గణపతి చరిత్ర : ఈ విశేషాలు మీకు తెలుసా..?
గజరతి జనిత గణపతి చరిత చెబుతున్న తెలంగాణ చరిత్రకారుడు ద్యావనపల్లి;
గణపతి పార్వతి కొడుకు కాదు. సతి కొడుకు. గణపతిని పార్వతి నలుగు పిండితో చేయలేదు. శివుడు తన భార్య సతి (పార్వతి కాకముందు) కోరిక మేరకు ఆమెతో గజరతి చేయడం వల్ల గజాననుడు పుట్టాడని తొలినాటి (వెయ్యేళ్ళ కిందటి) తెలుగు కావ్యం ‘కుమార సంభవం’ తెలుపుతుంది.
అంటే సుమారు వేయి సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ విశ్వాసం ప్రత్యేకించి దక్షిణ భారత దేశంలో, తెలుగు రాష్ట్రాలలో ప్రబలంగా ఉండేదని 'కుమార సంభవం' కవి నన్నెచోడుడు చెప్పాడు. ఆ కథనం (ప్రథమ ఆశ్వాసం పద్యాలు 69 - 110) ప్రకారం... పరిపూర్ణమైన అవయవాలు కలిగిన దివ్య కావ్యం అనెడి స్త్రీ సృష్టికి ప్రధాన సృష్టికర్తయైన బ్రహ్మ నియమం ప్రకారం విశ్వాన్ని సృష్టించడానికి దక్ష ప్రజాపతి సంకల్పించాడు. దీనికి ప్రకృతి రూపంలో ఉండే, మహామాయగా పేరుపొందిన, మూడు లోకాలకు ఆధారమైన శక్తిని భక్తితో పూజించాడు. వెంటనే ఆ శక్తి సుందరాకారంతో, ప్రకాశవంతమైన రూపంతో, హావభావాలతో ప్రత్యక్షమై — “నీకేం కావాలో కోరుకో”అంది. అప్పుడు దక్షుడు — “దేవీ! నీవు నా కుమార్తెగా పుట్టి, శివునికి భార్యవై, మీరు ఇద్దరూ రతి క్రీడలో ఏకమై లోకాల సృష్టికి బీజశక్తులుగా ఉండాలి. దయచేసి ఆ వరమును ఇవ్వు”అని ప్రార్థించాడు. మహాదేవి వరమిచ్చింది.
తర్వాత దక్షుడు జపం, ధ్యానం, స్తోత్రాల ద్వారా పరమేశ్వరుడిని సంతోషింపజేశాడు. “బ్రహ్మ, ఇంద్రులచే పూజింపబడే దేవాధినాథా! అన్నింటిని పొందాలని కోరుకుంటున్నాను. అందుకే నేను ముందుగా నీ దేవిని, సర్వ వస్తుస్వరూపిణిని, స్త్రీలలో శ్రేష్ఠురాలిని నా కుమార్తెగా చేసుకున్నాను. మీరు దంపతులై రతి క్రీడలో ఏకమైతేనే నా విశ్వసృష్టి ఫలిస్తుంది”అని దక్షుడు ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు దక్షుని భక్తికి సంతోషించి, సతీదేవిని భార్యగా స్వీకరించి, సతీదేవి అందమైన రూపం, యౌవనం, హావభావాలు, విలాసాలతో ఆకర్షితుడై, ఆమెతో రతిక్రీడలో మునిగిపోయాడు.
ఒకసారి వారు గజ (ఏనుగుల) వనంలో విహరించారు. అక్కడ ఎల్లప్పుడు అనేక విధాలుగా సంభోగించుచున్న మద గజముల రతిక్రీడను జూచి సతీదేవి వేడుకతో కూడిన యా రతిక్రీడయందే లగ్నమైన మనస్సునందలి కోరికతోడి దృష్టికాంతులను ఈశ్వరుని ముఖపద్మముపై పంపింది. శివుడు ఆమె మనసు అర్థం చేసుకొని అంగీకరించాడు. వెంటనే
క. సతి కరిణి యగుడుఁ ద్రిజగ
త్పతి కరియై కూడె; సతులు భావించిన యా
కృతిఁ గూడ నేర్ప కాదే
యతిశయముగ నింగితజ్ఞులకు(గు) ఫలమెందున్ ?
(సతీదేవి ఆడ యేనుగు రూపం ధరించగా శివుడు మగ ఏనుగు రూపం ధరించి గజరతిలో పాల్గొన్నారు. భార్య కోరుకున్న రూపంలో వారితో కలవడం కంటే గొప్ప ఫలితం మరొకటి ఉండదు.)
ఇలా శివుడు, సతీదేవి గజరతిలో పాల్గొనగా ఆ రతి క్రీడలోనే ఒక ప్రత్యేక రూపం కలిగిన కుమారుడు పుట్టాడు.
క. పురుషాకారముఁ, బటు మద
కరి వదనము, కుబ్జ పాద కరములు, లంబో
ధరము, హరినీల వర్ణముఁ
గర మొప్పఁగఁ దాల్చి విఘ్నకరుఁ డుదయించెన్.
(పురుష శరీరంతో, మదమత్త ఏనుగు ముఖంతో, పొట్టి కాళ్ళు, చేతులతో, వేలాడే పొట్టతో, నీలవర్ణంతో పుట్టిన ఆయనే విఘ్నకరుడు.)
అతడు పుట్టగానే భూమంతా పండుగలా మారింది. దేవదుందుభులు మ్రోగాయి. ఆకాశం ప్రకాశించింది. గంధర్వులు, కిన్నరులు పాటలు పాడారు. అప్సరసలు నాట్యం చేశారు. పుష్పవర్షం కురిసింది. దేవగజాల గుంపులు మదంతో విర్రవీగాయి. ఆ సమయానికి విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, దేవతలు, ఋషులు, లోకాల జనులు కైలాసానికి వచ్చి ఉత్సవం చేశారు. అందరి అభ్యర్థనపై శివుడు గణపతిని బ్రహ్మ, దేవతలు, గణాలన్నింటికీ అధిపతిగా నియమించాడు. అన్ని కార్యాల ఆరంభాధిపతిగా పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు పరమానంద సముద్రంలో విహరించాడు.
ఇది గజాననోత్పత్తి కథ. ఈ విషయమై డా. అనుగూరు చంద్రశేఖర రెడ్డి “విలోచనం”అనే పుస్తకంలో (పు. 22) నన్నెచోడుడికి రెండు మూడు శతాబ్దాల ముందే తమిళనాట గ్రంథస్థమై ఉందని కింది వివరాలు అందించాడు.
క్రీ.శ. 642 లో పల్లవ నరసింహవర్మ అనే తమిళనాడు రాజు కర్ణాటకలోని చాళుక్య రాజు రెండో పులకేశి రాజధాని వాతాపి (ఈనాటి బాదామి) పై దండెత్తి గెలువగా ఆయన సైన్యాధిపతి సిరితొండర్ (పరంజోతి) ప్రసిద్ధమైన వాతాపి గణపతిని తీసుకువెళ్ళి తమ తమిళనాడులోని తిరుచెంకట్టంకుడిలో ప్రతిష్టించాడు. ఆ తరువాత పదేళ్లకు క్రీ.శ. 652లో తిరు జ్ఞాన సంబంధార్ అనే సుప్రసిద్ధ తమిళ కవి 'తేవారం' అనే గ్రంథంలో గజాననోత్పత్తి వృత్తాంతాన్ని రాశాడు. ఇలా:
పిడియదన్ ఉరమై కొళమిగు కరియదు
వడికొడు తనదడి వళిపడుం అవరిడర్
కడిగణ పతివరం అరుళినన్ మిగు కొడై
వడినినర్ పయిల్ వలి వలమురై ఇరైయే
(సతీదేవి ఆడయేనుగు రూపాన్ని దాల్చగా శివుడు మగయేనుగు రూపాన్ని ధరించి క్రీడించినపుడు పుట్టినట్టివాడును, వలివలం గ్రామమున వసించినట్టివాడును అయిన గణపతి దానశీలురైన జనుల కష్టాలను తొలగించి రక్షించుగాక అని దీని తాత్పర్యం.)
ఈ కథనమే తమిళ వాఙ్మయంలోని వినాయక పురాణంలో కూడా వర్ణింపబడింది. నన్నెచోడుడు పై పద్యభావాన్ని యథాతథంగా అనుసరించినట్లు ముందు పేరాల్లో చూసాము. తమిళ, తెలుగు కథనాల ప్రకారం పార్వతి నలుగు పిండితో చేసిన గణపతి బొమ్మ కథ కన్నా శివసతుల గజరతి జనిత గణపతి కథనం ప్రాచీనమైనదని స్పష్టమవుతున్నది.
‘నీతిశాస్త్రముక్తావళి’ని రచించిన బద్దెనకు నన్నెచోడ నరేంద్రుడని, కావ్యచతుర్ముఖుడని, నన్నగంధ వారణుడని బద్దచోళ నరేంద్రుడని బిరుదులున్నట్లుగా తెలుస్తున్నది. కుమారసంభవ కర్తయైన నన్నెచోడుని పేరును ఇతను కలిగి ఉండడాన్నిబట్టి బద్దెన ఆ వంశంలోని వాడేనని, బహుశా నన్నెచోడునికి బంధువై ఉంటాడని వేదం వేంకటరాయ శాస్త్రి ఇలా వివరించారు: “నన్నెచోడ, బద్దెచోడు లిరువురును ఒకరివెంట ఒకరు రాజ్యమేలియో జీవించియో ఉండవలెను.” “దీనిని బట్టి నన్నెచోడుడు, బద్దెన సమకాలికులనే అభిప్రాయానికి రావడంలో సందేహమక్కరలే”దని అనుగూరు చంద్రశేఖర రెడ్డి అన్నారు.
ఒకవేళ బద్దెన, బద్దెగ ఒకరి పేరే అయితే వేములవాడ చాళుక్య రాజులలో ఒకరు బద్దెగ ఉన్నాడు. ఆయన కాలం క్రీ.శ. 850-895. కాబట్టి ఆయన సమకాలికుడు నన్నెచోడుడు రాసిన ప్రకారం క్రీ.శ. 9వ శతాబ్దం వరకు గణపతి శివసతుల గజరతి వల్లనే పుట్టాడని దక్షిణ భారత దేశంలో / తెలంగాణలో నమ్మేవారని అర్థమవుతుంది. ఆ తర్వాత కాలంలోనే పార్వతి నలుగు పిండితో గణపతిని చేసిందనే కథనం వ్యాప్తిలోకి వచ్చింది. కాజీపేట శాసనం ప్రకారం నన్నెచోడుడు క్రీ.శ. 1098 నాటివాడని భావిస్తే అప్పటివరకూ గణపతి పార్వతి చేసినవాడు కాదు, సతి గజరతి వల్ల పుట్టిన గజాననుడు. మరికొందరు పరిశోధకుల ప్రకారం నన్నెచోడుడు క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందినవాడు అనుకుంటే అప్పటివరకూ గజరతి జనిత కథనమే తెలుగునాట ప్రాచుర్యంలో ఉండేదని స్పష్టమవుతున్నది.
(తెలంగాణ చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ)