ఖైదీల మార్పిడిని ప్రతిపాదించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ

శాంతి చర్చలకు తాము సైతం సిద్దమన్న రష్యా;

Update: 2025-02-24 13:15 GMT

రష్యా- ఉక్రెయిన్ వార్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇరు దేశాల మధ్య ఖైదీల మార్పిడిని ప్రతిపాదించారు. రష్యా దాడి చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజధాని కీవ్ లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడారు.

రష్యా తన దగ్గర ఉన్న ఉక్రెయిన్ సైనికులను విడుదల చేయాలని, అలాగే తాము కూడా విడుదల చేస్తామని ప్రతిపాదించారు. యుద్దాన్ని ముగించడానికి ఇదో కీలక పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు.

‘‘రష్యా.. ఉక్రెనియన్లను విడుదల చేయాలి. ఉక్రెయిన్ అందరికి ప్రతిఫలంగా అన్నింటిని మార్పిడి చేసుకోవడానికి సిద్దంగా ఉంది. ఇది ప్రారంభించడానికి ఇప్పుడు సరైన సమయం ’’ అని జెలెన్స్కీ వ్యాఖ్యానించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ సంవత్సరం ఉక్రెయిన్ లో నిజమైన, శాశ్వత శాంతికి నాంది కావాలని కూడా ఆయన అన్నారు.
ప్రతిఘటన..
దండయాత్ర జరిగి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా యూరోపియన్ నాయకులు కీవ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు జెలెన్స్కీ ప్రతిఘటన, వీరత్వాన్ని ప్రశంసించారు.
మూడు సంవత్సరాల పాటు తమకు అండగా నిలిచిన వారికి జెలెన్స్కీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి ప్రత్యేకంగా 13 మంది నాయకులు రాగా, మరో 24 మంది ఆన్ లైన్ లో హజరయ్యారని ఆయన ప్రకటించారు. ఇది ఒక చారిత్రక మలుపు అవుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
చర్చలకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన..
మూడు సంవత్సరాలు అవిశ్రాంతంగా కొనసాగుతున్న యుద్దాన్ని ఆపివేసి చర్చలకు తాము సిద్దంగా ఉన్నట్లు రష్యా సైతం ప్రకటించింది. ముందు మాస్కో షరతులు పెట్టడం ఆపండని కూడా క్రిమ్లిన్ వర్గాలు తెలిపాయి.
ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లావ్ రోమ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ శాంతిచర్చలకు సిద్దంగా ఉన్నప్పటికీ, యూరప్ మాత్రం యుద్దం కొనసాగించాలనుకుంటోందని అన్నారు.
గత వారం సౌదీ అరేబియాలోని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో తాను జరిపిన చర్చలు సానుకూలంగా ముగిశాయని చెప్పారు. రష్యాతో భవిష్యత్ లో జరిగే శాంతి చర్చలకు ప్రతినిధిని నియమించాలని లావ్రోవ్ అమెరికాను కోరారు.
అమెరికా అధ్యక్షుడు ఇటీవల రోజుల్లో రష్యాపై యుద్ధం విషయంలో జెలెన్స్కీని విమర్శిస్తున్నాడు. శాంతి విషయంలో తొందరగా తేల్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. నీవల్లే యుద్దం మొదలైందని జెలెన్స్కీని నిందించాడు కూడా.
Tags:    

Similar News