సీజ్ ఫైర్ చర్చలు: ఇజ్రాయెల్- హమాస్ కు ఈ సారి కొత్త వేదిక
ఇజ్రాయెల్- హమాస్ శాంతి చర్చల కోసం కొత్త వేదిక కేంద్రంగా చర్చలు జరపబోతున్నారు. అయితే ఈ సీజ్ ఫైర్ కోసం హమాస్, ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నాయా?
By : Praveen Chepyala
Update: 2024-05-03 13:13 GMT
ఇజ్రాయెల్- ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య గాజా కేంద్రంగా జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ కోసం అనేక ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా శాంతి చర్చల కోసం ఓ బృందాన్ని హమాస్ ఈజిప్టుకు పంపినట్లు తెలుస్తోంది.
అమెరికా సహ ఇతర అంతర్జాతీయ సమాజం శాంతి చర్చల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాల్పుల విరమణ ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపించింది. అయితే ఉగ్రవాద సంస్థ హమాస్ ను నాశనం చేసి కానీ యుద్దాన్ని విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్న ఇజ్రాయెల్ ఈ చర్చలపై ఏం అంటుందో చూడాలి.
ఐరాస నివేదిక ప్రకారం ఇప్పటికే గాజాలో ధ్వంసమైన అన్ని ఇళ్లను తిరిగి పున: నిర్మించాలంటే 2040 వరకూ పడుతుందని అంచనా వేసింది. గాజాలో జరుగుతున్న పోరాటాలు ఇంకా అక్కడి జనాభాను ఆర్థిక వ్యవస్థను తరతరాలుగా వెనకకు జరిగేలా చేస్తుందని వ్యాఖ్యానించింది. దాదాపు ఏడు నెలలుగా ఉగ్రవాద సంస్థ హమాస్ తో ఐడీఎఫ్ దళాలు పోరాడుతూనే ఉన్నాయి.
అమెరికా, ఈజిప్టు మధ్య వర్తుల సమక్షంలో ఈ శాంతిచర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది మూడు దశల్లో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట తక్షణమే ఆరువారాల కాల్పుల విరమణ జరగడం, పాక్షికంగా బందీలను విడిపించడం, తరువాత శాశ్వత శాంతి చర్చలు కొనసాగడం ముఖ్యం. అలాగే గాజాలో తిష్టవేసిన ఐడీఎఫ్ దళాలను కూడా ఉపసంహరించాలనే ప్రతిపాదనలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయో ఇప్పటికే ఈజిప్టు ఇంటెలిజెన్స్ చీఫ్ తో మాట్లాడినట్లు తెలిసింది. కాల్పుల విరమణ గురించి వీరు పూర్తిగా చర్చించుకుని క్షేత్రస్థాయిలో దీని ప్రభావం అధ్యయనం చేశారని అంతర్జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. అలాగే ఇప్పటి వరకూ హామాస్ కు అండగా నిలబడిన ఖతార్ ప్రధానితోనూ ఈ విషయం మాట్లాడినట్లు ఇస్మాయిల్ చెప్పారు. హమాస్ తరఫున ఒక ఉన్నత స్థాయి బృందం కైరోకు వెళ్లినట్లు తేలింది.
ఇప్పటికే ఈ యుద్దంలో దాదాపు 34 వేల మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. ఈ శాంతి చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వాలని మధ్యవర్తులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాదే అమెరికా, బ్రిటన్ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు పాలస్తీనా ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి.
పూర్తిగా బందీల విడుదలకు హమాస్ అంగీకరిస్తే ఇజ్రాయెల్ శాంతి చర్చలకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. లేకుంటే అక్టోబర్ ఏడు నాటి పాశవిక ఘటన తరువాత ఇజ్రాయెల్ చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపుతుంది. హమాస్ ను కూకటి వేళ్లతో పీకేస్తామని అది భీకరంగా భూతల దాడులు చేస్తోంది.
ఇప్పటికే రఫాలో వైమానిక దాడులు మొదలుపెట్టింది. భూతల దాడులకు ప్రణాళికలు రచిస్తోంది. ఒక్కసారి దాడులకు దిగితే టెల్ అవీవ్ ఇక వెనక్కి తగ్గదు. ఇక్కడ దాదాపు 23 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా గాజాలోని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారే.
గాజాలో ఇక నుంచి తమ సైన్యం ఉంటుందని కూడా ఇజ్రాయెల్ నాయకులు అంటున్నారు. ఏ ఉగ్రవాద సంస్థను ఇక్కడ ఎదగనీయమని, అలాగే గాజా పున: నిర్మాణం కూడా చేయనివ్వని యూదు అతివాదులు ప్రకటనలు చేస్తున్నారు. ఇది శాంతి చర్చల ప్రక్రియలో ఓ స్పీడ్ బ్రేకర్ లా మారే ప్రమాదం ఉంది.
కాల్పులు విరమణ జరిగిన రఫా మిగలదు: నెతన్యాహూ
హమాస్ తో కాల్పుల విరమణ జరిగిన యుద్దం ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహూ ఇప్పటికే అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్ కు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని బుధవారం బ్లింకెన్ తో జరిగిన మీటింగ్ లో స్పష్టం చేసినట్లు తేలింది.
హమాస్ కూడా అస్పష్టంగా ఉంది: ఈజిప్టు
శాంతి చర్చల ప్రక్రియలో హమాస్ కూడా పూర్తి సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదని ఓ ఈజిప్టు అధికారి తెలిపారు. బందీల విడుదల, ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ విషయంలో దానికి ఓ విధాన నిర్ణయం లేదని వెల్లడించారు.
బుధవారం సాయంత్రం, హమాస్ ఉన్నతాధికారి ఒసామా హమ్దాన్ మాట్లాడిన మాటలు కూడా ఇవే అంశాన్ని ధృవీకరించేలా ఉన్నాయి. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు చెందిన అల్-మనార్ టీవీతో మాట్లాడుతూ, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, అయితే ఇజ్రాయెల్ రఫాపై దాడి చేస్తే ఆగిపోతుందని అన్నారు.
అదే సమయంలో సెంట్రల్ గాజాలోని డీర్ అల్-బలాహ్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఒక చిన్నారితో సహా కనీసం ఐదుగురు మరణించారు. మృతదేహాలను ఆసుపత్రిలో అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్టులు చూసి లెక్కించారు.
అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1,200 మందిని హతమార్చారు, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకున్నారు, కొంతమందిని నవంబర్‌లో కాల్పుల విరమణ సమయంలో విడుదల చేశారు. హమాస్ ఇప్పటికీ దాదాపు 100 మంది బందీలను 30 మందికి యూదు పౌరుల మృతదేహాలను తన వద్దే ఉంచుకుంది. ఈ యుద్దం వల్ల గాజా పూర్తి గా ధ్వంసం అవుతోంది. దాదాపు 80 శాతం మంది తమ ఇళ్ల నుంచి బయటకు తరిమివేయబడ్డారు.
2024లో, గాజా- వెస్ట్ బ్యాంక్ రెండింటితో సహా మొత్తం పాలస్తీనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటివరకు 25.8 శాతం కుదించబడిందని ఐరాస నివేదిక పేర్కొంది. యుద్ధం కొనసాగితే, జూలై నాటికి నష్టం 29 శాతానికి చేరుకుంటుంది. ఇజ్రాయెల్ లోపల ఉద్యోగాలపై ఆధారపడిన పదివేల మంది కార్మికులకు వర్క్ పర్మిట్‌లను రద్దు చేస్తూ ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయంతో వెస్ట్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది.