రామాయణం చెబుతున్న అప్సరసలు, గణికలు, వేశ్యలు ఎవరు?

రామాయణంలో నిరుత్తరకాండ-12 విశేషమేమిటంటే, సుమేరు, గ్రీకు ఇతిహాసాలలో కూడా అప్సరసలు కనిపిస్తారు.

Update: 2024-07-20 06:27 GMT

Source: aghori.it


దశరథుడు పంచిన పాయసం సేవించిన తర్వాత భార్యలు ముగ్గురూ గర్భవతులయ్యారని చెప్పడంతో బాలకాండ 16వ సర్గ ముగుస్తుంది. మరోసారి దేవతల రంగప్రవేశంతో 17వ సర్గ ప్రారంభమవుతుంది. విష్ణువు రావణసంహారం కోసం దశరథునికి కొడుకుగా పుట్టడానికి నిశ్చయించుకున్న తర్వాత; అందుకు సైన్యాన్ని సమకూర్చే పనిని వెంటనే బ్రహ్మ తన చేతుల్లోకి తీసుకొన్నాడు. విష్ణువుకు సహాయకులుగా బలవంతులు, కామరూపులు అయిన పుత్రుల్ని ఉత్తములైన అప్సరసల ద్వారానూ, గంధర్వస్త్రీలద్వారానూ వానరుల రూపంలో కనమని(అప్సరస్సు చ ముఖ్యాసు గంధర్వాణామ్ తనూషు చ/ సృజధ్వం హరిరూపేణ పుత్రాం స్తుల్య పరాక్రమాన్- బా. స. 17. శ్లో.5) దేవతలతో చెప్పాడు. వాళ్ళు అన్ని మాయలూ తెలిసినవారు, శూరులు, వాయువేగం కలిగినవారు, నీతిజ్ఞులు, బుద్ధిసంపన్నులు, విష్ణువుతో సమానమైన పరాక్రమం కలిగినవారు, దివ్యశరీరులు అయుండాలన్నాడు.

విష్ణువు నరుని అవతారం ఎత్తడం ఎందుకంటే, నరునివల్ల తనకు మరణభయం ఉండదని రావణుడు అనుకున్నాడు కనుక; వానరరూపంలో పుత్రుల్ని కనమని దేవతలకు బ్రహ్మ ఎందుకు చెప్పాడంటే, వానరుల వల్ల రావణునికి భయముంటుందని నందీశ్వరుడు శపించాడు కనుక! శత్రువు ఎత్తుకు పై ఎత్తు వేయడం, శత్రువు బలహీనతను గుర్తించి దానిని తమ బలంగా మార్చుకోవడం వంటి యుద్ధతంత్రాన్నే ఇవి గుర్తుచేస్తాయి.

అప్సరసలూ, గంధర్వస్త్రీల ద్వారా వానరసంతానాన్ని కనమని చెప్పడమే చూడండి; పార్వతి శపించిన కారణంగా దేవతలు తమ భార్యల వల్ల సంతానం పొందలేరనీ, అందుకే బ్రహ్మ అలా చెప్పాడనే -గోవిందరాజ, మహేశ్వరతీర్థుల వివరణను పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఉటంకించారు. కుమారుని కనడానికి శివపార్వతులు చేసే ప్రయత్నానికి దేవతలు అడ్డుపడడమే ఆ శాపానికి కారణం.

అదలా ఉంచితే, రామాయణంతో సహా పురాణ, ఇతిహాసాలలో తరచు ప్రస్తావనకు వచ్చే ఈ అప్సరసలు, గంధర్వస్త్రీలు ఎవరు, ఎలాంటివారన్న ప్రశ్న ఇక్కడ మళ్ళీ తలెత్తుతోంది. ‘అమరకోశం’ ఆధారంగా కొంత సమాధానం పొందడానికి ఇంతకుముందు ప్రయత్నించాం. రామాయణం, బాలకాండలోనే 45వ సర్గలో చెప్పిన ప్రకారం, దేవదానవులు కలసి చేసిన క్షీరసాగరమథనం నుంచి అప్సరసలు పుట్టారు; వారి సంఖ్య అరవై కోట్లు; వారు మంచి కాంతి(సువర్ఛసః)కలిగిన ఉత్తమస్త్రీలు(వరస్త్రియః); వారికి అంతకన్నా పెద్దసంఖ్యలో పరిచారికలున్నారు. అయితే, దేవదానవులలో ఎవరూ వారిని వివాహమాడకపోవడంతో వాళ్ళందరూ సాధారణస్త్రీలుగా పరిగణన పొందారు.

(న తాః స్మ పరిగృహ్ణంతి సర్వే తే దేవదానవాః/అప్రతిగ్రహణాత్తాశ్చ సర్వాః సాధారణాః స్మృతాః- బా. స.46. శ్లో.34).

పుల్లెలవారు ఇందులోని ‘సాధారణాః’ అనే మాటకు వేశ్యలని అర్థం చెప్పారు. మహర్షులు, రాజులు అప్సరసలద్వారా సంతానం పొందడం(గంధర్వస్త్రీల ద్వారా కూడా పొందిన ఉదాహరణలు ఎక్కడైనా ఉండవచ్చు) పురాణ, ఇతిహాసప్రసిద్ధమే కానీ, ఇప్పుడు దేవతలు కూడా వారితో చేరుతున్నారు.

దేవతాసంబంధంనుంచి తప్పించి లౌకికమైన భాషలో చెప్పుకుంటే; ఈ అప్సరసలు, గంధర్వస్త్రీలు వెనకటి మాతృస్వామ్యవ్యవస్థకు చెందిన అవశేషాలుగా, దాంపత్యబంధంలోకి రాకుండా స్వేచ్ఛాశృంగారానికి ప్రాతినిధ్యం వహించేవారుగా కనిపిస్తారు. మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్యం కుదురుకున్నాక వీరిని గణికలు(వేశ్యలు) అనే ప్రత్యేక తరగతిగా గుర్తించినట్టు కనిపిస్తుంది. రామాయణంలో ఋష్యశృంగుని ఉదంతంలో కూడా ‘గణిక’ శబ్దం కనిపిస్తుంది. చక్కని అందమూ, అలంకరణా కలిగిన గణికలను పంపించి, ఆకర్షణ కలిగించి ఋష్యశృంగుని అంగరాజ్యానికి రప్పించమని రోమపాదుని మంత్రులూ, పురోహితులూ సలహా ఇస్తారు(గణికాస్తత్ర గచ్ఛంతు రూపవత్యః స్వలంకృతాః- బా. స.10. శ్లో. 5).

డి.డి. కొశాంబి తన ‘మిత్ అండ్ రియాలిటీ(Myth and Reality)’ లో వివరించిన ప్రకారం, ఋగ్వేదంలో ఉన్న ‘విశ్’ అనే శబ్దం నుంచి ‘వేశ్య’ అనే మాట వచ్చింది. గుంపు పెళ్లిళ్లు సర్వసాధారణమైన సంచారజాతులలోని గణభార్యలను(clan-wives) ఈ మాట సూచిస్తూ ఉండవచ్చని కోశాంబి అంటాడు. మగవాళ్ళు అందరూ ఉమ్మడిగా నివసించే ఇంట్లో ఉండేదని- ‘విశ్య’ అనే మాటకు అర్థం. వ్యభిచారిణి అనే అర్థం తెచ్చుకున్న ‘వేశ్య’ అనే మాట ‘విశ్య’నుంచి పుట్టినదే అయినా, గణభార్యను సూచించే ‘గణిక’ అనే మాట ఎక్కువ స్పష్టతనిస్తుందని ఆయన అంటాడు. విశేషమేమిటంటే, సుమేరు, గ్రీకు ఇతిహాసాలలో కూడా అప్సరసలు కనిపిస్తారు. గిల్గమేశ ఇతిహాసంలో అడవిమనిషి ఎంకిడును ఒక దేవదాసి ఉరుక్ పట్టణానికి తీసుకువెడుతుందని ఇంతకుముందు చెప్పుకున్నాం.

(‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ అన్న ఈ వ్యాసకర్త గ్రంథంలో అప్సరసల గురించి మరింత వివరణను చూడవచ్చు)

ఇతిహాస, చరిత్రకాలాలతో మొదలుపెట్టి నేటి కాలం వరకూ భిన్న భిన్న కారణాలతో ఈ గణికావ్యవస్థ కొనసాగుతూనే ఉండడం గమనార్హం. దాంపత్యవ్యవస్థలో ఉన్న స్త్రీని కులాంగనగానూ, గృహిణిగానూ గుర్తించి ఆమె స్థానాన్ని ఉన్నతీకరిస్తే, ఆ దామాషాలోనే గణికను అధఃకరించడం జరుగుతూవచ్చింది. మహాభారతం, ఉద్యోగపర్వంలో, కృష్ణుడు కౌరవులవద్దకు రాయబారానికి వెళ్ళేముందు, ద్రౌపది కురుసభలో తనకు జరిగిన అవమానం గురించి కృష్ణుడికి వెళ్లబోసుకుంటూ, “కులాంగనను ఇట్లా చేస్తారా?” అని అడుగుతుంది-

(నీవు సుభద్ర కంటె కడు నెయ్యము గౌరవముం దలిర్ప సం/భావన సేయు దిట్టి నను పంకజనాభ యొకండు రాజసూ/యావబృథంబునందు శుచియై పెనుపొందిన వేణి పట్టి యీ/యేవురు చూడగా సభకు నీడ్చె కులాంగన నిట్లొనర్తురే- తిక్కన, ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసం, పద్యసంఖ్య 110).

కులాంగన కానివారి విషయంలో ఎలాగైనా వ్యవహరించవచ్చునన్న ధ్వని ఆ మాటలో ఉంది. స్త్రీలలో దాంపత్యవ్యవస్థలోకి వచ్చినవారు, రానివారనే రెండు తెగలు ఏర్పడినట్టు ఇది సూచిస్తుంది. ఈ రెండో తెగవారిని పురుషుడు తన చేతి పనిముట్టుగా మార్చుకొని ఎలాగైనా వాడుకునే వెసులుబాటూ ఏర్పడింది.

కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఈ దుర్వినియోగం (abuse) విశ్వరూపంలో కనిపిస్తుంది. గణికల కోసం ఒక ప్రత్యేకవిభాగాన్నే అది సిఫార్సు చేసింది. దానిని పర్యవేక్షించేవాడిని ‘గణికాధ్యక్షుడి’గా(Superintendent of Courtesans) పేర్కొంది. అతడే పెట్టుబడి పెట్టి రూప, యవ్వన, కళానైపుణ్యాలున్న వేశ్యలను గణికలుగా నియమిస్తాడు. వారి ఆదాయాన్ని తను తీసుకుని అందులోంచి కొంత వారి కుటుంబపోషణకు ఇస్తాడు. అలా నియమించిన గణిక పారిపోయినా, మరణించినా ఆమె కూతురు గానీ, సోదరి గానీ వృత్తి నడుపుతూ కుటుంబాన్ని పోషించాలి; లేదా మరణించిన గణిక తల్లి ఇంకో గణికను అప్పగించాలి. అవేవీ కుదరనప్పుడు ఆ కుటుంబానికి చెందిన ధనాన్ని రాజు స్వాధీనం చేసుకుంటాడు.

గణికకు ఏ రోజుకారోజు విటులనుంచి ఎంత ముట్టిందో, తల్లినుంచి ఎంత ధనం సంక్రమించిందో, ఇతర విధాలుగా ఎంత ఆదాయం వచ్చిందో, ఎంత ఖర్చు పెట్టిందో గణికాధ్యక్షుడు ఒక పుస్తకంలో నమోదు చేయిస్తాడు. ఆమె పెట్టే ఖర్చును కూడా నియంత్రిస్తాడు. రాజు ఫలానా పురుషుడి దగ్గరికి వెళ్ళమని ఆదేశించినా వెళ్లని గణికకు వెయ్యి కొరడా దెబ్బలు కానీ, అయిదు వేల పణాల జరిమానా కానీ విధిస్తారు. విటుని దగ్గర డబ్బు తీసుకుని కూడా అతనితో కలవకపోతే దానికి రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. గణిక రెండు రోజులలో సంపాదించిన మొత్తాన్ని ఒక మాసానికి పన్నుగా చెల్లించాలి. ఇలాంటి విధినిషేధాలు, నిర్బంధాలు ఇంకా అనేకరూపాల్లో ఉంటాయి. తన శరీరంమీదా, ఇతరత్రా కూడా తనకు ఎలాంటి స్వాతంత్ర్యమూ లేని ఈ గణికావ్యవస్థ ఒకవిధమైన వెట్టి చాకిరిగానూ, నిర్బంధవృత్తిగానూ, దాస్యంగానూ కనిపిస్తుంది. గణికకే కాక గణిక సంతానానికి కూడా ఈ దాస్యం వర్తిస్తుంది. దానినుంచి బయటపడాలన్నా డబ్బు చెల్లించాలి. ఇంకోవైపు, గణికల భద్రతకు ఉద్దేశించిన నిబంధనలూ ఉన్నాయి. ఉదాహరణకు, ఇష్టపడని గణికను నిర్బంధించి ఇంట్లో ఉంచుకున్నా, శారీరకంగా గాయపరచినా, ఆమె రూపాన్ని చెడగొట్టినా; చిన్న వయసులో ఉన్న గణిక సంతానాన్ని బలాత్కరించినా, అనుభవించినా శిక్ష ఉంటుంది.

ఇలా మంచి చెడుల కలబోతగా ఈ వ్యవస్థను నిర్మించడం చూస్తే, ఇతర వ్యవస్థలలానే దీనిని కూడా సమాజంలోని ఒక ముఖ్యాంగంగానూ, ఆదాయవనరుగానూ చూశారు తప్ప; స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాలరాసి ఆమె శరీరాన్ని అంగడి సరకుగా మార్చడంలోని నైచ్యాన్ని కానీ, హక్కుల హననాన్ని కానీ గుర్తించలేదని అర్థమవుతుంది. హుందాగా, గౌరవప్రదంగా జీవించడానికి మనిషికి గల హక్కు గురించిన స్పృహ అప్పటికింకా కలగకపోవడం కాలం విధించిన పరిమితిగా కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో, ఇతిహాస, పురాణాలు, శాస్త్రాలు ఇలాంటి అమానవీయవ్యవస్థలపై ఏదో ఒక రూపంలో సానుకూలత చూపిన సంగతిని కప్పిపుచ్చి, వాటిని అన్నివిధాలా ఆదర్శవంతమైనవిగా ఆకాశానికి ఎత్తడమూ సరికాదు.

అందచందాలు, ఆకర్షణ, ఇతర అర్హతలలో హెచ్చుతగ్గుల తేడాలను దృష్టిలో ఉంచుకుని ఈ గణికలనే రాజుకు ఛత్రచామరాలు పట్టడం, పానపాత్ర అందించడం; పీఠం దగ్గర, రథం దగ్గర సన్నిహితంగా ఉండడం వంటి చిన్న, పెద్ద సేవలకు జీతానికి నియమించాలని కూడా అర్థశాస్త్రం చెబుతోంది. అంతేకాదు, సాంప్రదాయికంగా గణికలు కాని వేశ్యలను; సంగీతం, నాట్యం, నటన, గడ ఎక్కి ఆడడం వంటి వృత్తులలో ఉన్న వారిని, దాంపత్యవ్యవస్థలోకి రాని ఇతర స్త్రీలను కూడా గణికలతో చేర్చి; శత్రురహస్యాలు తెలుసుకోడానికి, వాళ్ళను చంపడానికి, తప్పు దారి పట్టించడానికి వారిని ప్రయోగించాలని చెబుతోంది. చివరికి యుద్ధంతో సహా స్త్రీలను రాజకీయంగా వాడుకోని రంగం ఏదీ కనబడదు. యుద్ధభూమికి దగ్గరగా సేనను నిలిపే ప్రదేశం(స్కంధావారం)లో ఎవరు ఎక్కడ ఉండాలో అర్థశాస్త్రం చెబుతూ, సేనానాయకుని పర్యవేక్షణలో ప్రధానమార్గం వెంబడే వర్తకులు, వేశ్యలూ కూడా ఉండాలంటుంది. యుద్ధరంగంలో ఉన్న సైనికులకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించడానికి, వారి లైంగిక అవసరాలను తీర్చడానికి వేశ్యలను వెంటబెట్టుకుని వెళ్ళడం మన దగ్గరే కాక, ఇతర చోట్ల కూడా కనిపిస్తుంది. స్త్రీని దుర్వినియోగం చేయడానికి సంబంధించిన ఈ ఆనవాళ్ళు రామాయణంలో కూడా ఉన్నాయి కనుక, దీని గురించి ఈ మాత్రం వివరంగా చెప్పుకోవలసివచ్చింది.

***

తిరిగి ప్రస్తుత సందర్భానికి వస్తే, బ్రహ్మ చెప్పిన మీదట దేవతలే కాక, మహావీర్యవంతులైన ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, చారణులు కూడా వీరులైన కుమారులను వానరరూపంలో సృష్టించారు. ఈ క్రమంలో రామాయణప్రసిద్ధులలో, ఎలుగుబంటులలో శ్రేష్ఠుడైన జాంబవంతుని బ్రహ్మ చాలాముందే సృష్టిస్తే, వానరరాజైన వాలిని ఇంద్రుడు, అతని తమ్ముడైన సుగ్రీవుని సూర్యుడు, హనుమంతుని వాయుదేవుడు పుట్టించారు. ఆ తర్వాత వానరసేనానాయకులు వీరులైన వానరులను ఇంకా చాలామందిని కన్నారు...

మొత్తంమీద నర, వానరులను విడివిడిగా చూపిస్తూనే, వాళ్ళను దేవతాంశలుగా మార్చి తమ అధీనంలో ఉంచుకునే ప్రక్రియలో ఈవిధంగా మరో ఘట్టం పూర్తయింది. అయితే, ఈ వానరవీరులను పుట్టించడం గురించిన మొత్తం సమాచారంలో ఒక ముఖ్యమైన వివరం లోపించింది! అదేమిటంటే, దేవతాదులు పురుషులైన వానరవీరులనైతే సృష్టించారు కానీ, వారు మళ్ళీ సంతానం కనడానికి అవసరమైన వానరస్త్రీలను సృష్టించలేదు. అప్పుడు వారు ఎవరితో సంసారం చేసి సంతానం కన్నారన్న ప్రశ్న వస్తుంది. మిగతావారి సంగతి ఎలా ఉన్నా, వాలి భార్య తార, సుగ్రీవుని భార్య రుమ ప్రసిద్ధంగా కనిపిస్తారు. వీరు ఎవరన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ సమాచారలోపాన్ని రామాయణవ్యాఖ్యాతలు, ప్రవచకులు ఎత్తిచూపినట్లు లేదు. కనీసం ఈ వ్యాసకర్త పరిశీలించిన పుల్లెలవారి బాలానందినీ వ్యాఖ్యలో మాత్రం లేదు.

ఇంకో చిత్రమేమిటంటే, ‘మేఘాల గుంపుతోనూ, పర్వతశిఖరాలతోనూ సమానులు, మహాబలవంతులు, భయంకరమైన శరీరం కలిగినవారు, రామునికి సహాయం చేయడానికి పుట్టినవారు అయిన వానరసేనానాయకులతో భూమి అంతా నిండిపోయిం’దని- 17వ సర్గలో చివరిదైన 35వ శ్లోకం చెబుతోంది(బభూవ భూర్భీమశరీరరూపై/సమావృతా రామసహాయ హేతోః). ఇందులో కథకుని దృష్టినుంచే కాక, వ్యాఖ్యాతల దృష్టినుంచి కూడా తప్పించుకున్న చిన్నపాటి అనౌచిత్యం ఏమిటంటే, ‘రామునికి సహాయం చేయడానికి’ అనడం! అంటే, ఇంకా పుట్టకుండానే ఇలా రాముడి పేరు వచ్చేసింది. ‘నరుడిగా అవతరించబోయే విష్ణువు’కి అంటే సరిపోయేది.

అంతకన్నా ముఖ్యంగా ఏం జరిగిందంటే, రాముడు పుట్టకముందే రావణవధకు వ్యూహరచన జరిగి, యుద్ధకాండకు తెరతొలగడమే కాదు; సైన్యం కూడా సిద్ధమైపోయింది. ఇక రాముడు పుట్టడమే తరవాయి. విశేషమేమిటంటే, వానరవీరులు రాముడితోపాటు పుట్టారా, లేక రాముని కన్నా చాలాముందే పుట్టారా అన్న చర్చ పండితుల్లో ఉంది.

***

ఈ వ్యాసపరంపరను దశరథుడు కోసలకు రాజెలా అయ్యాడన్న ప్రశ్నతో మొదలుపెట్టి; పట్టమహిషి, రామాయణకథానాయకుని తల్లి అయిన కౌసల్య తల్లిదండ్రుల గురించి రామాయణంలో లేకపోవడం గురించి ప్రస్తావించుకుని; కథకుడు ఆమెను ఎంత ఆలస్యంగా కథలోకి ప్రవేశపెట్టాడో చెప్పుకుని; ఆ తర్వాత దశరథుని అశ్వమేధంలో ఆమె ఋత్విక్కుకు దక్షిణగా మారిన వైనాన్ని వివరించుకుని; ఋష్యశృంగుడూ, పుత్రకామేష్టి గురించిన కథనాల ద్వారా ఇక్కడి దాకా వచ్చాం...

మధ్యలో వదిలేసిన కౌసల్య గురించిన కథనాన్ని మళ్ళీ అందుకుని ముందుకు వెడదాం.....



Tags:    

Similar News