వైమానిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ హతం..?
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ మరొ కీలక విజయం సాధించినట్లు ప్రకటించింది. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మరణించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
By : 491
Update: 2024-09-28 09:37 GMT
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ గొప్ప విజయం సాధించినట్లు ప్రకటించింది. హిజ్బుల్లా నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లా వైమానిక దాడిలో మరణించారని ఐడీఎఫ్ ప్రకటించింది. లెబనాన్‌లోని బీరుట్‌పై చేసిన వైమానిక దాడిలో ఇతడు మరణించాడని ఇజ్రాయెల్ వెల్లడించింది.
అంతకుముందు రోజు, అతని కుమార్తె జైనాబ్ నస్రల్లా బీరూట్‌పై ఇజ్రాయెల్ చేసిన భారీ వైమానిక దాడిలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అదే దాడుల్లో నస్రల్లా హతమయ్యాడని ఇజ్రాయెల్ వాదన. తమకు వచ్చిన కీలక సమాచారం ప్రకారం దీనిని ధృవీకరించుకున్నట్లు తెలిపింది.
శనివారం, ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదవ్ శోషని ఎక్స్ లో ఇలా ప్రకటించారు. "హసన్ నస్రల్లా చనిపోయాడు." మరో సైనిక ప్రతినిధి, కెప్టెన్ డేవిడ్ అవ్రహం, శుక్రవారం నాటి వైమానిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ "తొలగించబడ్డారని" వార్తా సంస్థకు చెప్పారు.
చాలా కాలంగా ఇజ్రాయెల్ లక్ష్యం
మరణాలకు సంబంధించి లెబనాన్ నుంచి అధికారిక ధృవీకరణ లేదు. ఈ మరణాలు ఇప్పటికే యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతంలో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య సంఘర్షణను మరింత తీవ్రతరం చేయడానికి దారితీయవచ్చు. నస్రల్లా చాలా కాలంగా ఇజ్రాయెల్ లక్ష్యంగా ఉన్నాడు. నస్రల్లా దాదాపు రెండు దశాబ్ధాలుగా బయటకు రావడం మానేశాడు. హిజ్బుల్లా రాజకీయ శక్తిగా మారడంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు.
నస్రల్లా పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు, అలాగే ఇరాక్, యెమెన్‌లోని సాయుధ మిలీషియాలకు శిక్షణ ఇవ్వడంతో పాటు హిజ్బుల్లాను నడిపించాడు. ఇరాన్‌తో సన్నిహిత వ్యక్తిగత సంబంధాలతో, అతను ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉపయోగించే క్షిపణులు, రాకెట్‌ల సేకరణను కూడా సులభతరం చేసింది.
ఇప్పటికే రెండు హిజ్బుల్లా రాకెట్ చీఫ్, రెండు, మూడు స్థానాల్లో ఉన్న నాయకులు.. దాదాపు 37 మంది టాప్ కమాండర్ లో చంపేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ సైతం మట్టిలో కలిపేసింది. త్వరలో లెబనాన్ పైకి భూతల దాడులు చేస్తామని ఇంతకుముందే ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే వైమానిక దాడులతో హిజ్బుల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
దక్షిణ లెబనాన్ నుంచి నిరంతరాయంగా రాకెట్లు, క్షిపణులు తమ భూభాగంపై ప్రయోగిస్తున్నారని, మమ్మల్ని మేము రక్షించుకునే హక్కు ఉందని నెతన్యాహూ ఇప్పటికే ఐరాసలో ప్రకటించారు. గత 40 సంవత్సరాలుగా ఐరాస చేసిందేమీ లేదని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న ఇరాన్ పై ఎక్కడ అయిన దాడి చేస్తామని కూడా గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. అందులో భాగంగానే 21 రోజుల కాల్పుల విరమణ ను కూడా ఆయన వ్యతిరేకించాడు.