‘ట్రూడో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మద్దతు ఇస్తాం’
న్యూ డెమోక్రాటిక్ పార్టీ అధినేత జగ్మీత్ సింగ్ ప్రకటన
By : 491
Update: 2024-12-21 07:12 GMT
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మరో షాక్ తగిలింది. అధికారంలో ఉన్న మైనారిటీ ప్రభుత్వాన్ని పడగొట్టే తీర్మానాన్ని వచ్చే ఏడాది పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబోతున్నట్లు న్యూ డెమోక్రాటిక్ పార్టీ(ఎన్డీపీ) నాయకుడు జగ్మీత్ సింగ్ ప్రకటించారు. ఉదారవాదుల ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వడానికి తాము సిద్ధంగా లేమని ఆయన పేర్కొన్నారు. జగ్మత్ సింగ్ ఈ మేరకు ఓ లేఖను సామాజిక మాధ్యమం లో ఎక్స్ లో విడుదల చేశారు.
ఈ చర్య ఆ దేశంలో ఇంకోసారి ముందస్తు ఎన్నికలకు దారి తీసే అవకాశం కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది అక్టోబర్ లో ఆ దేశ పార్లమెంట్ కు ఎన్నికలు జరగాలి. ట్రూడో పరిపాలనలో డొల్లతనం వల్ల అక్కడి ప్రజలు, పార్టీలు తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నాయి. అక్కడి ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అనేక సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే సింగ్ అండతో అవి విఫలమయ్యాయి. ఇప్పుడు ఆయన కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
"ఉదారవాదుల పేర నడుపుతునన ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్డీపీ ఓటు వేస్తుంది. కెనడియన్లకు వారి కోసం పని చేసే ప్రభుత్వానికి ఓటు వేసే అవకాశాన్ని ఇస్తుంది" అని ఆయన లేఖలో రాశారు. న్యూ డెమోక్రాట్లు తమ తదుపరి ఓటును హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారని ఆయన అన్నారు.
ఈ సమయంలో ప్రభుత్వ వ్యవహారాల కంటే ప్రతిపక్ష ప్రాధాన్యతలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. సభ ప్రస్తుతం శీతాకాల విరామంలో ఉంది. వచ్చే ఏడాది జనవరి 27న సభ పునఃప్రారంభం కానుంది. కనీసం 21 మంది లిబరల్ ఎంపీలు ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు.
ట్రూడో తన క్యాబినేట్ ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేసిన తర్వాత రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలన్నీ ఆయన ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తాము సిద్దమని ఎన్డీపీ నుంచి సందేశం వచ్చింది.
ట్రంప్ ఎన్నికయ్యాక పెరిగిన కష్టాలు..
తమ దేశానికి అక్రమ వలసలన్నీ కెనడా మీదుగా వస్తున్నాయని, వీటిని తక్షణమే అరికట్టాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైక ట్రంప్ ఇప్పటికే అట్టావాకు అల్టిమేటం జారీ చేశారు. వీటిని ఆపకపోతే కెనడాపై 25 శాతం సుంకం విధిస్తామని కూడా ట్రూడోకు ఆయన తలంటారు.
ఈ సమస్యలు పరిష్కరించడానికి ట్రూడో- ట్రంప్ తో చర్చలు జరిపారు. అయితే ఆ తరువాతనే ఆయన కష్టాలు పెరిగిపోయాయి. తన ఆర్థిక మంత్రితో బేదాభిప్రాయాలు తలెత్తడంతో ఆయన రాజీనామా చేశారు. తరువాత ఎన్డీపీ అధినేత నుంచి ఈ ప్రకటన వచ్చింది. "లిబరల్ పార్టీకి ఎవరు నాయకత్వం వహించినా, ఈ ప్రభుత్వ సమయం ముగిసింది" అని సింగ్ లేఖలో పేర్కొన్నారు. ఉదారవాదులు తరచూ తమ వాగ్దానాలకు అనుగుణంగా జీవించడం లేదని, ఇప్పుడు మార్పుకు సమయం ఆసన్నమైందని కూడా సింగ్ అసహనం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ లోనే న్యూడెమోక్రాట్ పార్టీ తన మద్ధతును ప్రభుత్వానికి ఉపసంహరించుకుంది. అయితే పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిసారీ అనుకూలంగా ఓట్లు వేసింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ నాయకుడు పియరీ పోయిలీవ్రే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. వెంటనే పార్లమెంట్ ను సమావేశపరచాలని, దీనిపై ఓటింగ్ జరిపి ఎన్నికలకు వెళ్లాలని ఆయన కోరారు.
అయితే ఈ ప్రకటనపై అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. క్రిస్టమస్ తరువాత తమ కార్యాచరణ ప్రకటిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. కెనడాలో తాజాగా ప్రకటించిన రేటింగ్ ల ప్రకారం.. ట్రూడో పాపులారిటీ దారుణంగా పడిపోయింది. నిత్యవసరాల ధరలు పెరగడం, పెరిగిన ఇంటిరేట్లు, నిరుద్యోగంతో కెనడీయన్లు సతమతం అవుతున్నారు. ఎన్నికలకు వెళితే ఆ పార్టీకి తీవ్ర నష్టం తప్పదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.