అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థుల గురించి ఖర్గే ఏమన్నారు?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.

Update: 2024-04-27 12:36 GMT

యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోటగా చెప్పుకోవాలి. సోనియా కుటుంబం ఇక్కడి నుంచి గత కొన్నేళ్లుగా పోటీ చేసి పార్లమెంట్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ సారి సోనియా గాంధీ లోక్ సభ ఎన్నికల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజ్య సభలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక రాహుల్ గాంధీ కేరళలోని వయానాడ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. మరి ఇక్కడి నుంచి పోటీ చేసేదెవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం తెలిపారు.

‘‘అవినీతిపరులను జైళ్లలో పెట్టాలని బీజేపీ చెబుతోంది. కాని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు తమ పార్టీలో చేరినప్పుడు అవేం గుర్తుకు రావడం లేదు. వారిని రాజ్యసభ లేదా అసెంబ్లీకి పంపుతున్నారు’’ అని పేర్కొన్నారు.

‘ అభ్యర్థులెవరనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.. ప్రజల నుంచి అభ్యర్థుల పేర్లు నా వద్దకు వచ్చాయి. వాటిని పరిశీలించి ప్రకటిస్తాం’ అని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

అమేధి నుంచి కాకుండా కేరళలోని వయనాడ్ నుంచి మాత్రమే ఈ సారి రాహుల్ పోటీ చేస్తుండడాన్ని కొందరు బీజేపీ నేతలు తప్పుబట్టారు. దీనికి ఖర్గే సమాధానమిస్తూ.. 'నియోజక వర్గాల మార్పు గురించి కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్న వారు (అటల్ బిహారీ) వాజ్‌పేయి, (లాల్ కృష్ణ) అద్వానీలు ఎన్నిసార్లు సీట్లు మారారో కూడా చెప్పాలి' అని ఎదురు ప్రశ్నించారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గురించి ప్రస్తావిస్తూ.. "పార్టీలో ఎదిగి, ఆ తర్వాత విడిచిపెట్టిన" వ్యక్తుల ప్రభావం కాంగ్రెస్‌పై ఏ మాత్రం ఉండదన్నారు.

కాంగ్రెస్‌ ప్రవహించే నదిలాంటిదని, కొందరు వ్యక్తులు దానిని విడిచిపెట్టడం వల్ల ప్రభావితం కాదన్నారు. అలాంటి వారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు.

Tags:    

Similar News