లూలూ మీద అంత వల్లమాలిన ప్రేమ ఎందుకో?
విశాఖలో, విజయవాడలో లూలూకి కారుచౌకగ్గా భూములివ్వడం తప్పేకాదు, అవినీతికి నిదర్శనం అంటున్న మాజీ ఐఎఎస్ అధికారి;
విశాఖపట్నం బీచ్ రోడ్ లో, హార్బర్ పార్క్ దగ్గరలో 13.74 ఎకరాల భూమిని అక్రమంగా లూలూ (LULU) అనే విదేశీ సంస్థ కు కేటాయించవద్దని, గతంలో ప్రభుత్వాన్ని పదేపదే హెచ్చరించాను. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కూడా లేఖ రాసి గుర్తు చేస్తున్నాను.
రాష్ట్ర ప్రభుత్వానికి, నేను 9-9-2023 న రాసిన లేఖ, అంతకు ముందు రాసిన లేఖలను, ఇక్కడ జత పరుస్తున్నాను.
LULU కంపెనీ పట్ల , రాష్ట్ర నేతలకు, అధికారులకు ఉన్న ఆప్యాయత, వ్యామోహం, రోజు రోజూ పెరుగుతున్నదనే విషయానికి నిదర్శనం, 27-7-2025 న, రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ జారీ చేసిన GOMs No 137. ఆ GO ద్వారా, ప్రభుత్వం, విశాఖ బీచ్ రోడ్డులో 13.74 ఎకరాలే కాకుండా, విజయవాడ నగరం నడిబొడ్డున, ప్రభుత్వ సంస్థ APSRTC వారి అతి విలువైన 4.15 ఎకరాల భూమినికూడా, LULU కంపెనీకి ధారాదత్తం చేసింది.
LULU కంపెనీకి, అంత విలువైన ప్రజల భూమిని ధారాదత్తం చేయడం, క్రిం ద సూచించిన విధంగా, చట్టవిరుద్ధం. ప్రభుత్వంలో అవినీతికి నిదర్శనం.
1. సివిల్ అప్పీల్ no 1132/2011 కేసు (జగపాల్ సింగ్ vs పంజాబ్ ప్రభుత్వం) లో, సుప్రీం కోర్టు వారు 28-1-2011 లో, స్థానిక సంస్థల ఆధీనంలో, ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించబడిన ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వకూడదని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం జరిగింది. అంటే, మీద ప్రస్తావించిన విశాఖ, విజయవాడ భూములను LULU కి బదలాయించడం, కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు అయింది.
2. విశాఖలో, LULU కి కేటాయించిన భూమి, CRZ పరిధిలో ఉంది. అటువంటి ప్రదేశం లో కట్టడాలు, బోర్ బావులు నిషేధించబడ్డాయి. బీచ్ రోడ్డు లో LULU ఎటువంటి కట్టడాలు చేపట్టినా, బోర్ బావులను ఉపయోగించినా, CRZ నిబంధనలను ఉల్లం ఘించడం అవుతుంది. AP హై కోర్టువారు WP No.169/2012 లో 8-10-2012 న ఇచ్చిన ఆదేశాల్లో, CRZ పరిథిలో బోర్ బావులను ఉపయోగించడం CRZ నిబంధనలను ఉల్లం ఘించడం అవుతుందని, ప్రభుత్వ సంస్థలను హెచ్చరించింది
3. 2012 లో, రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ విభాగం, GOMs No 571 dated 14-9-2012 ద్వారా జారీ చేసిన భూకేటాయింపు విధానం ప్రకారం. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు యథేచ్ఛగా బదలాయించకూడని, ఒక వేళ, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థకు కేటాయిస్తే, ఆ సంస్థవద్దనుంచి ప్రభుత్వం భూమి మార్కెట్ ధర మీద కనీసం 10% రెంట్ విధించాలని ఆదేశించింది. విశాఖ, విజయవాడ భూములు, ప్రజల భూములు, ప్రజా ప్రయోజనాల కోసమే ఉపయోగించాలి. ఎట్టిపరిస్థుతలోనూ, ప్రైవేట్ కంపెనీలకు బదలాయించకూడదు. విజయవాడ లో APSRTC భూములను LULU కి ఇవ్వడం ప్రజా విశ్వాసానికి వ్యతిరేకం. APSRTC మీద, రోజూ వేలాదిమంది సామాన్యప్రజలు ఆధారపడతారు. APSRTC వారి కార్యక్రమాలు ఏటా పెరుగడం దృష్టిలో పెట్టుకుని, ఆసంస్థ భూములను APSRTC వారికోసమే పరిరక్షిం చవలసిన బాధ్యత, ప్రభుత్వానికి ఉంది. LULU సంస్థ నిర్మించే మాల్ వంటి నిర్మాణాలు ధనికులకే గాని సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడవు. పైగా విశాఖ, విజయవాడ లో, ప్రభుత్వం LULU కి ఇవ్వతలచిన భూములు వందలాది కోట్ల రూపాయల విలువ ఉన్న భూములు. అంటే, అటువంటి భూములకు LULU కంపెనీ, సంవత్సరానికి 30-40 కోట్లరూపాయలకుపైగా, రెంట్ ప్రభుత్వానికి జమచేసినా, సరిపోదు.
4. విశాఖ, విజయవాడ భూములను, ప్రభుత్వం LULU కు, ఇతర రాయితీలతో, అతితక్కువ రెంటుకు లీజ్ మీద ఇస్తే, సుప్రీమ్ కోర్టువారు, 2జీ స్పెక్ట్ర మ్, బొగ్గు కుంభకోణం కేసుల లో ఇచ్చిన తీర్పులప్రకారం, అటువంటి నిర్ణయం అవినీతితో కూడిన నిర్ణయం గా పరిగణించాలి. అంటే, 2జీ స్పెక్ట్ర మ్, బొగ్గు కుంభకోణం కేసుల లో సుప్రీమ్ కోర్టు వారు ఆదేశించించినట్లు, అటువంటి నిర్ణయాలను తీసుకున్న నేతలమీద, ఆ నిర్ణయాల్లో భాగస్వాములైన అధికారులమీద, Prevention of Corruption Act, 1988 క్రిం ద, ఆతీర్పులకు అనుగుణంగా, దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది
5. LULU కంపెనీ విదేశీ సంస్థ. విశాఖ తీరప్రాం తంలో దేశభద్రతకు సంబంధించిన కార్యక్రామాలు నిరంతరం జరుగుతాయి. అటువంటి నేపథ్యంలో, ఒక విదేశీ కంపెనీకి, ఆప్రాం తంలో, అటువంటి భూమిని కేటాయించడం సబబుగా లేదు. అటువంటి భూమి కేటాయింపు, దేశభద్రతకు వ్యతేరేకంగా కనిపిస్తున్నది 6. ఇటువంటి నిర్ణయాలను ప్రభుత్వం ఏకపాక్షికంగా తీసుకోవడం ప్రజాస్వామ్యవిధానాలకు వ్యతిరేకం. ఐదేళ్లకోమాటు ఎన్నికలలో రాజకీయపార్టీలు గెలిచినా, ప్రజలకు చెందిన భూములవిషయంలో, ప్రభుత్వం కేవలం ప్రజల తరÛన ట్రస్టీ గా మాత్రమే వ్యవహరించాలిగాని, జమిందారీ వ్యవస్థలో లాగ, ప్రజలభూములను యథేచ్ఛగా, కావాల్సిన ప్రైవేట్ కంపెనీలకు, తక్కువధరకు ఇవ్వడం, ప్రజల నమ్మకాన్ని కించపరచడమవుతుందని ప్రభుత్వం గుర్తిం చాలి. నా ఉద్దేశంలో, ఇటువంటి అక్రమమైన, చట్టవిరుద్ధమైన భూమి కేటాయింపు విషయంలో, కేంద్ర దర్యాప్తు సంస్థ CBI దర్యాప్తు చేయడం అవసరం. అటువంటి దర్యాప్తు జరిగితే, నిజానిజాలు బయటపడతాయి.
ఈ లేఖ నకళ్ళను, కేంద్రప్రభుత్వానికి, సిబిఐ (CBI )కి, ఇడి కి (Enforcement Directorate )కి పంపు తున్నాను.