ప్రశ్నార్థకం అయిన రాయలసీమ ‘పేదల బంధు’ భవిష్యత్తు …?

ఆర్డీటికి నిధులు అందక పోతే, లక్షలాది మంది పేదలు చీకటిమయమే...;

By :  Admin
Update: 2025-05-01 11:13 GMT
ఇన్ క్లూజివ్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యార్థులతో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్

-చెన్నంపల్లి వేణుగోపాలరెడ్డి

దేశంలోనే అతి తక్కువ వర్షపాతం కురిసే అనంతపురం జిల్లాలోని నిరుపేదలకు రూరల్ డెవెలప్ మెంట్ ట్రస్టు (Rural Developmet Trust : RDT) ఒక "కల్పతరువు" లాంటిది. జిల్లాలోని అత్యంత వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు విద్య, వైద్యం, మహిళ సాధికారత, ఇన్ క్లూజివ్ ఎడ్యుకేషన్, వర్షాధార భూముల్లో పండ్ల తోటలు పెంపకం, నీటి సంరక్షణ, భూమి కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా అన్ని రంగాలలోనూ ప్రజలకు అత్యంత చేరువ అయ్యింది.

ఇలా గ్రామీణ ప్రజలతో మమేకమై పర్యావరణ పరిరక్షణ తో పాటు ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పథంలోకి పయనింప చేయడంలో ఆర్డిటి తన వంతు కృషిచేసింది. ఇందుకుగానూ ఆర్డిటి ఫారిన్ కాంట్రిబ్యూషన్ (ఎఫ్ సి), లోకల్ కాంట్రిబ్యూషన్ (ఎల్ సి) నిధులపై ఆధారపడింది. ప్రస్తుతం ఎఫ్ సిఆర్ఏచ(FCRA) ను రెనివల్ చేయకపోవడంతో అందులో ఉన్న నిధులను వాడుకోలేని పరిస్థితి ఏర్పడడం తో పాటు కొత్త నిధులు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇప్పటివరకు చేపట్టిన అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు గండి పడే అవకాశం కనిపిస్తోంది.

ఫలితంగా వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యంత ప్రతిభ కలిగిన గ్రామీణ ప్రాంత యువత క్రీడలకు దూరమయ్యే పరిస్థితి దాపురించింది. అభం శుభం తెలియని వికలాంగ పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వర్షాధార భూముల్లో పండ్ల తోటలను సాగు చేసే రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా అత్యంత ఆధునిక వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇలా విద్య, వైద్యం, క్రీడలు, వ్యవసాయం, మహిళ సాధికారత నిలిచిపోవడంతో గ్రామీణ “అనంత” వలస బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ప్రజలు ముక్తకంఠంతో ఆర్ డిటి ఎఫ్ సిఆర్ఏ ను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఆర్ డిటీ ప్రస్థానం, వివిధ ప్రాంతాల్లో అందిస్తున్న సేవలను ఒకసారి పరిశీలిస్తే “అనంత”కు ఆర్ డిటి ఎంత అవసరమో తెలియవస్తుంది.

వైద్యానికి రూ.80 కోట్ల ఖర్చు

ఆర్టీడి నడిపే ఆసుపత్రులలో ప్రతి సంవత్సరం 85 లక్షల మంది అవుట్ పేషెంట్లు మరియు 60 వేల మంది ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ప్రతి సంవత్సరం 15 వేల డెలివరీలు జరుగుతుంటే ఇందులో ఎక్కువగా నార్మల్ డెలివరీలే చేస్తూ ఉండడం గమనార్హం. దీంతోపాటు 15 వేల సర్జరీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక హెచ్ఐవికి సంబంధించి 4900 మంది వ్యక్తిగతంగా హెచ్ఐవి కేర్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 1000 మంది తలసీమియా వ్యాధితో పిల్లలు బాధపడుతూ ఉండగా అందులో ఒక్క అనంతపురం జిల్లాలోనే 170 మంది తలసేమియా తో బాధపడుతున్న పిల్లలు ఉండడం గమనార్హం. వీరిలో 26 మంది పిల్లలకు బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఇందులో సుమారుగా 691 మంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్ పనిచేస్తూ ఉన్నారు.

పాప ప్రాణం కాపాడారు : హనుమంతు

అనంతపురం కు చెందిన హనుమంతుకు కూతురు పుట్టిన మూడు నెలలకే సమస్య ఎదురయింది. పాప పాలు తాగిన వెంటనే వాంతి చేసుకుంటూ ఉంది. దీంతో అర్థం కాక అతను ఒక ప్రయివేటు హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళగా బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ చేయాలని తెలిపారు. అయితే రక్తమార్పిడి చేయాలంటే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది. అతను దిన కూలీ, పాప వయసు మూడు సంవత్సరాలు ప్రేమ అని ఎంతో ముద్దుగా పిలుచుకునేవారు. అతను పనికి వెళ్తే గాని పూట గడిచేది కాదు. అలాంటి సమయంలో బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ అమ్మాయిని పరీక్షించి రక్తమార్పిడి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రేమ వయసు ఆరు సంవత్సరాలు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం తో కోలుకుంటూ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది తల సేమియా బాధితులు ఉంటే ఒక అనంతపురం జిల్లాలోనే 170 మంది తల సేమియా బాధితులు ఉండడం గమనార్హం. వీరిలో సుమారుగా 26 మందికి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయగా మిగిలిన వారికి రక్తమార్పిడి చేస్తూ చికిత్స అందిస్తున్నారు.


దీంతో పాటు బత్తలపల్లి హాస్పిటల్ లో గర్భవతులకు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తూ పిల్లలు తల సేమియా వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటివరకు సుమారుగా 5300 మంది గర్భవతులకు స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించారు. తద్వారా పుట్టబోయే పిల్లలు తల సేమియా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు కావలసిన ముందస్తు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

గ్రామీణ విద్యార్థులలో ప్రతిభకు పట్టం

జిల్లాలో 2004 నుంచి సుమారుగా 26.097 మంది విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ అందిస్తూ చదివిస్తూ ఉంది. వీరి ఆర్ధిక సహాయం తో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వాళ్లలో 67 శాతం మంది ఉద్యోగాలు సాధించి తమ కాళ్లపై తాము నిలక్కుకున్నారు. ముఖ్యంగా చెంచు కమ్యూనిటీలో 100% ఎన్రోల్మెంట్ ను చేసింది. గడచిన మూడు సంవత్సరాలుగా బాలికలకు 50% స్కాలర్షిప్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఉంది. వీటన్నిటితో పాటు విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులను కూడా ప్రోత్సహిస్తూ సుమారుగా 871 మంది విద్యార్థులకు ప్రొఫెషనల్ లాంగ్వేజెస్ లో శిక్షణను అందించింది. వీరందరూ దేశవ్యాప్తంగా లేదా ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఎమ్మెఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల విద్యను ప్రోత్సహించాలని లక్ష్యంతో 40,891 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. దీనివలన గ్రామీణ ప్రాంతాలతో పాటు ఆర్థికంగా చదువుకోలేని వారికి ఆర్డీటి చేయితానందిస్తూ ఉండడంతో డ్రాప్ అవుట్ రేటు గణనీయంగా తగ్గిపోయింది.


ఆర్ డి టీ ఆదుకుంది : డాక్టర్ శివశంకర్ రెడ్డి

అనంతపురం చెందిన శివశంకర్ రెడ్డికి చిన్న వయసులోనే తల్లి తండ్రి చనిపోయారు. కవల పిల్లలైనా చెల్లెళ్లతో పాటు అతను కూడా అనాధగా మారిపోయాడు. దీంతో వారిని వారి పెద్దమ్మ వారి ఇంటికి తీసుకుని వెళ్ళింది. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరితో కలిపి కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది ఉండేవారు. పెద్దమ్మ భర్త డ్రైవర్ గా పని చేసేవాడు. వచ్చిన డబ్బులతో ఎనిమిది మందికి పూట గడవడం చాలా కష్టంగా ఉండేది. ఈ విషయం అర్ డీటి వారికి తెలిసి 7వ తరగతి నుంచి శివశంకర్ రెడ్డి చదువు ఖర్చును భరిస్తూ వచ్చింది. అతని చెల్లెళ్ల చదువు ఖర్చును కూడా భరిస్తూ ఉంది. ఉన్నత చదువులకు సంబంధించిన ఖర్చును కూడా భరించడంతో నీట్ lo 51,760 ర్యాంకును సాధించి శివశంకర్ రెడ్డి చిత్తూరులోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ లో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. అతను చెల్లెళ్లు కూడా డిగ్రీ చదువుతూ ఉన్నారు. ఇతను ఫీజీ లో జనరల్ మెడిసిన్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. అర్ డీటి అందించిన సహకారం తోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు.

ఇన్ క్లూజివ్ విద్యార్థులకూ ప్రోత్సాహం

ఇన్ క్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ డిసేబులిటీ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తూ ఉంది. డిజేబుల్ తో బాధపడుతున్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించుకుని వారికి క్వాలిటీ విద్య, స్కిల్ డెవలప్మెంట్ లలో శిక్షణ ఇచ్చి వారిలో సాధికారికతను పెంపొందిస్తోంది. ఇలా ఆర్డిటి మూడు ఇంక్లూజివ్ రెసిడెన్షియల్ ప్రైమరీ స్కూల్ లను నిర్వహిస్తూ ఉంది. దీంతోపాటు రెండు ఇంక్లూజివ్ హై స్కూల్స్ కూడా నిర్వహిస్తూ ఉంది. డిజేబిలిటీ తో బాధపడుతున్న పిల్లలు దానిని మరిచిపోయి మంచి విద్యావంతులుగా తయారయ్యేలా వారిని తయారు చేస్తోంది. దీంతోపాటు వారిని స్పెషల్ ఒలంపిక్ ప్రోగ్రాం లో పాల్గొనేలా శిక్షణను అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్వహించిన పారా ఒలంపిక్స్ లో పాల్గొని పలు పథకాలు సాధించారు.


అడుక్కుతినే వాళ్ళం : మంజునాథ్, నవీన్

శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములైన మంజునాథ్, నవీన్ కుమార్ లది హృదయ విదారక గాథ. వీరు కోవిడ్-19 సమయంలో అడుక్కుంటూ ఉండగా ఆర్డిటి ఇన్ క్లూజివ్ ఎడ్యుకేషన్ కు స్కూలుకు వీరిని తరలించారు. వెంటనే వీరిని 2022 ఏప్రిల్ 18న వీరిని పాఠశాలలో చేర్పించారు. అప్పట్లో నవీన్ కుమార్ వయసు నాలుగు సంవత్సరాలు కాగా మంజునాథ్ వయస్సు ఎనిమిది సంవత్సరాలు. వీరికి అమ్మానాన్న ఇద్దరు లేకపోవడంతో ఆకలికి తట్టుకోలేక అడుక్కుంటూ ఉండేవారు. ప్రస్తుతం ఆర్డిటి ఏర్పాటు చేసిన ఇన్ క్లూజివ్ ఎడ్యుకేషన్ పాఠశాలలో నవీన్ రెండవ తరగతి మంజునాథ్ ఏడవ తరగతి చదువుతున్నారు. వీరు సంవత్సరం పొడవునా అక్కడే ఉంటున్నారు. కొంతమంది పిల్లలు పండుగలు, జాతర్లకు, వివాహాల కోసం ఇళ్లకు వెళుతూ ఉంటే వీరిని గురించి ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. దీంతో వీరు సంవత్సరం పొడవునా ఇక్కడే ఉంటూ చదువుకుంటూ ఉన్నారు. వీరితోపాటు ఇదే పాఠశాలలో ఆర్ఫాన్స్ మరియు సెమి ఆర్ఫన్ పిల్లలు 180 మంది ఉండగా, బ్లైండ్ చిల్డ్రన్ 160 మంది, స్పీచ్ అండ్ హియరింగ్ తో బాధపడే పిల్లలు 250 మంది, ఇతర డిజేబులిటీస్ ఉన్న పిల్లలు 800 మంది మొత్తంగా 1350 మంది పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎఫ్ సిఆర్ఏ రెన్యువల్ కానీ పక్షంలో ఈ పిల్లలందరూ తిరిగి రోడ్లపైకి చేరుకునే అవకాశం ఉందని సమాచారం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడా కూడా ఇన్ క్లూజివ్ స్కూల్స్ లేకపోవడం గమనార్హం.


వ్యవసాయానికి అండ దండలు

అనంతపురం జిల్లా వ్యవసాయ రైతాంగానికి కూడా ఆర్డిటి తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ ఉంది. ల్యాండ్ రెస్టోరేషన్, వాటర్ కన్జర్వేషన్ అండ్ క్రియేటింగ్ సస్టైనబులిటి పెంపొందించే దిశగా అనేక చర్యలు చేపడుతూ ఉంది. ఇందులో భాగంగా సుమారుగా 5,136 వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లను నిర్మించింది. దీనివలన 1,10,001 టీఎంసీ ఆఫ్ వాటర్ నిల్వ ఉంటోంది. అతి తక్కువగా వర్షపాతం కురిసే ప్రాంతాలలో ఈ నీటి నిల్వ వలన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడంతో పాటు చాలా పంటలకు కూడా ఉపయోగపడుతూ ఇరిగేషన్ ను సస్టైన్ చేస్తూ ఉంది.

పండ్లతోటలకు ప్రోత్సాహం

జిల్లాలో వర్షా దారిత పండ్ల తోటలకు ఆర్డిటి శ్రీకారం చుట్టింది. సుమారుగా 35,479 మంది రైతులకు చెందిన 3,06,957 హెక్టార్లలో సుమారుగా 1.9 కోట్ల పండ్ల మొక్కలను పంపిణీ చేసింది. వర్షాధారంపై ఆధారపడిన భూములలో పండ్ల తోటలను పెంచి రైతులకు ఆదాయాన్ని కల్పించే ఏర్పాటు చేయడంతో పాటు ఎకో సిస్టంను కూడా డెవలప్ చేసింది. రోడ్లకు ఇరువైపులా సుమారుగా 755 కిలోమీటర్ల మేర వివిధ రకాల చెట్లను నాటింది. 5565 హెక్టార్ల బ్యారెన్ ల్యాండ్ లలో వివిధ రకాల మొక్కలను నాటింది. సోషల్ ఫారెస్ట్ విభాగం కింద సుమారుగా 716 హెక్టార్లలో చెట్లను నాటి సంరక్షిస్తూ ఉంది.

మహిళలకూ చేయూత

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు జెండర్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఇండిపెండెన్స్ అందిపుచ్చుకొనే దిశగా గ్రామీణ మహిళలను ప్రోత్సహిస్తోంది. ఇలా ఆర్డిటి 89,175 మంది మహిళలతో కూడిన 8023 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లను నిర్వహిస్తూ ఉంది. తద్వారా మహిళల్లో జెండర్ ఈక్వాలిటీ, ఎంటర్ పెన్యూర్షిప్ లను ప్రోత్సహిస్తూ ఉంది. దీంతోపాటు గృహహింసతో బాధపడుతున్న మహిళలకు కూడా చేయూతను అందిస్తోంది. ఇలా వచ్చిన వారికి కౌన్సిలింగ్, లీగల్ ఎయిడ్ మరియు షెల్టర్ ఇస్తూ వారిని సోషియో ఎకనామిక్ గా తీర్చిదిద్దుతూ వారికి ఆరోగ్యపరంగా, సైకలాజికల్ గా సపోర్టును అందిస్తూ వారు ఒంటరిగా అయినా కూడా బతకగలిగే ధైర్యాన్ని అందజేస్తూ ఉంది. ఇలా ప్రతి సంవత్సరం సుమారుగా 4000 మంది వరకు మహిళలు ఆర్డిటి అందిస్తున్న సహాయాన్ని పొందుతున్నారు.


మహిళలకు నైపుణ్య శిక్షణ

ప్రతి సంవత్సరం గ్రామీణ మహిళల్లో జీవనోపాదుల కల్పనను పెంచి ప్రోత్సహించడానికి గాను టైలరింగ్, వీవింగ్ స్మాల్ స్కేల్ అగ్రికల్చర్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది. దీంతో వారిలో దాగి ఉన్న స్కిల్ మరియు ఎకనామిక్ సస్టైనబుల్టీని పెంపొందించవచ్చునని ఆర్డిటి భావిస్తూ ఇలా చేస్తోంది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లోని 89 వేల మంది మహిళలు వివిధ రకాల స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను అందుకున్నారు.

నిరుపేదలకు పక్కా గృహాల నిర్మాణం

అనంతపురం జిల్లాలో ఇళ్లు లేని వారికి సుమారుగా 85 వేల ఇళ్లను నిర్మించి ఇచ్చింది. తద్వారా వారిలో భద్రత, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, విద్య పట్ల ఆసక్తి నెలకొల్పడంతో పాటు గౌరవంగా బతికే ఏర్పాటును ఇచ్చింది. జిల్లాలో ఓడిఎఫ్ ను రూపుమాపడానికి గానూ 55 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల సైతం నిర్మించింది. దీనివలన మహిళలలో ఆత్మ గౌరవాన్ని పెంపొందించడంతోపాటు వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య భద్రతకు కూడా సపోర్టు ఇచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 1665 కమ్యూనిటీ సెంటర్లను ఏర్పాటు చేసింది. దీనివలన సమావేశాలు, కల్చరల్ ఈవెంట్స్, వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను అందించడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. సుమారుగా 159 పాఠశాలల్లో 894 క్రాస్ రూములను నిర్మించింది. తద్వారా విద్యా బోధనలో ప్రగతిని సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. వీటన్నిటితో పాటుగా గ్రామాలలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, ఎలక్ట్రిఫికేషన్ మరియు తాగునీటి సౌకర్యాలు కూడా కల్పించింది.

గ్రామీణ యువతకు క్రీడలలో శిక్షణ

జిల్లాలో 2000 సంవత్సరం నుంచి సుమారుగా ఐదు లక్షల మంది పిల్లలకు క్రికెట్, హాకీ, కబడ్డీ, జూడో, టెన్నిస్ మరియు ఫుట్ బాల్ లలో శిక్షణ అందిస్తోంది. ఇందులో కేవలం బాలురకే కాకుండా బాలికలకు కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తూ ఉంది. జిల్లాలో “లా లిగా” కొలాబరేషన్ తో గర్ల్స్ ఫుట్ బాల్ అకాడమీ ని ఏర్పాటు చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన తొమ్మిది మంది బాలికలు నేషనల్ కు ఆడడం బాలుర తో పాటుగా బాలికలను కూడా ప్రోత్సహించే విధానాన్ని తెలియజేస్తుంది. ఇలా స్కూలు దశలో నుంచే విద్యార్థులను ఆటల్లో నిమగ్నం చేయడం ద్వారా వారిలో కాన్ఫిడెన్స్, డిసిప్లిన్, మరియు అంబిషన్ పెరుగుతాయని భావిస్తున్నారు.

విపత్తులలోనూ సహాయ సహకారాలు

ఆర్డిటి ఇలా ఒక్క అనంతపురం జిల్లాలోనే కాకుండా ప్రకృతి విపత్తులతో బాధపడే పలు సందర్భాలలో తన వంతు సహాయ సహకారాలను అందించింది. ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన దివిసీమ సైక్లోన్ ఎఫెక్ట్, గుజరాత్ లో భూకంపం, తమిళనాడు-పుదుచ్చేరిలో లలో వచ్చిన సునామి, విశాఖపట్నంలో హుద్ హుద్ సైక్లోన్, చెన్నై నెల్లూరులో జరిగిన వరదల్లోనూ తన వంతుగా సహాయ సహకారాలను అందించింది.

( చెన్నం పల్లి వేణుగోపాల రెడ్డి సీనియర్ జర్నలిస్టు, అనంతపురము)

Tags:    

Similar News