వందే భారత్ రైలు నిండడానికి ఇంత చేయాలా?
జనరల్ లేదా స్లీపర్ బోగీల్లో ప్రయాణం చేయాల్సిన ప్రజలు కూడా ఖరీదైన వందే భారత్ వంటి ప్రత్యేక రైళ్లని అయిష్టంగా ఎక్కి తీరాల్సిన స్థితిని సృష్టిస్తున్నారా?
By : The Federal
Update: 2024-05-25 10:40 GMT
-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
నా అత్యవసర నెల్లిమర్ల టూర్ లో 'వందే భారత్' ట్రైన్ అనుభవం గూర్చి!
22-5-2024న ఉదయం ఓ విషాద వార్త విన్నా. నెల్లిమర్ల సమీపంలోని జరజాపుపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ జూట్ వర్కర్ కాళ్ళ సత్యనారాయణ గారి (75) మృతి వార్త అది. ఆ సాయంత్రమే అంత్యక్రియలు! కడచూపు చూడాలనుకున్నా. అందుకు కారణం ఉంది.
సత్యనారాయణ, ఆనందమ్మ దంపతులకు ఒక్కడే కొడుకు. పేరు సన్యాసిరావు. 1994 నెల్లిమర్ల కాల్పుల తర్వాత కార్మికోద్యమానికి ప్రభావితుడై పిడిఎస్ యు కార్యకర్త గా, ఆర్గనైజర్ గా, రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎదిగాడు. లా పూర్తి చేశాడు. న్యాయవాదిగా విజయనగరం కోర్టులో ప్రాక్టీస్ సాగిస్తూ ఇఫ్టూ జిల్లా సహాయ కార్యదర్శిగా పని చేశాడు. మా పార్టీ నన్ను సంస్థాగత అవసరాల దృష్ట్యా 2007 లో హైదరాబాద్ కి షిఫ్ట్ చేసింది. నేను నెల్లిమర్ల సహా వివిధ జూట్ మిల్లుల కార్మిక సంఘాల నాయకత్వ స్థానం నుండి రిలీవ్ కావాల్సి ఉంది. అప్పుడు లోటు ఏర్పడ్డ నిర్దిష్ట పరిస్థితుల్లో సన్యాసిరావు పార్టీ పూర్తికాలం ఆర్గనైజర్ గా పని చేయడానికి సిద్ధపడ్డాడు.
న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి కార్మికవర్గ ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం సముచిత నిర్ణయం తీసుకున్నాడు. పార్టీ, ఇఫ్టూ సంస్థలిచ్చిన బాధ్యతని పదేళ్లకు పైగా జయప్రదంగా నిర్వహించాడు. పూర్తికాలం పని నుండి 2017 లో డ్రాప్ అయ్యాడు. లాయర్ ప్రాక్టీస్ చేపట్టినా రాజకీయ, నిర్మాణ నిబద్ధత కొనసాగిస్తున్నాడు.
ఆయన తల్లిదండ్రుల పాత్ర విశిష్టమైనది. ఒకవైపు పేగు బంధం, మరోవైపు ప్రియతమ సంస్థతో ప్రేమబంధం మధ్య మానసికంగా నలిగిపోయారు. ఓ పదేళ్లకి పైగా మానసిక క్షోభ అనుభవించారు. ఎందుకంటే, ఓవైపు ఇఫ్టూని ఆదరిస్తూనే, మరోవైపు తమ కొడుకు ఇంటి బాధ్యత వదిలేసి పూర్తికాలం పనిచేయడాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఇఫ్టూకి నేతృత్వం వహిస్తున్న నేను మాత్రం వారి మనస్సుల్లో మంచివాణ్ణి! అదే ఇఫ్టూలో పని చేస్తున్న కొడుకు మంచివాడు కాదు. ఇదీ ఆనాటి వారి మానసిక స్థితి.
వేలాది కార్మిక కుటుంబాల కోసం పని చేసే నేను వారి దృష్టిలో ప్రియతమ కార్మిక నేతను! తమ కుటుంబానికి అక్కరకు రాని కొడుకు మాత్రం పనికి మాలిన వాడు! ఓకే లక్ష్యం కోసం పని చేసే మా ఇద్దరం వారి దృష్టిలో ఒకరు హీరో, మరొకరు విలన్!
ఇంకోమాట! సన్యాసిరావుతో పాటు వారి మనస్సుల్లో నేనొక కొడుకును. ఇద్దరు కొడుకుల్లో ఒకరు విలన్! మరోకరు హీరో!
కన్న కొడుకుని కడుపు తీపితోనైనా సూటిపోటి మాటలు అంటూ, నన్ను మాత్రం వారి ఇంటికి వెళ్లిన సమయాల్లో ప్రేమపూర్వక గౌరవాన్ని ప్రదరిస్తుండడం నా మనస్సుని కలచి వేస్తుండేది. కార్మికోద్యమ చరిత్రలో ఇలా పరస్పర విరుద్ధమైన ద్వైదీ భావం, ఎందుకుంటుందో ఓ పరిశీలనాంశమేనేమో!
పై నేపథ్యంలో ఆయన మృతి సందర్భంగా భౌతికకాయాన్ని కడచూపు చూడడం కనీస రాజకీయ, నైతిక, సాంఘిక ధర్మంగా భావించా.
రెండు నెలల క్రితం ఆయన నరాల వ్యాధిగ్రస్తుడయ్యారు. చికిత్స తర్వాత సైతం ఆయన ఆరోగ్యస్థితి మెరుగుపడలేదు. సఫర్యక చర్యల్ని చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలిసిన వెంటనే నా సహచరి పద్మ ఏప్రిల్ 6న నెల్లిమర్ల వెళ్లి పరామర్శ చేసి వచ్చింది. పని వత్తిళ్ళ వల్ల నేను ఇంతవరకూ వెళ్లలేక పోయా. సజీవంగా చూడలేకపోయినా భౌతిక కాయాన్నైనా సందర్శించాలని భావించా. ఆ అంత్యక్రియలకు విశాఖ, విజయనగరం, కొత్తవలస, పార్వతీపురం, బొబ్బిలి, శ్రీకాకుళం, సాలూరు, పూసపాటి రేగ, భోగాపురం వంటి ప్రాంతాల నుండి అనేక మంది కామ్రేడ్స్ హాజరైనా, వారి కంటే సుదూర ప్రాంతం నుండి వెళ్ళడానికి కారణం పై పూర్వ రంగమే. ఆ ప్రయాణంలో ఓ అనుభవాన్ని ఎదుర్కొన్నా. అదే వందే భారత్ ట్రైన్లో ప్రయాణం!
మరణవార్త ఉ. 6amకి అందింది. మ. 3 కి అంత్యక్రియలు. నేను విజయవాడలో వున్నా. అవి నెల్లిమర్ల వద్ద జరజాపుపేట లో. దూరం 400 కి.మీ. పైగా! చేరే వ్యవధి 9 గంటలు ఉంది. రత్నాచల్ ఎస్ప్రెస్ టైం దాటి పోయింది. విజయవాడ to విజయనగరం ట్రైన్స్ లేవు. విజయవాడ to విశాఖ ట్రైన్స్ లేవు. రైళ్లు రద్దు.. రద్దు.. రద్దు. ఉన్నదొక్కటే వందే భారత్! మన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేదు. వందే భారత్ ట్రైన్ ప్రయాణానికి సిద్ధపడ్డా. నాకు అత్యవసరం. వందే భారత్ వ్యవస్థకి ఓ సదవకాశం.
విజయవాడ స్టేషన్ కి వందే భారత్ 9-10am కి రావాలి. 7 నిమిషాలు ముందే చేరింది. మ. 1-50 కి విశాఖ స్టేషన్ కి చేరాలి. పావుగంట ముందే 1-35 pm కి చేరింది. నిజానికి ఈ ఎడ్వాన్స్ డ్ ఎరైవల్స్ ఈ రైటప్ రాయడానికి ప్రధాన కారణం.
ఇటీవల ఇండియన్ రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి, ప్రజల నిరసనకు గురౌతోంది. పలు ప్యాసెంజర్ రైళ్ల రద్దు. సౌకర్యాలు పెంచకుండానే ప్యాసెంజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్ళుగా పేరు మార్పు. ఎక్స్ ప్రెస్ రైళ్ళల్లో జనరల్ భోగీల కుదింపు లేదా రద్దు. స్లీపర్ కోచెస్ ని AC భోగీలుగా మార్చడం. థర్డ్ AC భోగీల్ని సెకండ్ AC భోగీలుగా మార్పు. సెకండ్ AC భోగీల్ని ఫస్ట్ AC భోగీలుగా మార్పు. ఇంజిన్ నుండి గార్డు వరకూ టోటల్ ట్రైన్ AC గా మార్పు. వందే భారత్' వంటి స్పెషల్ ట్రైన్స్ ప్రవేశ పెట్టడం!
ఇంకా...మిగిలిన సాధారణ రైళ్లను కూడా రద్దు చేయడం. నడిచే రైళ్ల విషయంలో కూడా లేటు రన్నింగ్. గంటల కొద్దీ ఆలస్యం. కేవలం ఒక్కరోజు ముందు హఠాత్తుగా కొన్ని ట్రైన్స్ రద్దు. ఇలాంటి రకరకాలుగా రైల్వే వ్యవస్థలో కుసంస్కరణలు.
ఫలితంగా... రైల్వే స్టేషన్లలో సామాన్య జనం పడిగాపుల దృశ్యం. రైళ్ల లేటు రన్నింగ్ వల్ల ప్లాట్ ఫాం లపై పూటల కొద్దీ ప్రయాణీకుల నిరీక్షణ దృశ్యం. దేశంలో కోట్లాది మంది ప్రయాణీకుల వేదన, వ్యధ. అంతేనా, ఇంకా... ఇండియన్ రైల్వే వ్యవస్థని స్వాధీనం చేసుకునే ముందు వేల కోట్ల ప్రభుత్వ ధనంతో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణని చేయించి తమ చేతుల్లోకి స్వాధీనం చేసుకునే బడా కార్పొరేట్ల వ్యూహరచన. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల, మౌళిక సదుపాయాల కోసం భారీ పునర్నిర్మాణ పనులు. తత్ఫలితంగా రైల్వే స్టేషన్ల సుందరీకరణ దృశ్యాలు.ప్రజల దృష్టిలో అస్తవ్యస్తంగా దిగజార్చబడుతోన్న ది గ్రేట్ ఇండియన్ రైల్వే వ్యవస్థ లో సుందరీకరణ చిత్రం ప్రజల నెత్తుటి గాయాల మీద వాలే ఈగల అందచందం వంటిది.
పై నేపథ్యంలో నేను వందే భారత్ ని పరిశీలన చేశా.
ఆరోజు నేనెక్కిన వందే భారత్ లో సౌకర్యాలను చూడలేదు. ప్రయాణీకులు వాటికి చేసే ఖర్చుని చూశా. అంతకంటే మించిన అత్యంత ప్రమాదకర ప్రభుత్వ ఫాసిస్టు విధానాలను గమనించాను. వందే భారత్ వంటి రైళ్లని ఎక్కించడానికి ఇతర రైళ్లు ఎక్కే కోట్లాది ప్రయాణీకుల్ని కష్టాలపాలు చేసే హింసాత్మక ప్రభుత్వ విధానాన్ని చూశా.
వాస్తవ సామాజిక అభివృద్ధి క్రమంలో సామాన్య ప్రజల నికర జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఆ క్రమంలో సాధారణ రైళ్లు నడిపిస్తున్నా, నికర జీవన ప్రమాణాలు పెరిగిన ప్రజలు మెరుగైన సౌకర్యవంతమైన ప్రయాణాలకు మొగ్గుతారు. జనరల్ భోగీల ప్రయాణం వదిలేసి, రిజర్వేషన్ భోగీల్ని ఆశ్రయిస్తారు. స్లీపర్ కోచెస్ నుండి థర్డ్ AC కి మారతారు. థర్డ్ AC నుండి ఫస్ట్ AC కి మారతారు. ఆ క్రమంలో విమనయానం వైపు కూడా మొగ్గుతారు. ఏ దేశాల్లోనైనా ఏ సమాజంలోనైనా ప్రజల నికర జీవన ప్రమాణాలు పెరిగే క్రమంలో ఇలాంటి 'ప్రొగ్రెసివ్ షిఫ్టింగ్' జరుగుతుంది. అది సహజ సామాజిక అభివృద్ధి. అది ఆహ్వానించదగింది.
సమస్త ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు పొందిన పరిస్థితుల్లో సౌకర్యవంతమైన మెరుగైన ప్రయాణాలు చేసే సానుకూల స్థితి రావడం వేరు. కార్పొరేట్ల ప్రయోజనాలకోసం ప్రభుత్వమే కోట్లమంది ప్రజలు ప్రయాణించే సాధారణ రైల్వే వ్యవస్థను వ్యూహాత్మకంగా అస్తవ్యస్తం చేసే హింసాత్మక విధానంలో భాగంగా ప్రజల్ని వందే భారత్ వంటి వాటి వైపు దారి మళ్లించడం వేరు. మొదటిది పురోగమన సామాజిక చలనం క్రిందికి వస్తుంది. రెండవది తిరోగమన సామాజిక చలనం క్రిందికి వస్తుంది.
తమ ఆర్ధిక పరిస్థితి రీత్యా సాధారణ రైళ్ళల్లో జనరల్ లేదా స్లీపర్ బోగీల్లో ప్రయాణం చేయాల్సిన ప్రజలకు వందే భారత్ వంటి ప్రత్యేక రైళ్లని అయిష్టంగా ఎక్కి తీరాల్సిన స్థితిని కృత్రిమంగా సృష్టించే వ్యూహాత్మక శాడిస్టు రాజకీయ విధానమిది. ఒక్కమాటలో చెప్పాలంటే టెర్రరిస్టు పాలనా విధానమిది.
టెర్రరిజం పలు రకాలు. పొలిటికల్ టెర్రరిజం. ఎకనామిక్ టెర్రరిజం. సోషల్ టెర్రరిజం.
కల్చరల్ టెర్రరిజం. ఇలా ఎన్నోరకాల టెర్రరిజం.
టెర్రరిజానికి బ్రాండ్ సింబల్స్ గా AK-47 లేదా AK 56 కొన్ని దశాబ్దాలుగా చెలామణిలో వున్నాయి. వారు గుహల్లో లేదా లోయల్లో లేదా కొండల్లో లేదా అడవుల్లో దాగి రాజ్యం మీద ప్రైవేటు దొంగదెబ్బ తీయడాన్ని సాధారణంగా 'పొలిటికల్ టెర్రరిజం' అని అంటారు. గత తరం దృష్టిలో పొలిటికల్ టెర్రరిజం యిది.
కాలం మారింది. పరిస్థితులు మారాయి. కాలంతో పాటు 'టెర్రరిజం' రూపాలు కూడా మారాయి. కొత్తరకాల, కొత్త రూపాల 'టెర్రరిజాలు' క్రమంగా ఉనికిలోకి వచ్చాయి. వాటికి నిర్వచనాలు కూడా కొత్తగా ఉనికిలోకి రావడం సహజం.
గత 'పొలిటికల్ టెర్రరిజం' వెనక వరసలోకి వెళ్ళింది. 'నాన్ పొలిటికల్ టెర్రరిజం' ముందు వరసలోకి వస్తోంది. 'ప్రైవేటు టెర్రరిజం' రెండోదిగా మారింది. 'ప్రభుత్వ టెర్రరిజం' తొలి స్థానానికి చేరుతోంది. భయోత్పాతం సృష్టించడం, హింసించడం టెర్రరిజమైతే, అది సాయుధంగా మాత్రమే జరగాలనే నియమం లేదు.
సాయుధంగా రక్తపాతంతో హింసించే భౌతిక విధానమే కాకుండా మానసికంగా, సాంఘికంగా హింసించేది కూడా టెర్రరిజం ఐనట్లైతే, అది క్రమంగా విస్తృతమై ఆర్ధిక *టెర్రరిజంగా, సాంస్కృతిక టెర్రరిజంగా, సామాజిక టెర్రరిజం గా మారుతుంది. ఈ విస్తృత నిర్వచనం ప్రకారం టెర్రరిజాన్ని పరిశీలించాలి. 'సాయుధ టెర్రరిజం' క్రమంగా బలహీనపడుతూ 'నిరాయుధ టెర్రరిజం' బలపడుతోంది. 'రక్తపాత టెర్రరిజం పూర్తిగా తెరమరుగు కాకపోయినా, 'రక్తరహిత టెర్రరిజం' మాత్రం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇండియన్ రైల్వే వ్యవస్థ ను నిరాయుధ టెర్రరిస్టు సంస్థగా మార్చే మోదీ ప్రభుత్వ వైఖరికి వందే భారత్ ఓ నిదర్శనం.
అల్పసంఖ్యాకులైన ఆర్ధిక స్థోమతు గల వారికి మాత్రమే వందే భారత్ వంటి రైళ్లని ఎక్కే అవకాశం గల దేశమిది. వాటికోసం కోట్లాదిమంది దేశ ప్రజలు ప్రయాణించే సాధారణ రైళ్లను ఉద్దేశ్యపూర్వకంగా రద్దు చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా వారిని మానసికంగా హింసించే విధానం ఉగ్రవాదం ఎందుకు కాదు? కోట్లాది ప్రయాణీకుల్ని నిరాయుధంగా రైల్వే ప్లాట్ ఫాం లపై పడిగాపులు కాసే స్థితిని సృష్టించడం ఉగ్రవాదం ఎందుకు కాదు? 'ఇండియన్ రైల్వే వ్యవస్థ' క్రమంగా ఆర్ధిక టెర్రరిస్టు సంస్థగా పరివర్తన చెందుతుందా? ఈ ప్రశ్నలు వేసుకొని తగు జవాబులు వెతుక్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందేమో!
(ఇందులో వ్యక్తీకరించిన వన్నీ రచయిత సొంత అభిప్రాయాలే. వాటికి ‘ది ఫెడరల్ -తెలంగాణ’కు సంబంధం లేదు.)