. కానీ, ఆ పని చేస్తూ అందుకోసం మరికొన్ని విలువైనవి మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఇకముందైనా ఆ దిశలో మన ఆలోచనలు మొదలు కాకపోతే, సున్నితమైన అంశాల గుర్తింపు విషయంలో ‘బేలెన్సింగ్’ చేతకాక, రాష్ట్రం బయట గౌరవం పోగొట్టుకోవడం అలవాటుగా మారే ప్రమాదం ఉంది. అయినా తెలుగు వాళ్ళకు ఇటువంటి ఎరుక ఉండాలనే, ‘తోలు మందం పనులు’ అనే దేశవాళీ తెలుగు పదాన్ని వాడకంలోకి తెచ్చుకున్నాం. మరి తెలంగాణలో ఇటువంటిది ఉందో లేదో తెలియదు.
మొదటి నుంచి మన రాజ్యాంగంలో ‘లెజిస్లేచర్’ చేయాల్సింది ‘ఎక్జిక్యూటివ్’ చేయాల్సింది స్పష్టంగా ఉంది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో ఎవరి పనులు ఏమిటి ఎవరి పరిధులు పరిమితులు ఏమిటి అనేది కూడా మొదటి నుంచి స్పష్టమే. కేంద్ర హోం శాఖలో అయితే, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు విషయంగా ఒక విభాగం కూడా ఉంటుంది. ఇక దేశ సరిహద్దున మన పౌరుల భద్రతకు సమస్య అన్నప్పుడు, అదనంగా విదేశాంగ శాఖ పాత్ర కీలకం అవుతుంది. అది ఆయా దేశాలలో ఉండే ‘ఎంబసీ’లకు సహాయ చర్యలకు మార్గదర్శకాలు ఇస్తుంది.
దేశ రాజధాని డిల్లీలో భారత ప్రభుత్వానికి రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య పరిపాలనా సమన్వయం కోసం సీనియర్ ఐఎఎస్ అధికారి పర్యవేక్షణలో ఒక కార్యాలయం ఉంటుంది. అశోక రోడ్డులోని ‘ఏపీ భవన్’ అటువంటిదే. అలాగే రాష్ట్రాలలో కూడా జి.ఏ.డి. ప్రోటోకాల్ విభాగంలో ‘స్టేట్ ఫంక్షన్స్’కు హాజరయ్యే ఇతర దేశాధినేతలకు మనం ఇవ్వాల్సిన గౌరవ ‘స్థాయి’ నిర్ణయం కూడా ఆయా దేశాల ‘సైజ్’ను బట్టి ఉంటుంది. అమరావతి శంకుస్థాపన 2015 అక్టోబర్ లో జరిగినప్పుడు సింగపూర్ అతిధుల విషయంలో ప్రభుత్వం ‘బుక్’ ను అనుసరించింది తప్ప, మన నాయకుల ప్రాధాన్యతలను కాదు.
అయితే ఆర్ధిక సంస్కరణలు మొదలైన గడచిన ముప్పై ఏళ్లుగా ప్రభుత్వంలోకి చొచ్చుకొచ్చిన ‘ప్రైవేట్’ ధోరణులు, దానికి అంటిపెట్టుకుని ఉండే ‘మార్కెటింగ్’ స్వభావంతో విచక్షణను కోల్పోయే విపరీత ధోరణులను ఎన్నికయ్యే ప్రభుత్వాల్లో చూస్తున్నాము. వాటిని నిలువరించి అభ్యంతరం చెప్పాల్సిన పాలక యంత్రాంగాల రాజీ, సర్ధుబాటుతో ఇందుకు తెగబడే శక్తులకు సహజంగానే వెరపు తగ్గుతున్నది. ప్రజలు పీకల్లోతు నీళ్ళలో మునిగి ఉంటే, ఇటువంటి నాయకులు ఎలాగోలా వాళ్ళ వద్దకు చేరి, ముందుగా అక్కడకు తరలించుకుని వెళ్ళిన మీడియా కెమెరాల వైపు చూస్తున్నారు.
తుఫానులు వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర సరిహద్దుల లోపల జరిగే ఇటువంటి ‘డ్రామా’లకు ఇప్పటికే మనం అలవాటు పడ్డాము. దాన్ని చొరవతో కూడిన పాలన అనే ‘స్కూలు’ కూడా మనకుంది. కానీ దేశం సరిహద్దుల వద్ద కూడా ఇటువంటి శిబిరాలు వీరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. హిందీ వాళ్ళు సినిమాల షూటింగ్ కోసం మన వద్దకు పెద్దగా రారు. కానీ ‘లొకేషన్స్’ కోసం మనం ఉత్తరాది సరిహద్దులు వరకు వెళతాం. అటువైపు ఇప్పడు ఏదైనా ఆపద వస్తే, సినిమా అవుట్ డోర్ యూనిట్లకు పోటీగా మన రాజకీయ పార్టీల శిబిరాలు కూడా ఈ మధ్య వెలస్తున్నాయి.
జులై 2011 లో తెలంగాణ కోసం డిల్లీ లోని ‘ఇండియా గేట్’ వద్ద చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయిన యువకుడి మృత దేహాన్ని ఏపీ భవన్ వద్ద ప్రదర్శన కోసం అనుమతించలేదని, టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ హరీష్ రావు ఏపీ భవన్లో చంద్రరావు అనే పెద్ద వయస్సు అధికారిని అతని సీటు వద్దకు వెళ్ళి మరీ పిడిగుద్దులు గుద్దడానికి కారణం, రాజ్యాంగంలో ‘లెజిస్లేచర్’ చేయాల్సింది ఏమిటో ‘ఎక్జిక్యూటివ్’ చేయాల్సింది ఏమిటో స్పష్టత లేకపోవడం వల్లనే. తమ జాగాను దాటివచ్చి మరీ ‘ఎక్జిక్యూటివ్’ పని కూడా తామే చేస్తాము అనే తెపరితనమిది. ఇటువంటి విపరీత ధోరణిపై చేసిన వాస్తవ వ్యాఖ్యా ఇది అన్నట్టుగా ఈ వారంలోనే ఒక ఆంగ్ల పత్రికకు రాసిన ఎడిట్ పేజీ వ్యాసంలో జె.ఎన్.యూ. పొలిటికల్ స్టడీస్ ఎమిరిటస్ ప్రొఫెసర్ జోయా హాసన్- “పదేళ్ల పైగా అధికారాన్ని అప్రతిహతంగా అనుభవిస్తున్న దుర్భేద్యమైన బిజెపి కోటకు, అది అనుసరిస్తున్న ఆధిపత్య దుబారా వల్ల బీటలు మొదలయ్యాయి” అంటారు.
ఇప్పటికి పదేళ్లకు ముందు రాష్ట్ర విభజన జనరల్ ఎలక్షన్స్ ఒకేసారి వచ్చినప్పుడు, అమర్నాధ్ యాత్రికులను క్షేమంగా రాష్ట్రానికి చేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఉత్తరాదిన యాత్రీకులకు ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేసి, కెమెరాలు ముందు చేసిన హంగామా మర్చిపోవడం కష్టం. పర్యవసానాలు పట్టించుకోకుండా ఏదైనా ‘ఓపెన్’గా మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు- “అరే మా బస్సుల్లోకి ఎక్కిన వాళ్ళను కూడా టీఆర్ఎస్ వాళ్ళు గుంజుకు పోతున్నారు...” అంటూ బస్సులు వద్ద కెమెరాల ముందు నిలబడి అప్పట్లో మాట్లాడారు.
సరే ఇప్పుడు తెలుగు వారికి రెండు రాష్ట్రాలు వచ్చాయి, టిడిపి అధినేత సీబీఎన్ తన వారసుడికి పగ్గాలు ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు నిజానికి చేయాల్సింది ఏమిటి? మళ్ళీ నేపాల్ యాత్రికుల సందర్భంలో కూడా అదే పాత ధోరణి. ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ మంత్రిగా అనంతపూర్ సభకు కూడా రాకుండా, ఇక్కడే ఉండి మరీ ‘మిషన్ నేపాల్’ను ఆయన విజయవంతంగా పూర్తి చేశాడు అనేది ప్రజలకు చెప్పాలి అనేది లక్ష్యం. అయితే అక్కడ ఉత్తరాదిన జరిగింది ఏమిటి? ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ ఇలా అన్ని రాష్ట్రాలు ఇందుకోసం ‘హెల్ప్ లైన్స్’ ఏర్పాటు చేశాయి. ఏపీ, తెలంగాణలు డిల్లీ ఏపీ భవన్ లో కంట్రోల్ రూంస్ తెరిచాయి. కేంద్ర ప్రభుత్వం నేపాల్ లో చిక్కుకుని పోయిన వారిని తీసుకుని రావడానికి ‘ఇండిగో’ విమానాలు ఏర్పాటు చేసింది. అక్కణ్ణించి రోడ్డు మార్గంలో వచ్చే వారికి ఎటువంటి ఆంక్షలు లేకుండా వారు తమ స్వంత ప్రాంతాలకు చేరడానికి కేంద్రం ఏర్పాట్లు చేసింది.
ఇంత జరిగాక, 144 మంది ఏపీ ప్రయాణికులతో విమానం ఖాట్మాండ్ నుంచి విశాఖపట్టణం బయలుదేరే ముందు అందులోని హెయిర్ హోస్టెస్ తన ఫోన్ కు ముందుగా వచ్చిన మెసేజ్ ని ఆమె మైక్ లో చదవడం అందులో ఆమె ముఖ్యమంత్రి ఆయన కుమారుడి పేరు చెప్పి మరీ ప్రయాణికులు అందరూ కలిసి క్షేమంగా స్వస్థలాలకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసినందుకు థ్యాంక్స్ చెబితే, అందులోని ప్రయాణికులు అయితే వారి ఇద్దరికీ జిందాబాద్ చెప్పారు! ఎవరో ఒకామె అయితే, ఆ పార్టీ పేరు చెప్పి మరీ జిందాబాద్ చెప్పారు. డిల్లీలోని విమానయాన శాఖ మంత్రిది ఇందుకు సౌజన్యం అయితే కావొచ్చు. ఇక్కడ అర్ధం కానిది ఏమంటే, ఎపుడో నెహ్రూ రోజుల్లోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటూ మెడ్రాస్ నుంచి విడిపోయిన తెలుగువారి- ‘కామన్ సెన్స్’ మాటేమిటి? అనే ప్రశ్న అయితే జవాబు లేక అలాగే మిగిలిపోతున్నది.