టిడిపి-జనసేన ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర మరింత దిగజారిందా?

NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి పైగా అయినా, వంశధార ప్రాజక్టు మీద నిర్లక్ష్యం ఉత్తరాంధ్ర ప్రజలను నిరాశ పరుస్తున్నది.

Update: 2025-10-15 06:41 GMT

ఉత్తరాంధ్ర లో మారుమూల ప్రాంతమైన సోంపేట, ఇచ్ఛాపురం గ్రామాలకు కావాల్సిన సాగునీటి సౌకర్యాలలమీద, రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం గురించి నేను గతంలో కూడా ప్రభుత్వానికి గుర్తు చేశాను. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా, ఆ ప్రాంతం సాగునీటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభించక పోవడమే కాకుండా, రోజు రోజుకూ, పరిస్థితి దిగజారుతున్నది.

ఈ మధ్య విశ్రాంత ఇర్రిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుపతి రావు వంశధార సాగునీటి వ్యవస్థ మీదఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. మీడియాలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యవస్థ గురించి కొన్ని ముఖ్యమయిన విషయాలు:

1. గొట్టా బ్యారేజ్ కట్టి 53 సంవత్సరాలు అయింది. మైంటెనెన్సు కు కావలసిన నిధులు లేకపోవడం కారణంగా బ్యారేజ్ పరిస్థితి అధ్వానంగా ఉంది. బ్యారేజ్ కి వెన్నెముక వంటి ఆప్రాన్, దిగువ వున్న బండ్ శిథిల స్థితిలో ఉన్నాయి. గేట్ల వద్ద మట్టి పూడుకుపోయి, రిజర్వాయర్ నిలువ చేయగలిగిన నీటి కెపాసిటీ బాగా తగ్గింది. అటువంటి పరిస్థితుల్లో, నదిలో రెండు లక్షల క్యూసెక్ లకు పైగా వరద వస్తే, బ్యారేజ్ అత్యంత ప్రమాదకర స్థాయికి రాగలదు. బ్యారేజ్ ని అటువంటి ప్రమాదం నుంచి తప్పించాలంటే, ఆప్రాన్, దిగువ వున్న బండ్ కు మరమ్మత్తులు, బ్యారేజీ వద్ద పూడికతీత పనులను తత్ క్షణం చేపట్టాలి.

2. గొట్టా బ్యారేజ్ వద్ద 104 కిలోమీటర్ల పొడవుతో 12 మండలాల పరిధిలోని గ్రామాలకు నీరు అందించే ఎడమ కాలువ పరిస్థితి కూడా అదేవిధంగా అధ్వాన్న పరిస్థితిలో ఉంది. 2,480 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఆ కాలువ కెపాసిటీ, ఈరోజు, 1700 క్యూసెక్కులకు మాత్రమే పరిమితమైంది. పూడిక తీయకపోవడం, కావాల్సిన కాంక్రీట్ పనులు చేపట్టకపోవడం, గేట్లు, స్ట్రక్చర్ లు కొట్టుకుపోయినా, మరమ్మతులు చేయకపోవడం కారణంగా, కళ్ళముందు కనిపిస్తున్న నీటిని ప్రజలకు అందించలేకపోవడం, ప్రభుత్వం ఆ ప్రాంతం మీద చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం.

3. వంశధార కరకట్టలు అత్యంత బలహీనంగా మారాయి. 40 వేల క్యూసెక్కుల వరదకే గ్రామాలు వేలాది ఎకరాల భూములు వరదకు గురి అవుతున్నాయి. ఇటీవల లక్ష క్యూసెక్కుల వరదతో, ఎగువన కరకట్ట కోతకు గురి అయింది.

4. వాతావరణ మార్పుల వలన భవిష్యత్తులో భారీ వరదలు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితి ఏర్పడితే నది కరకట్టలు నీటి శక్తిని తట్టుకోలేవు. అటువంటి ప్రమాదం జరిగితే, ప్రభుత్వం భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది

5. ఈ పనులన్నింటినీ చేపట్టాలంటే, వంశధార సాగునీటి వ్యవస్థ మీద ప్రభుత్వం త్వరలో 2,500 కోట్ల రూపాయలు కేటాయించాలి. దశలవారీగా, రెండు మూడు సంవత్సరాల్లో ఈ మరమ్మతులు పూర్తి చేయడం అవసరం. అటువంటి పెట్టుబడి చేయకపోతే, వంశధార సాగునీటి పరిస్థితి ఇంకా విషమించి, ఉన్న సృక్చర్ లకు ఇంకా భారీగా నష్టం కలుగగలదు.

6. వంశధార ట్రిబ్యునల్ కొన్ని సంవత్సరాల క్రిందనే, ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాలు 115 టీఎంసీల నీటిని 50:50 శాతం పంచుకోవాలని స్పష్టమైన తీర్పు ఇచ్చినా, ఒరిస్సా ప్రభుత్వం మన రాష్ట్రాన్ని కోర్టుకు తీసుకు పోవడం వలన, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో నేరేడు ప్రాజెక్టు కట్టడంలో ఆలస్యం జరిగి మనకు రావాల్సిన నీటిని మనం ఉపయోగించుకోలేక పోతున్నాము. ఆ సమస్యను పరిష్కరించుకోగలిగితే, మనం హిరమండలం రిజర్వాయర్, హెచ్ ఎల్ సి, కుడి, ఎడమ ప్రధాన కాలువలకు పుష్కలంగా సాగునీరు, తాగునీరు అందించవచ్చు.

ప్రస్తుతం, టీడీపీ-జనసేన ప్రభుత్వం, కేంద్రంలో, ఒరిస్సా లో అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం తో భాగస్వాములు అవ్వడం దృష్టిలో పెట్టుకుని, మన ముఖ్యమంత్రి , ఒరిస్సా ముఖ్యమంత్రితో ముఖాముఖి సంప్రదింపులు జరిపి, వంశధార మీద నేరడు ప్రాజెక్టు విషయంలో ఒప్పందం చేసుకుంటే, రిజర్వాయర్ నిర్మాణం ఆలస్యం చేయకుండా చేపట్టే అవకాశం ఉంది. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి పైగా అయినా, ఆ దిశలో ముందుకు పోవకపోవడం ఉత్తరాంధ్ర ప్రజలను నిరాశ పరుస్తున్నది.

అదే కాకుండా, వంశధార-మహేంద్రతనయ-బహుదా నదుల అనుసంధానం చేసే ప్రాజెక్టును, 2014-19 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత, మీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు విషయంలో ప్రస్తావించకపోవడం కూడా ఉత్తరాంధ్ర ప్రజలను నిరాశ పరుస్తున్నది.

అమరావతి రాజధాని మీద, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో, ఇతర ప్రోజెక్టుల మీద వేలాది కోట్ల రూపాయల ఖర్చు చేయడానికి సంకోచించని మీ ప్రభుత్వం, తలచుకుంటే, వంశధార సాగునీటి వ్యవస్థ ఆధునీకరణకు 2,500 కోట్ల రూపాయలు కేటాయించగలదు. అటువంటి వంశధార ప్రాజెక్టు ఆధునీకరణ పనులు ఎందుకు చే పట్టడం లేదు?

ప్రజలు అంగీకరించని, ఉద్దానంలో కార్గో ఎయిర్ పోర్ట్, సరుబుజ్జిలి లో థర్మల్ పవర్ ప్లాంట్ లను నిర్మించే బదులు, ఇచ్ఛాపురం, సోంపేట ప్రాంతాలను సస్యశ్యామలం చేయగలిగిన వంశధార, మహేంద్రతనయ, బహుదా ప్రోజెక్టుల మీద మీ ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి.

2014 లో కేంద్రం ప్రవేశపెట్టిన ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాల ఏర్పాటు చట్టం 46 వ సెక్షన్ లో సూచించిన విధంగా, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ నిధులలో, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి కావలసిన వాటాను ప్రభుత్వం తప్పనిసరిగా కేటాయించాలనే నిబంధన ను మీ దృష్టికి, మీ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మారుమూల మండలాలైన ఇచ్ఛాపురం, సోంపేట మండలాలలో, సాగు, తాగునీటి సౌకర్యాల కోసం, ప్రభుత్వ రంగంలో వైద్య, విద్యా రంగాల అభివృద్ధి కోసం, సమాజ సంక్షేమ కార్యక్రామాలకోసం, రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన నిధులను కేటాయించాలని, నా విజ్ఞప్తి.

(ఇవి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి Dr నిమ్మల రామానాయుడుకు రాసిన లేఖ సారాంశం)

Tags:    

Similar News