టేలర్ స్విఫ్ట్ గొంతెత్తితే దిక్కులు పిక్కటిల్లుతాయి. కుర్రకారు బట్టలు చించుకుంటుంది. కలం పట్టి పాట రాస్తే కకావికలే. గిటారు చేపట్టి స్టేజి మీదకొస్తే కాసుల పంటే. చేయి పైకెత్తి మైకు పట్టిందంటే హాలు హాలంతా ఈలలు, కేకలే.. అమెరికాలో ఆమెకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇదంతా ఒక ఎత్తయితే ఆమె పడిలేచిన కెరటం. ఆమెను తొక్కిపెట్టాలని ప్రయత్నించిన ప్రతిసారీ ఆమె నేలకు కొట్టిన బంతిలా పైకెగసి పడుతూనే ఉంది. నిండా 36 ఏళ్లు ఈ పిల్ల ఆపన్నులకు అభయ హస్తం. వేల కోట్ల సంపాదన ఉన్నా పిల్లికి బిచ్చం పెట్టని వారెందరో ఉన్న ప్రస్తుత ప్రపంచంలో ఆమెకి ఆమే సాటన్నట్టుగా మీడియా హోరెత్తించింది. 2024 జూన్ లో టైమ్స్ మొదలు జియోగ్రాఫిక్ వరకు అమెరికాలోని అన్ని మ్యాగజైన్లు ఆమెపై ప్రత్యేక సంచికలు తెచ్చాయంటేనే ఆమెంటో ఆమె పవరెంటో అర్థమవుతుంది. అటువంటి ఆమె ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ పై బాంబేసింది. నా ఓటు డెమెక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్ కే నంటూ ట్వీట్ చేసింది. ఇక అంతే ట్రంప్ కి చిర్రెత్తుకొచ్చింది. ఆమెపై ఇంతెత్తున విరుచుకుపడ్డారు. ఆమె అంటేనే అసహ్యం, చీదరంటూ తిట్లకు లంకించుకున్నాడు.
ఆమె ఏమన్నారంటే...
"మీలో చాలామందిలాగే నేను ఈ రాత్రి (సెప్టెంబర్ 10) చర్చను చూశాను. ఈ అభ్యర్థులు ప్రస్తుత అంశాలపై ఏమి మాట్లాడారో చూసి ఉంటారు. వాటిపై మీరు ఇప్పటికే పరిశోధన చేసి ఉంటే సరేసరి. లేకుంటే ఇప్పుడైనా చేయండి. ఇది మంచి టైమ్. ఒక ఓటరుగా ఈ దేశం కోసం వాళ్లు ఏమి చేయాలనుకుంటున్నారో వారి ప్రణాళికలు లేమిటో తెలుసుకుంటుంటాను. చదువుతూ ఉంటాను.
గతంలో నేను ట్రంప్ ను సమర్థించకపోయినా ఆయన సైట్ లో నా పేరిట తప్పుగా పోస్ట్ చేశారు. అది నాకు ఇటీవలే తెలిసింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) పట్ల నాకున్న భయాలను, తప్పుడు సమాచార వ్యాప్తికి ఇదెలా పనికి వస్తుందన్న ముప్పును సూచించింది. సరిగ్గా ఈ భయమే నేను ఓ ఓటరుగా ఈ ఎన్నికల్లో నా మనసులో మాటేమిటో బయటపెట్టేలా చేసింది. చాలా పారదర్శకంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చేలా చేసింది. తప్పుడు సమాచారాన్ని అరికట్టాలంటే ఇదే సులువైన మార్గం. అదే సత్యం. నేను 2024 అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, టిమ్ వాల్జ్‌లకు నా ఓటు వేయబోతున్నాను. నేను కమలాహారిస్‌కి ఎందుకు ఓటు వేస్తున్నానంటే హక్కులు, సమస్యలపై ఆమె పోరాడుతుంది. వాటిని సాధించాలంటే ఇప్పుడో పోరాట యోధుడు అవసరమని నేను నమ్ముతున్నాను. ఆమెలో నాకు ఆ లక్షణాలు కనిపించాయి. ఆమె ఒక స్థిరమైన, ప్రతిభావంతులైన నాయకురాలు అని నేను భావిస్తున్నాను. ఆమె నాయకత్వంలో మనం ప్రశాంతంగా, గందరగోళంగా కాకుండా ఉంటామని నమ్ముతున్నా. ఈ దేశంలో మనం ఇంకా చాలా సాధించగలమని భావిస్తున్నా. దశాబ్దాలుగా ఎల్జీబీటీక్యూల హక్కులు, ఐవీఎఫ్, స్త్రీకి తన సొంత శరీరంపై ఉన్న హక్కు కోసం నిలబడిన ఆమె రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే వ్యక్తి) టిమ్ వాల్జ్ ఎంపిక నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.
నేను నా పరిశోధన చేసిన తర్వాత నేను వాళ్లకే నా ఓటు వేయాలని నిర్ణయించుకున్నా. మీరూ పరిశోధన చేయండి. మీ నిర్ణయం మీరు తీసుకోండి. నేను మాత్రం నా నిర్ణయాన్ని చెప్పాలనకుంటున్నా. ముఖ్యంగా మొదటి సారి ఓటర్లు అయిన వారికి నాదో విన్నపం-- మీరు ఓటు వేయాలంటే మీరు ముందు నమోదు చేయించుకోవాలని గుర్తుంచుకోండి. అప్పుడు మాత్రమే మీరు ముందుగా ఓటేయగలుగుతారు. ఎక్కడ నమోదు చేసుకోవాలో లింక్ పంపిస్తున్నా. నా స్టోరీలో ముందస్తు ఓటింగ్ తేదీలు, సమాచారం కూడా ఉంది. చూడండి." ప్రేమతో,
టేలర్ స్విఫ్ట్
పిల్లలు లేని ఆడ పిల్లి
అసలింతకీ ఈమె ఎవరు?
"పరిశ్రమలోని వివిధ రంగాలపై ఆధిపత్యం చెలాయించే విభిన్న కళాకారులు అనేక మంది మీకు కనిపిస్తారు. వారిలో కొందరు స్ట్రీమింగ్‌లో బాగా పెద్దవారు. ఇంకొందరు ఇప్పుడిప్పుడే ఎదగాలనుకుంటున్న వారు, కొందరు ఒమెట్టు పైకి ఎదిగినవారు కనిపిస్తారు. మరికొందరు పైకి రావాలనుకుంటున్నారు. కానీ రేడియోలో అయినా, స్ట్రీమింగ్‌లో అయినా టేలర్ స్విఫ్ట్ కంటే మెరుగైన వారు ఈ టైమ్ లో ఎవరూ లేరని నేను ఘంటాపధంగా చెప్పగలను. అది టిక్కెట్ అమ్మకాల విషయంలోనైనా ఆటపాటలతో ఆమె చూపే ప్రభావం పైన్నైనా.." అని ప్రముఖ రికార్డింగ్ సంస్థ బిల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాసన్ లిప్‌షట్జ్ అన్నారంటే ఆమె హవా ఎంతటితో మనం అర్థం చేసుకోవచ్చు.
పెన్సిల్వేనియా నుంచే ఎదుగుదల..
1989 డిసెంబర్ 13న పెన్సిల్వేనియాలోని వెస్ట్ రీడింగ్ లో పుట్టింది. ఆమెకు గాయకుడు, పాటల రచయిత జేమ్స్ టేలర్ పేరు పెట్టారు. ఆమె తండ్రి స్కాట్ కింగ్స్లీ స్విఫ్ట్. స్టాక్ బ్రోకర్. ఆమె తల్లి ఆండ్రియా గార్డనర్ స్విఫ్ట్. కొంతకాలం మ్యూచువల్ ఫండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.స్విఫ్ట్ తమ్ముడు ఆస్టిన్ నటుడు. వారి అమ్మమ్మ మార్జోరీ ఫిన్లే ఒపెరా సింగర్. చర్చిలో కూడా పాటలు పాడుతుండేది. అమ్మమ్మ ప్రభావంతోనే స్విఫ్ట్ సంగీతం వైపు ఆసక్తి చూపినట్టు చెబుతారు. వాళ్ల అమ్మమ్మ తోబుట్టువులు స్కాటిష్, ఇంగ్లీష్, జర్మన్ సంతతికి చెందినవారు. ఇటాలియన్, ఐరిష్ వంశానికి చెందినవారు. స్విఫ్ట్ తన పాటల్ని తానే రాసుకుని పాడుతుంది. తానే ట్యూన్ కడుతుంది. తానే మ్యూజిక్ సమకూర్చుకుంటుంది. అమెరికన్ సంగీత సామ్రాజ్యంలో ఇప్పుడు ఆమో సామ్రాజ్ఞి. విస్తృత ప్రజాదరణ ఉన్న వ్యక్తుల్లో ఆమె ఒకరు.
అమ్మమ్మ ప్రేరణతోనే ఈ స్థాయికి...
స్విఫ్ట్ తన బాల్యాన్ని పెన్సిల్వేనియాలోని క్రిస్మస్ ట్రీ ఫారమ్‌లో గడిపింది. వేసవి సెలవుల్ని న్యూజెర్సీలోని స్టోన్ హార్బర్‌లోని తన కుటుంబానికున్న వెకేషన్ హోమ్‌లో గడిపేవారు. అక్కడ ఆమె అప్పుడప్పుడు తాను ట్యూన్ కట్టిన పాటల్ని పాడి వినిపించేది. కుటుంబ సభ్యులు ప్రోత్సహం చాలా ఎక్కువగా ఉండడంతో సంగీతంపై మక్కువ పెంచుకుంది. ఆమె క్రిస్టియన్. బెర్నార్డిన్ సిస్టర్స్ నిర్వహించే మాంటిస్సోరి స్కూల్‌లో ప్రీస్కూల్, కిండర్ గార్టెన్ చదివింది. ఆమె కుటుంబం వ్యోమిసింగ్‌కు మారినప్పుడు ఆమె వ్యోమిస్సింగ్ ఏరియా హై స్కూల్‌లో చేరింది. చిన్నతనంలో ఆమె బెర్క్స్ యూత్ థియేటర్ అకాడమీ ప్రొడక్షన్స్ లో ప్రదర్శన ఇచ్చింది. గాత్రం, నటన శిక్షణ కోసం న్యూయార్క్ నగరానికి వెళ్లి వస్తుండేది. దేశీయ సంగీతం పట్ల ఆమెకున్న తొలి ప్రేమను షానియా ట్వైన్, ప్యాట్సీ క్లైన్, లీఆన్ రిమ్స్, డిక్సీ చిక్స్ ప్రభావితం చేశారు. వారాంతాల్లో, పండుగలు పబ్బాలు వచ్చినపుడు చిన్న చిన్న ప్రదర్శనలు ఇచ్చేది. ఫెయిత్ హిల్ గురించిన ఒక డాక్యుమెంటరీని చూసిన తర్వాత ఆమె టెన్నెస్సీలోని నాష్‌విల్లేలో దేశవాళీ సంగీత వృత్తిని కొనసాగించాలని నిశ్చయించుకుంది. అప్పటి నుంచి అనేక డక్కీ మొక్కీలు తిన్నది. 11 ఏళ్లవయసులోనే పాటల రికార్డింగ్ కి వెళ్లి తిరిగొచ్చింది. దాంతో పాటల రచనపై దృష్టి పెట్టింది. 12వ ఏట స్థానిక సంగీతకళాకారుడు రోనీ క్రీమెర్ సహాయంతో గిటార్ నేర్చుకోవడం ప్రారంభించింది. ఇతనే పాట రాయడంలో స్విఫ్ట్‌కు సహాయం చేశాడు. 13 ఏళ్లకు ఏ కంపెనీలైతే ఆమె పాటను తిరస్కరించాయో వాళ్లతోనే కాంట్రాక్ట్ కుదుర్చుకునే స్థాయికి ఎదిగింది. 2003లో తొలి ఆల్బమ్ విడుదల చేసింది. స్విఫ్ట్ సంగీత రంగంలోకి ప్రవేశించడంలో ఆమెకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఫ్యామిలీ మకాంను టెన్నిసేకి మకాం మార్చారు. అప్పటికి ఆమె వయసు 14 ఏళ్లు. ఓ పక్క స్కూలుకు వెళుతూనే ఆమే ఈ భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకోవడం గమనార్హం.
2006 నుంచి వెనుదిరిగి చూడలేదు...
స్విఫ్ట్ తన మొదటి రెండు ఆల్బమ్‌లను 2006లో విడుదల చేశారు. ఫియర్‌లెస్ ఆల్బమ్ ఆమెకు మంచి పేరు తెచ్చింది. కంట్రీ పాప్ సింగర్‌గా ప్రారంభించి ఈవేళ ఎక్కడికో వెళ్లింది. ఈవేళ ఆమె ఏ ఆల్బమ్ విడుదల చేసినా కనీసం ఓ కోటి అమ్ముడవుతాయని అంచనా. మనం చిరంజీవితో సినిమాతో మినిమం గ్యారంటీ ఎలా ఉంటుందో ఆమెకు అలాంటి ఫేమ్ ఉంది. కొన్ని లక్షల కోట్లకు అధిపతి. ఒకటో రెండో జెట్ విమానాలు ఉన్నాయి. అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఎందరెందరో కేసులు పెట్టారు. ఆమెను తొక్కేయాలని ప్రయత్నించారు. ఒకరిద్దరితో డేటింగ్ చేసినట్టు వదంతులు వచ్చినా ఇంకా ఎవర్నీ పెళ్లి చేసుకున్నట్టు రికార్డుల్లో లేదు.
ధాతృత్వంలో పెద్ద గుండె...
ఆమె ఎంతగా సంపాయించిందో అంతగా విరాళాలు ఇస్తుంది. ధాతృత్వంలో ఆమెది పెద్ద మనసంటారు. స్త్రీలు, పిల్లల కోసం ఉద్దేశించే అనేక కార్యక్రమాలకు ఆమె చేయూతనిస్తోంది. లక్షల డాలర్ల విరాళాలు ఇచ్చింది. క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏర్పడిన ట్రస్ట్ కి ఆమె పెద్ద ప్యాట్రన్. పండుటాకుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఆమె సంగీత కచేరికి బయలు దేరిందంటే తన సిబ్బంది యావత్తుకి పండగే. ఇటీవలి టూర్ లో తాను ఆగిన ప్రతి చోటా స్విఫ్ట్ ఫుడ్ బ్యాంక్‌లకు విరాళం ఇచ్చింది. 2024 ఫిబ్రవరిలో ఆమె తన మొత్తం సిబ్బందికి 55 మిలియన్ డాలర్ల బోనస్ ఇచ్చి అబ్బురపరిచింది. కాన్సాస్ సిటీ చీఫ్స్ సూపర్ బౌల్ పరేడ్‌లో కాల్పుల్లో మరణించిన ఒక మహిళ కుటుంబానికి లక్ష డాలర్ల విరాళం ఇచ్చి అందర్నీ విస్మయపరిచింది. ఇలా అనేకం ఆమె ఖాతాలో ఉన్నాయి.
ఆమె దేశవాళి పాప్ సంగీతంలోకి ప్రవేశించి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఈ ఏడాది జూన్ లో ఆమెను కీర్తించన పత్రికలు, టీవీలు లేవంటే అతిశయోక్తి కాదు. ఆమె పాపులారిటీ అంతగా ఉంటుంది కాబట్టే ట్రంప్ కి తరకలు పట్టుకున్నాయి. తిట్లకు లంకించుకున్నాడని ఆమె అభిమానులు అంటున్నారు.