అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు కనమంటున్నారు.. ఇదేం రాజకీయం..?

ఉపాధి, వైద్యం, విద్యపై దృష్టి పెట్టి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించిన తర్వాతే జనాభా పెంపు గురించి చర్చించండి.;

Update: 2025-04-12 07:46 GMT
ఫోటో సోర్స్: పులిట్జర్ సెంటర్

గతంలో "బహుళ సంతానం వద్దు" అంటూ ప్రభుత్వ ఆదేశాలు, బలవంతంగా చేసిన శస్త్రచికిత్సలు, జనాభా నియంత్రణకు పెద్దఎత్తున చేపట్టిన చర్యలు – ఇవన్నీ ఇప్పుడు వ్యర్థమా? పిల్లలు ఎక్కువ ఉంటే రాజకీయ పదవులకు కూడా అర్హత లేకుండా చట్టాలు తీసుకువచ్చిన పాలకులు, ఇప్పుడు "పిల్లల్ని కనండి" మహా ప్రభూ అంటూ ప్రోత్సహించడం వెనక అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఈ మార్పు వెనుక అసలు నిజమైన కారణాలేమిటి? జనాభా పెరుగుదలపై కొత్త చట్టాలా? లేక అభివృద్ధి సూత్రాలా? ఇప్పటికీ నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు పెరుగుతూనే ఉన్నాయంటే, పాలకుల మాటల వెనుక రాజకీయాల అవసరమా లేదా ప్రజా సంక్షేమం ఉందా? ఆలోచించాల్సిన సందర్భం ఇది.

అప్పుడు అలా - ఇప్పుడు ఇలా?

1971ని దేశ చరిత్రలో గొప్ప విభజన సంవత్సరంగా చెప్పుకుంటాం. కానీ 2011 నాటికి పరిస్థితి ఏమైంది? ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జనాభా నియంత్రణ కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలు గుర్తున్నాయా? అప్పట్లో "మూడో సంతానం వద్దు" అంటూ ప్రచారం చేసిన పాలకులు, ఇప్పుడు ఎందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు? ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, అతని కుమారుడు డిప్యూటీ సిఎం దయానిధి స్టాలిన్ లు జనాభా పెంపుదలపై చేస్తున్న వ్యాఖ్యలకు అర్థమేంటి? మన దేశ వనరుల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి, ఉపాధి అవకాశాలు ఏమిటి? ఈ అంశాలు చర్చించాల్సిన అవసరం లేదా? పిల్లల్ని కనాలని ప్రోత్సహించే ముందు, వారికి తగిన వైద్య సేవలు అందించాలన్న బాధ్యత ప్రభుత్వాలపై ఉండదా ? కనీస జీవనోపాధి లేని ప్రజలకు, మరిన్ని పిల్లల్ని కనమని చెప్పడం న్యాయమేనా? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒకరు లేదా ఇద్దరు చాలు ముగ్గురు వద్దంటూ ప్రచారం చేశారు. చిన్న కుటుంబం – చింతలేని కుటుంబం అనే నినాదాలతో , మూడో సంతానం ఉన్నవారికి ఎన్నికల అర్హత లేకుండా చట్టాల్లో మార్పులు చేశారు. కానీ ఇప్పుడు, అదే నాయకులు పిల్లల్ని ఎక్కువగా కనాలని చెప్పడం తో ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు.

చైనా కథ వేరు...

చైనా ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం కఠినంగా వ్యవహరించింది. ఇప్పుడు యువ జనాభా తక్కువై, కార్మికుల కొరత ఏర్పడడంతో "పిల్లల్ని కనండి" అని పిలుపునిస్తోంది. కానీ చైనా విస్తీర్ణంగా ఉంది, జనాభా పెరిగినా సరిపడే వనరులున్నాయి. మన భారత దేశంలో పరిస్థితి భిన్నం. విస్తీర్ణ పరంగా చిన్నదే. దేశ విస్తీర్ణం పరిమితం, వనరులు తక్కువ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. విస్తీర్ణంలో భారత్‌కన్నా చైనా మూడింతలు పెద్దదైనా ఇక్కడి జనసాంద్రత మాత్రం చైనా కన్నా మూడింతలు ఎక్కువ. భారత్‌లో యువ జనాభా 34.8శాతంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగాలలో కొత్తగా చదువుకున్న యువ శ్రామిక శక్తి ప్రవేశానికి తగినంత వేతనంతో కూడిన ఉద్యోగాలను సృష్టించలేకపోయింది, ఇది పెరుగుతున్న నిరుద్యోగం రేటులో ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో యువత నిరుద్యోగిత రేట్లు ఇప్పుడు ప్రపంచ స్థాయి కంటే ఎక్కువగా ఉంది. మన దేశ జనాభాలో 116 కోట్ల మంది అల్పాదాయ వర్గానికి, 6.6 కోట్ల మంది మధ్యతరగతికి, 1.6 కోట్ల మంది ఎగువ మధ్యతరగతికి, సంపన్నులు కేవలం 20 లక్షల మందికి చెందినవారట. మరో 13.4 కోట్ల మంది నిరుపేదలని ప్యూ అనే పరిశోధనా సంస్థ అంచనా వేసింది.

డీలిమిటేషన్ ఎఫెక్ట్....

త్వరలో జరుగనున్న డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గిపోతాయనే ఊహాజనిత ప్రచారాన్ని నమ్మి, పిల్లల్ని కనండి అనే ఉచిత సలహాలు ఇస్తున్న నాయకుల మాటల్లో ప్రజా సంక్షేమం ఎక్కడ? సరే జనాభా ఆధారంగా నిధులు పంపిణీ చేస్తే దక్షిణాదికి నష్టమవుతుందని ఆందోళనేనా? కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరిగినా అభివృద్ధి జరిగిందా? కేంద్ర నిధుల పంపకం జనాభా ఆధారంగా సరైన విధానం కాదని వాదించలేరా? పేదరికం ప్రాతిపదికగా నిధులు పంపిణీ చేయాలని కోరాల్సిన సమయంలో, "జనాభా పెంచండి" అనే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రేరేపించడం సముచితమా? ఉత్తరాదికి నిధులు వరదలా పారుతున్నా అక్కడ అభివృద్ధి లేకపోతే, దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెంచుకోవడం వల్ల నిధులు పెరుగుతాయా? ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. ఇప్పటికే అధిక జనాభా కారణంగా దేశం నిరుద్యోగం, అభద్రతాభావం, ఉద్యోగాల నష్టం, అభివృద్ధి వైఫల్యాలు మరియు సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్న సందర్భంలో కూడ ఉన్నత స్థానాల్లో ఉన్న ముఖ్యులు అలా మాట్లాడడం బాధాకరం.

ఇకనైనా...

సమాజ అభివృద్ధి కోసం సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకులదే. కానీ అదే పాలకులు పరిస్థితిని తమ స్వలాభానికి ఉపయోగించుకునేలా మాట్లాడితే, ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశంలో జనాభాను నియంత్రించడం వల్లనే నేడు దేశంలో దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందున్న విషయం మరవద్దు. అధిక జనాభా కారణంగా ఉత్తరాది రాష్ట్రాలు ఏ మేరకు అభివృద్ధి చెందాయో పాలకులకు తెలియంది కాదు ! మరి అన్ని తెలిసి ఇలా తక్షిన రాజకీయాల అవసరాల కొరకు మాట్లాడడం భవిష్యత్తును దెబ్బతీయడమే కాక మరేమీ అవుతుందో ఆలోచించాలి. జనాభా పెంపుపై సరైన పరిశోధన, విశ్లేషణ లేకుండా, రాజకీయ అవసరాలకు అనుగుణంగా మారుతున్న పాలకుల మాటలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి.రాజకీయ అవసరాల కోసం ప్రజల జీవితాలతో ప్రయోగాలు చేయకండి. ఉపాధి, వైద్యం, విద్యపై దృష్టి పెట్టండి. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించిన తర్వాతే జనాభా పెంపు గురించి చర్చించండి.

(డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీస్టు; చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం)

Tags:    

Similar News