బంగారం కొనేనుందుకు ఇది అనువైన సమయమా?

నిపుణులు ఏమంటున్నారు?;

Update: 2025-05-03 10:26 GMT

అమాంతం లక్ష దాటిన బంగారం ధరలు దిగివచ్చాయి. మరి ఇక్కడే కొంతకాలం స్థిరంగా వుంటాయా? మరికొంత తగ్గుతాయా?ఇదే బంగారం కొనేందుకు సరియైన సమయమా.. మరికొంత సమయం వెయిట్ చేయాలా? ఈ ప్రశ్న అందరినీ తొలిచివేస్తోంది.గత 10 రోజుల్లో బంగారం ధరలు 10 గ్రాములకు రు.7,000 కంటే ఎక్కువ తగ్గాయి, ఏప్రిల్ 22, 2025న నమోదైన ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి రు. 1,00,484 నుండి శుక్రవారం నాటికి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 93,300కి తగ్గాయి.

అయితే, శుక్రవారం ధర గురువారం నాటి 92,325 రేటు నుండి 950 తిరిగి పుంజుకుంది, ఇది స్వల్ప గ్యాప్-అప్ ఓపెనింగ్ తర్వాత ధరలలో బలమైన రికవరీని సూచిస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో, కామెక్స్ (COMEX) బంగారం 3,200 డాలర్ల దగ్గర కీలకమైన మద్దతును కొనసాగించింది, అమెరికా వాణిజ్య ఒప్పందాలలో అనిశ్చితి మధ్య సెంటిమెంట్ కొనసాగుతోంది.

ఎలాంటి స్పష్టత లేకపోవడం కూడా మార్కెట్ లో పాల్గొనేవారి షార్ట్-కవరింగ్‌కు (Short Covering) దారితీసింది. బంగారం ధరల వేగాన్ని పెంచింది.అయితే

2025 సంవత్సరానికి బంగారంపై పెట్టబడులపై విశ్లేషకులు ఆశాజనకంగా వున్నారు.ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో ద్రవ్యోల్బణ ఆందోళనలు , కొనసాగుతున్న కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు కీలక కారకాలుగా పేర్కొంటున్నారు.

అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు తగ్గడం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణతో బంగారం ధరలు రికార్డు స్థాయి నుంచి పతనమయ్యాయి. ట్రేడ్ ఒప్పందాలపై సానుకూల సంకేతాల నేపథ్యంలో.. ధరలు తగ్గుతున్నాయని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశమా లేదా అనేది వేచి చూడాలి.ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతల సడలింపు సురక్షితమైన ఆస్తులకు డిమాండ్‌ను తగ్గించింది. పెట్టుబడిదారులు లాభాలను పొందేలా చేసింది.

దీర్ఘకాలిక డిమాండ్ ఎలా వుండబోతోంది?

దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల చుట్టూ ఉన్న అనిశ్చితుల మధ్య బంగారం ధరలు పెరుగుతాయని, ఇది కొత్త ఊపును అందిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే దక్షిణ కొరియా, జపాన్ ,భారతదేశంతో అనుకూలమైన వాణిజ్య ఒప్పందాలు, చైనాతో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సానుకూల వ్యాఖ్యలతో మార్కెట్ తీరులో మార్పు కు దారితీసిందని నిపుణులు తెలిపారు.అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా తమ లాభాలను స్వీకరించడం మొదలుపెట్టారు. ఇది సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం డిమాండ్‌ను తగ్గించింది.

యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అభిప్రాయం ప్రకారం, అనేక ప్రధాన వాణిజ్య భాగస్వాములు యుఎస్ సుంకాలను తగ్గించడానికి బెస్ట్ డీల్స్ కుదుర్చుకున్నారు.అలా ఒప్పందాన్ని ఖరారు చేసుకున్న దేశాలలో ఇండియా మొదటి వరుసలో ఉంటుందని అంటున్నారు. క్షీణిస్తున్న ఉద్యోగ మార్కెట్ కు ఊపు వచ్చే వరకు వేచి ఉన్నందున, స్వల్పకాలిక వడ్డీ రేట్లు మారవని US ఫెడరల్ రిజర్వ్ (Federal Reserve) విధాన నిర్ణేతలు (decision-makers) సంకేతాలను ఇచ్చారు. పెరిగిన వడ్డీ రేట్లు బంగారం వంటి వడ్డీ రాని వాటిపై ఆసక్తిని తగ్గించాయి.

బంగారం ధరలు మరింత తగ్గుముఖం పడతాయా?

బంగారం ధరలు ఇంకా దిగువకు వస్తాయా? పరిస్థితులు ఎలా వుంటాయన్న దానిపై విశ్లేషకుల అభిప్రాయం భిన్నంగా వుంది. బంగారం ర్యాలీలో అత్యంత గరిష్ట మైనది ఇప్పటికే ముగిసిందని ,బంగారం అనేక దిద్దుబాట్లను ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు నమ్ముతున్నారు.

మూడు రోజుల్లో బంగారం ధరలు రు.90,000 నుండి రు.99,000 కు పెరగడం ఒక ప్రోత్సాహక ర్యాలీ అని నిపుణులు వివరిస్తున్నారు, భారీగా ధర పెరిగిన సమయంలో ఏ కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయలేదు. భారతదేశం , చైనా ఆభరణాల డిమాండ్ కూడా మందగించింది. చైనాపై అమెరికా విధించిన 145% సుంకం ప్రపంచంలోని రెండు అగ్ర దేశాల ఆర్థిక వ్యవస్థలలో తీవ్ర మందగమనానికి (slow down) దారితీస్తుందనే భయం మాత్రమే దీనికి కారణం. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం(recession) ఆందోళనలు ఉన్నాయి . ఆ భయాలన్నీ ఆ పారాబొలిక్ చర్యకు (parabolic action) దారితీశాయి అని వారు హైలైట్ చేశారు. ఈ రకమైన చర్య దశాబ్దానికి ఒకసారి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గరిష్ట స్థాయిలను పరిగణనలోకి తీసుకుంటే మనం ఇప్పటికే గరిష్ట స్థాయిని చూశామని, ఇప్పుడు కొన్ని సానుకూల అంశాలతో ధర కొద్దిగా తగ్గి స్థిరంగా వుండొచ్చంటున్నారు. కాబట్టి బంగారంలో లాభాల స్వీకరణ కొనసాగుతుందని వారు నమ్ముతున్నారు.

ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ (LKP Securities)కు చెందిన కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ (Commodity & Currencie reesarch)అనలిస్ట్ జతిన్ త్రివేది అభిప్రాయం ప్రకారం.. వాణిజ్య ఒప్పందాలపై ఆశల నేపథ్యంలోనే బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. కొమెక్స్‌ (COMEX)లో 38 డాలర్లు తగ్గి 3275 డాలర్లకు చేరగా, ఎంసీఎక్స్‌లో 1,650 రూపాయలు తగ్గి రు.93,950 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు తగ్గడంతో.. పెట్టుబడిదారులు నిరాశ చెందినా,ఇదే సమయంలో భౌతికంగా కొనుగోలు చేసేవారికి ఇది మంచి పరిణామం అని నిపుణులు అంటున్నారు.

అయితే.. బంగారం ధరలు మరో 4-5 శాతం వరకు తగ్గే సూచనలు వున్నాయంటున్నారు. ఒకవేళ అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైతే, ఇది బంగారం ధరలు మరింత తగ్గడానికి దోహదపడుతుంది . ఎంసీఎక్స్‌లో బంగారం ధరలకు రు.91,000 రూపాయల వద్ద బలమైన మద్దతు లభించవచ్చని, రు. 95,500 దాటకపోవచ్చని త్రివేది తెలిపారు. దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేటు గత 10 రోజుల్లో రు.7వేలకుపైగా దిగొచ్చింది.

వెండిని కొనుగోలు చేయాల్సిన సమయం ఆసన్నమైందా?

బంగారం ధరలలో భారీగా పెరుగుతున్న వ్యత్యాసాలు , బంగారం-వెండి నిష్పత్తి పెరుగుతూనే ఉండటంతో, విశ్లేషకులు వెండిపై ఇన్వెస్టర్లలో ధీమా గణనీయంగా పెరుగుతోందంటున్నారు . బంగారం ధరలు తగ్గినప్పుడు, వెండి సాధారణంగా దానిని అనుసరిస్తోంది. ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో ఉండటంలేదు. ఎందుకంటే బంగారంలో క్షీణత తరచుగా వెండిపై ప్రభావం చూపుతోంది. సోలార్ ప్యానల్స్ పై అధిక సుంకాలు ఉండటం వల్ల వెండి ధరలు ప్రస్తుతం తగ్గాయని, దీనివల్ల చైనా నుండి అమెరికాకు ఎగుమతులు తగ్గాయని అంటున్నారు. సోలార్ ప్యానల్స్ వాణిజ్యంలో ఈ ఎగుమతులు దాదాపు 18% వాటా కలిగి ఉన్నాయి. సౌర (solar)రంగం వెండి డిమాండ్‌కు కీలకమైందగా వుండటంతో ముఖ్యంగా ఇటీవల సంవత్సరాలలో దాని రెండంకెల వృద్ధితో, సుంకాల ప్రభావం తాత్కాలికంగా వెండి ధరలను తగ్గించింది.అయితే ఈ ధోరణి కొంత కాలమే ఉంటుందని నిపుణులు నమ్ముతున్నారు. అమెరికా , చైనా మధ్య ఏదైనా నిర్మాణాత్మక ఒప్పందం జరిగితే వెండి ధరల పెరుగుదలకు దారితీయవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా ఇప్పటికే ఎంతో పెరిగిన బంగారం ధరలు ఇప్పటికే తగ్గగా ఇంకొంచెం తగ్గే సూచనలు వున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెండి ధర మాత్రం అమెరికా, చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గితే పెరిగే అవకాశం వుంది.

Tags:    

Similar News