కొత్త మలుపు తిరిగిన గుజరాత్ దళిత ఉద్యమం
గుజరాత్ అనుభవం: గత ఎనిమిదేళ్లలో రాష్ట్రీయ దళిత అధికార్ మంచ్ (ఆర్డీఏఎం) నాయకత్వంలో కుల శక్తుల బారి నుంచి 2,500 ఎకరాల భూమి విముక్తి
దళిత ఉద్యమాన్ని భూమి హక్కుల పునరుద్ధరణ ఉద్యమంగా నిర్వహిస్తున్న గుజరాత్ దళితులు
దళిత-అంబేడ్కరిస్టు సంస్థలు తమ ప్రయత్నాలను, ఉద్యమాలను ఎక్కువగా ఆత్మగౌరవం, రిజర్వేషన్లు, ఉపాధి సమస్యల కే పరిమితం చేశాయి, అయితే రాజ్యాంగంలో పేర్కొన్న సోషలిజం సాధించాలంటే వనరులను సమాన ప్రాతిపదికన పంపిణీ చేయటం ముఖ్యమైన అంశం అనే గుర్తింపు కొన్ని చోట్ల పెరుగుతోంది.
41 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత గుజరాత్ లోని కచ్ గ్రామంలోని దళిత సమాజం ఎట్టకేలకు తమకు కేటాయించిన భూమిని తిరిగి పొందింది. తమ హక్కును కాపాడుకుంది. ఈ సంవత్సర స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న కచ్ జిల్లాలోని రాపర్ తహసీల్ పరిధిలోని బేలా, నందా గ్రామాల్లో 200 ఎకరాల భూమిని దళిత సమాజానికి అప్పగిం చారు. ఈ చారిత్రాత్మక విజయానికి ప్రతీకగా ఆ ప్రజలు నీలి జెండాను, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
గత ఎనిమిదేళ్లలో రాష్ట్రీయ దళిత అధికార్ మంచ్ (ఆర్డీఏఎం) నాయకత్వంలో గుజరాత్ లో కుల శక్తుల బారి నుంచి 2,500 ఎకరాల భూమిని [దాదాపు రూ.600 కోట్ల విలువైనది] విజయవంతంగా విముక్తం చేసి దళితులు స్వాధీనం చేసుకున్నారు.
2016 లో, గుజరాత్ లోని “ఉనా” లో జరిగిన దారుణాల తరువాత జిగ్నేశ్ మేవానీ అనే నాయకుడు దళితుల హక్కుల పోరాటంలో ముందు వరసలోకి వచ్చారు. 2016 జూలై 11న జరిగిన ఉనా ఘటనలో గోసంరక్షణ వాదులు ఏడుగురు దళిత యువకులను కొరడాలతో కొట్టి హింసించారు. ఆ తరువాత పోలీసులు కూడా వారిని దారుణంగా కొట్టిన వీడియో వైరల్ అయింది. యువకులను నగ్నంగా చేసి, కారుకు కట్టేసి, ఉనా పోలీస్ స్టేషన్ వెలుపల గంటల తరబడి బహిరంగంగా కొట్టడం తీవ్ర దుమారం రేపింది. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పలు ఘటనలతో దళిత వర్గాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఉదాహరణకు రాజులాలో ఒక దళిత వ్యక్తి, అతని దళితేతర భార్య హత్యకు గురికాగా, మరో గ్రామంలో దళిత బాలుడిని సజీవ దహనం చేశారు. ఏదేమైనా, ఉనా సంఘటన దళితులను బహిరంగంగా నిరసన తెలిపేందుకు ప్రేరేపించింది, ఇది భారతదేశంలో ధిక్కారానికి ఒక చారిత్రాత్మక ప్రతిఘటన ఘట్టాన్ని సూచిస్తుంది. ఉనా సంఘటన తరువాత, జిగ్నేశ్ మేవానీ దళిత సమాజాన్ని సంఘటితం చేయడానికి, వారి హక్కులను తిరిగి వారు పొందడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించాడు. బనస్కాంత జిల్లాలోని మెహసానా నుండి ధనేరా వరకు మేవానీ “స్వతంత్రం కోసం యాత్ర” పేరిట ["ఆజాదీ కూచ్"] ఆందోళన ను నిర్వహించారు, ఇది లావారా గ్రామంలో నాలుగు దళిత కుటుంబాలకు 12 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది. దాని తరువాత భూమిలేని ప్రతి దళితుడికి ఐదెకరాల భూమిని సాధించడమే ఆర్ డీఏఎం భూహక్కుల ఉద్యమ లక్ష్యమని మేవానీ లక్ష్య నిర్దేశం చేశారు.
“ ఆదివాసీలు, దళితులకు కేటాయించిన సుమారు 20 వేల ఎకరాల భూమిని అక్రమంగా భూస్వామిక శక్తులు ఆక్రమించుకున్నాయని, దానివల్ల అణగారిన వర్గాలు వారి భూమిపై హక్కును, వారసత్వాన్ని కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.” [దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల భూమి ఇలా అక్రమ ఆక్రమణలకు గురై వుంది] అక్రమ ఆక్రమణదారులనుంచి భూములను స్వాధీనం చేసుకునేందుకు దేశంలో ఏ రాష్ట్రం లోను దళిత ఉద్యమాలు ఇలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. గుజరాత్ లో ఈ ప్రయత్నం మొదలు పెట్టినట్లు” ఆయన చెప్పారు.
దళిత ఉద్యమం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి రిజర్వేషన్లు సాధించుకోవడానికే పరిమితం కాకూడదు. ఆత్మగౌరవ పోరాటంతో పాటు దళిత అంబేడ్కరిస్టు ఉద్యమం ఆర్థిక హక్కులు, వనరుల సమాన పంపిణీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మన రాజ్యాంగంలో పేర్కొన్న సోషలిజం సాధించడానికి వనరులను సమానంగా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. దళిత ఉద్యమం ఆర్థిక, భౌతిక అంశాలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ఉద్ఘాటించారు.
1950 నుంచి భూమిలేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు భూమిని కేటాయించే ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభమైనా చాలా సందర్భా ల్లో అది కాగితాలకే పరిమితమైంది. కులతత్వ భూస్వామ్య శక్తులు దళితులకు కేటాయించిన భూములపై కూడా పట్టు విడవక పోవటంతో దళిత, అణగారిన వర్గాలకు దక్కాల్సిన హక్కులు లేకుండా పోయాయి.
దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఆర్డీఏఎం ఇప్పుడు తమ డిమాండ్లలో భూ యాజమాన్యాన్ని కీలక అంశంగా చేర్చింది. భూమిలేని ప్రతి దళితుడికి ఐదెకరాల భూమి కేటాయించాలని ఉద్యమం డిమాండ్ చేస్తోంది. గుజరాత్ లో దళితుల్లో భూహక్కుల కోసం జరుగుతున్న పోరాటం ఇటీవలిది కాదు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే గుజరాత్ లో దళితులకు వేలాది ఎకరాల భూమిని కేటాయించారని, కానీ ఆధిపత్య కుల శక్తులు చట్టవిరుద్ధంగా వాటిని స్వాధీనం చేసుకున్నాయి. ఆ భూములు దళితులకు స్వాధీనం చేసేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అ సంస్థ చెబుతోంది. .
2009 నుంచి 2012 వరకు జిగ్నేశ్ మేవానీ సంఘ విద్రోహ శక్తుల అక్రమ ఆధీనంలో ఉన్న వేలాది ఎకరాల భూమిపై పక్కాగా సమాచారాన్ని సేకరించారు. 2012-2016 మధ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఆయన కృషి ఫలితంగా భూస్వామ్య శక్తుల నుంచి కోట్లాది రూపాయల విలువైన వేలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఉనా ఘటన తర్వాత ఉద్యమం కీలక మలుపు తిరిగింది.
భూ యాజమాన్యం కుల హోదాకు కీలకమైన సూచిక అని, దళితులకు సమానత్వానికి అత్యంత ప్రత్యక్ష మార్గం తమకు హక్కుగా ఉన్న భూమిని పొందడమేనని ఆర్డీఏఎం విశ్వసిస్తుంది. మొదట్లో చిన్నగా ప్రారంభమైన ఉనా దళిత్ అత్యచార్ సమితి, ఆ తర్వాత రాష్ట్రీయ దళిత అధికార్ మంచ్ (ఆర్ డీఏఎం)గా రూపాంతరం చెందింది.. భూ యాజమాన్యం సామాజిక స్థితికి ప్రాధమిక చిహ్నంగా పరిగణించబడుతుంది, సమానత్వం సాధించడానికి భూమి లేని దళితులకు భూమిని పొందడం చాలా అవసరం.
కాగితాలపై భూమిని కేటాయించినప్పటికీ భౌతిక స్వాధీనం మంజూరు చేయని కేసులను ఆర్ డిఎఎం చురుకుగా పరిష్క రిస్తోంది. 2017 నాటికి మేవానీ, ఆర్డీఏఎం ప్రయత్నాలు ఫలించడం ప్రారంభించాయి. మేవానీ డిసెంబర్ 2017 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి వడ్గాం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాడు, 2022 ఎన్నికలలోనూ తిరిగి గెలుపొందారు. ఆర్డిఎఎం బృందం తన భూ హక్కుల ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. .
అహ్మదాబాద్ జిల్లాలోని సరోధా గ్రామంలో ల్యాండ్ మ్యాపింగ్ ప్రక్రియను ప్రారంభించాలని గుజరాత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చారు. దీని ఫలితంగా 115 దళిత కుటుంబాలకు 220 బిఘాల [ఒక బీఘా= 0.62ఎకరం] భూమిని అప్పగించారు.
వివిధ దళిత ఉపకులాలను బలీయమైన రాజకీయ శక్తిగా ఏకం చేయడానికి, అణగారిన వర్గాలకు భాగస్వామ్య వేదికను సృష్టించడానికి ఈ ప్రచారం కొనసాగుతున్నది. రాపర్, సురేంద్రనగర్ లలో కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించారు. అమ్రేలి, భావ్ నగర్, సురేంద్రనగర్, అహ్మదాబాద్, మెహ్సానా, కచ్ వంటి జిల్లాల్లో ఈ ఉద్యమానికి గణనీయమైన మద్దతు మరియు విజయం లభించింది. దళిత ఉద్యమానికి ఒక దిశా నిర్దేశం చేస్తున్న గుజరాత్ ఉద్యమాన్ని వ్యవసాయ విప్లవం ద్వారానే భారత దేశంలో జనతా ప్రజాతంత్ర విప్లవం విజయవంత మవుతుందని విశ్వసించే విప్లవ శక్తులులోతుగా అధ్యయనం చేయాలి. దళిత ఉద్యమాన్ని ఒక అస్తిత్వ ఉద్యమంగానే నిర్వహిస్తున్న అంబేద్కర్ వాదులు దాన్ని విస్తృత ప్రజా ఉద్యమంగా రూపొందించటానికి కావలసిన మౌలిక ఆలోచనా ధారను అందిస్తున్న ఈ గుజరాత్ పరిణామాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. నిజానికి భూమి పై ఆధిపత్యం చెలాయిస్తున్న అన్ని రకాల భూస్వాముల చేతులనుండి భూమిని విడిపించటం ముఖ్యం. వారిలో ఎక్కువమంది అగ్రవర్ణ భూస్వాములున్నది నిజం. అలాగే వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ భూమిలేని వారందరూ దళితులు, దళితేతరులు, అటవీ ప్రాంతాల్లో వున్న గిరిజనులు, గిరిజనేతరులు అందరూ కూడా ఐక్యంగా భూపోరాటాలు చేయవలసిన అవసరం వుంది. అలాటి బలమైన ,విశాలమైన ఉద్యమం కోసం ప్రజలు ఏకం కావాలి