నమ్రత నమిలిన రూ.కోట్లెన్ని?
'సృష్టి' ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత సరోగసీ పేరుతో రెండున్నర దశాబ్దాల్లో సాగించిన దోపిడీ ఎంత? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.;
'పాప' భీతి ఎరుగని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రత ధనార్జనే లక్ష్యంగా దురాగతాలకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోకి తమ ఫెర్టిలిటీ సామ్రాజ్యాన్ని విస్తరించింది. సంతాన లేమితో బాధపడుతున్న వారితో పాటు అక్రమంగా గర్భం దాల్చిన వారిని, ఆర్థిక అవసరాల్లో చిక్కుకున్న మహిళలను తమ ఏజెంట్ల ద్వారా ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా రెండున్నర దశాబ్దాలుగా సరోగసీ పేరుతో చేసిన అక్రమాలు, అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అసలు సరోగసీయే లేకుండా ఎవరికో పుట్టిన బిడ్డలను సరోగసీ దంపతుల బిడ్డగా నమ్మించి రూ.20 నుంచి 40 లక్షల వరకు దోపిడీ మొదలెట్టింది. ఈ దారుణంలో అసలు తల్లికి పుట్టిన బిడ్డ చనిపోయిందని చెప్పి కొందరికి గర్భశోకాన్ని మిగిల్చింది. పుట్టిన శిశువును అమ్మకానికి మరికొందరితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా నామమాత్రపు సొమ్ము చెల్లించింది. శిశువుల విక్రయం చట్టరీత్యా నేరం కావడం వల్ల కొందరు, తమకు పుట్టింది అక్రమం సంతానం కాబట్టి నోరెత్తితే ఏం
జరుగుతుందోనని మరికొందరు డాక్టర్ నమ్రత దురాగతాలను బయట పెట్టలేక పోతున్నారు. మరోవైపు డీఎన్ఏలో తమ బిడ్డ కాదని తెలిసినా పోలీసు కేసుల వరకు వెళ్తే ఎలాంటి ఇబ్బందులొస్తాయోనన్న భయంతో సంతాన ఆపేక్ష వల్ల ఏదో బిడ్డ దక్కింది చాలు.. అనుకుంటూ తీసుకెళ్లిపోయిన వారూ ఉన్నారు. వీటన్నిటి నీ ఆసరాగా చేసుకున్న డాక్టర్ నమ్రత సరోగసీని పూర్తి కమర్షియల్ చేసేసింది. తాజాగా రాజస్థాన్ దంపతులు గోవింద్సింగ్, సోనియా దంపతులు డాక్టర్ నమ్రత మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైద్యురాలి రూపంలో ఉన్న ఆ డబ్బు పిశాచి నిజస్వరూపం మరోసారి బయట పడింది.
ముగ్గులోకి దించుతారిలా..
సంతానం కోసం పరితపించే దంపతులను ఎలా ముగ్గులోకి దించాలో డాక్టర్ పచ్చిపాల నమ్రత నేతృత్వంలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులకు వెన్నతో పెట్టిన విద్య. తమ వద్దకు వచ్చిన దంపతులకు తొలుత ఐవీఎఫ్ ప్రొసీజర్ పేరిట పరీక్షలు చేస్తారు. కొన్నిసార్లు నమ్మకం కుదిరే దాకా వివిధ రకాల టెస్ట్లు చేస్తూ గర్భానికి సానుకూల పరిస్థితులున్నాయని నమ్మిస్తారు. ఆ తర్వాత అండం, వీర్యం బాగున్నా గర్భం దాల్చడానికి ప్రతికూలంగా ఉందంటారు. అందువల్ల బిడ్డ పుట్టడానికి సరోగసీ ఒక్కటే శరణ్యమని, మరో మార్గం లేదని చెబుతారు. అప్పటికే వీరు రూ.లక్షలు వసూలు చేస్తారు. తమ ఫెర్టిలిటీ సెంటర్కు నూరు శాతం సక్సెస్ రేటుందని, సరోగసీలో బిడ్డను అందించడం పక్కా.. అంటూ కౌన్సిలింగ్ ఇస్తారు. చివరకు ఆ దంపతులను ఒప్పించి ఊబిలోకి దించుతారు. ఒకవేళ ఎవరైనా దంపతులు సరోగసీ బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయించి ఇవ్వాలని షరతు పెడితే తొలుత అందుకు సై అంటారు. దీంతో నమ్మకం కుదిరి సరోగసీకి అంగీకరించిన దంపతుల నుంచి తొలుత రూ.5-10 లక్షలు అడ్వాన్సుగా తీసుకుంటారు. మిగిలిన మొత్తాన్ని దఫదఫాలుగా వసూలు చేస్తారు. ఆ దంపతులకు అనుమానం రాకుండా ప్రతినెలా అద్దె గర్భంలో పెరుగుతున్న శిశువు ప్రగతి/ఎదుగుదలను వాట్సాప్‌ల ద్వారా పంపిస్తారు. ఆ శిశువు నిజంగా తమ బిడ్డేనని భ్రమిస్తూ తమ నట్టింట ఎప్పుడు అడుగు పెడుతుందా? అనుకుంటూ కలలు కంటుంటారు.
సృష్టి వెబ్సైట్లో అహా.. ఓహో..
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వెబ్సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు తమ సెంటర్ల ద్వారా 10,200 ఐవీఎఫ్ సైకిల్స్, 2,200కి పైగా సరోగసీ ప్రొసీజర్స్ నిర్వహించారు. ఇందులో 220 సరోగసీ ద్వారా బిడ్డలను అప్పగించినట్టు పేర్కొన్నారు. సంతానం కలగడానికి తమ వద్ద ఐయూఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, సరోగసీ, పీజీడీ/పీజీఎస్, బ్లాస్టోసిస్ట్ కల్చర్ వంటి అత్యాధునిక చికిత్సా విధానాలున్నాయని వెబ్సైట్లో పొందుపరిచారు. వీటిలో అత్యాధునిక ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ మెథడ్ (పీజీఎస్) సరోగసీ సక్సెస్ రేటు పెరగడానికి కారణమని చెప్పడానికి గర్వపడుతున్నట్టు అందులో రాసుకున్నారు. పీజీఎస్ విధానం వల్ల అబార్షన్లు అన్నవే లేకుండా 80-85 శాతం సక్సెస్ రేటు ఉందని చెప్పుకున్నారు.
లెక్కలేనంత అక్రమ సంపాదన..
కాగా సృష్టి నిర్వాహకులు ఒక్కో ప్రొసీజరుకు ఒక్కో రేటు నిర్ణయిస్తారు. సరోగసీకి ముందు ఐవీఎఫ్కు రూ.వేలల్లోనూ, సరీగసీ ప్రొసీజర్కు రూ. లక్షల్లోనూ వసూలు చేస్తారు. ఇక సరోగసీ ద్వారా బిడ్డను ఇవ్వాలంటే రూ.30-40 లక్షల వరకు పిండుతున్నారు. ఇలా సృష్టి తన వెబ్సైట్లో ఇప్పటివరకు 220 సరోగసీ బిడ్డలను అందజేసినట్టు పేర్కొన్నారు. ఈ లెక్కన సగటున ఒక్కో సరోగసీ బిడ్డకు రూ.35 లక్షలు చొప్పున చూస్తే సుమారు రూ.77 కోట్లు అవుతుంది. ఇక రెండు వేలకు పైగా సరోగసీ ప్రొసీజర్స్కు పెద్ద మొత్తంలోనే వసూలు చేస్తారు. దేశంలో సంతాన సాఫల్య పరీక్షలకు సగటున వసూలు చేసే రేట్లను పరిశీలిస్తే.. సరోగేట్ స్క్రీనింగ్కు రూ.62 వేలు, సరోగేట్ ఇన్వెస్టిగేషన్స్కు రూ.14 వేలు, సిమ్యులేషన్స్కు రూ.70 వేలు, ఐవీఎఫ్, ఐసీఎస్లకు రూ.1.75 లక్షలు, బ్లాస్టోసిస్ట్ కల్చర్కు రూ.15 వేలు, ఎంబ్రియో ఫ్రీజింగ్కు రూ.25 వేలు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్కు రూ.45 వేలు, లీగల్ అసిస్టెన్సకు రూ.1.10 లక్షలు వెరసి రూ.5.41 లక్షలు అవుతుంది. అయితే 'సృష్టి’లో సరోగసీకి ముందు ప్రొసీజర్లకే రూ. లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా గడచిన 26 ఏళ్లలో సంతాన సాఫల్యం పేరుతో బిడ్డల కోసం అర్రులు చాస్తున్న దంపతుల నుంచి ఈ 'సృష్టి' ఎన్ని కోట్లను కొల్లగొట్టిందో అర్థం చేసుకోవచ్చు.