యూపీలో తొక్కిసలాట: బాధితుల కోసం కుటుంబసభ్యుల వెతుకులాట

ఒక మహిళ ట్రక్కులో ఐదారు మృతదేహాల మధ్య ఏడుస్తూ కూర్చుంది. ట్రక్కు నుంచి తన కుమార్తె మృతదేహాన్ని కిందకు దించాలని కోరడం స్థానికులను కంటతడి పెట్టించింది.

Update: 2024-07-03 07:55 GMT

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా ఫుల్రాయి గ్రామంలో మంగళవారం సత్సంగ్ (మతపర కార్యక్రమం) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన, గాయపడ్డవారి కోసం వారి కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. సత్సంగ్ ముగిశాక మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దాంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరాడక కొందరు ఘటన స్థలంలోనే ప్రాణాలొదిగారు. గాయపడ్డ వారిని ఘటన స్థలానికి సమీపంలోని సికంద్రరావు ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

జిల్లా ఆసుపత్రి వద్ద బాధితుల కుటుంబసభ్యులు..

ఘటన స్థలంలో చనిపోయిన వారిని మంగళవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిని ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాధితుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇప్పటి దాకా ఈ ఘటనలో 116 చనిపోయారని అధికారులు నిర్ధారించారు.

కిక్కిరిసిన ఆరోగ్య కేంద్రం..

సికంద్రరావు ఆరోగ్య కేంద్రం వెలుపల బాధితుల కుటుంబసభ్యులతో కిక్కిరిసింది. తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో అర్థరాత్రి వరకు అక్కడే వెతకడం ప్రారంభించారు.

కస్గంజ్ జిల్లాలో నివసిస్తున్న రాజేష్ అనే వ్యక్తి తన తల్లి కోసం వెతుకుతున్నానని చెప్పాడు. శివమ్ తన అత్తను వెదికేందుకు వచ్చానన్నాడు. ఈ ఇద్దరూ తమ వారి ఫోటోలను మొబైల్ ఫోన్లలో చూపుతూ ఎక్కడైనా చూశారా? అని కలియతిరిగారు.

"ఒక న్యూస్ ఛానెల్‌లో నేను మా అమ్మ ఫొటో చూశాను. మా అమ్మతో పాటు గ్రామానికి చెందిన మరో రెండు డజన్ల మంది కలిసి సత్సంగ్‌కు వెళ్లారు" అని రాజేష్ చెప్పారు.

తప్పిపోయిన తమ బంధువు తండ్రి గోపాల్ సింగ్ (40) కోసం అన్షు, పబల్ కుమార్ అనే వ్యక్తులు ఖాళీ పాల కంటైనర్ల లోడ్‌తో ఉన్న చిన్న పికప్ ట్రక్‌తో ఆరోగ్య కేంద్రం దగ్గర వేచి ఉండడం కనిపించింది. "ఆయన (గోపాల్ సింగ్) సత్సంగ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఆయన వద్ద సెల్ ఫోన్ కూడా లేదు. వాస్తవానికి ఆయన బాబా భక్తుడు కూడా కాదు. పరిచయస్తుల ఒత్తిడితో తొలిసారిగా ఈ కార్యక్రమానికి వెళ్లాడు’’ అని అన్షు చెప్పారు.

‘‘అమ్మతో కలిసి ‘సంగత్‌’కు వెళ్లాలనుకున్నాను. మేం ఉన్న చోట (సాదిక్‌పూర్)లో చినుకులు పడుతుండడంతో వెళ్లలేదు.’’ అని తల్లి సుదామా దేవి (65)ని కోల్పోయిన మీనా దేవి ఆసుపత్రి వద్ద కన్నీరు పెట్టుకున్నారు.

బార్సే గ్రామంలో నివసిస్తున్న వినోద్ కుమార్ సూర్యవంశీ తన 72 ఏళ్ల అత్తను కోల్పోయాడు. అదృష్టవశాత్తూ ఆయన తల్లి ప్రాణాలతో బయటపడింది.

"అత్తగారి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నేను ఆసుపత్రి వచ్చి మూడు గంటలైంది. పోస్ట్‌మార్టం చేయాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియదు" అని అన్నాడు. సూర్యవంశీ మాట్లాడుతూ.. తన అత్త, తల్లి ఇద్దరూ 15 సంవత్సరాలుగా బాబా భక్తులు అని చెప్పారు. తొక్కిసలాట జరగడం "దురదృష్టకరం" అని పేర్కొన్నారు.

ఇటు RSS, బజరంగ్ దళ్ కార్యకర్తలు, వాలంటీర్లు మధ్యాహ్నం నుంచి ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల కుటుంబసభ్యులు, బంధువులకు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఒక మహిళ ట్రక్కులో ఐదు లేదా ఆరు మృతదేహాల మధ్య ఏడుస్తూ కూర్చుంది. ట్రక్కు నుంచి తన కుమార్తె మృతదేహాన్ని కిందకి దించాలని కోరడం స్థానికులను కంటతడి పెట్టించింది.

"తొక్కిసలాటలో దాదాపు 100-200 మంది గాయపడ్డారు. ఆసుపత్రిలో ఒక వైద్యుడు మాత్రమే ఉన్నాడు. ఆక్సిజన్ సౌకర్యం లేదు. వైద్య సౌకర్యాలు లేవు," అని ఒక యువకుడు ఆసుపత్రి వెలుపల చెప్పాడు.

'సత్సంగం' ముగిశాక ప్రజలు వేదిక నుంచి వెళ్లిపోతుండగా తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షి శకుంతలా దేవి తెలిపారు. " మురుగు ప్రవాహం వల్ల ఎత్తులో నిర్మించిన రోడ్డుపై జారి ఒకరిపై ఒకరు పడిపోయారు " ఆమె చెప్పింది.

మరో ప్రత్యక్ష సాక్షి సోను కుమార్ మాట్లాడుతూ.. వేదిక వద్ద కనీసం 10,000 మంది ప్రజలు ఉన్నారని, బాబా వెళ్లిపోతున్నప్పుడు వారిలో చాలామంది ఆయన పాదాలను తాకడానికి పరుగెత్తారని చెప్పారు.

కార్యక్రమం ముగియకముందే వేదిక నుండి వెళ్లిపోయిన మరొక వ్యక్తి మాట్లాడుతూ.. వచ్చిన జనానికి అనుకూలంగా ఏర్పాట్లు లేవని చెప్పారు.

సత్సంగానికి ఫిరోజాబాద్‌ నుంచి హత్రాస్‌కు వెళ్లిన సంతోష్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నేను మా సోదరితో కలిసి సత్సంగ్‌కు వెళ్లాను. బాబా మధ్యాహ్నం వచ్చాడు. 1.30 గంటలకు మా సోదరితో కలిసి ప్రసాదం తీసుకుని బయటకు వచ్చారు. బయటకు వచ్చేసరికి అందరూ దర్శనం కోసం పరుగులు తీయడం చూశాం. పక్కనే మురుగు కాలువ ఉంది. అందులో కొందరు పడిపోయారు. సత్సంగ్‌లో పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది’’ అని చెప్పారు.

జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రైవేట్ కార్యక్రమం. దీనికి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. వేదిక వెలుపల భద్రతను సమకూర్చారు. అయితే లోపల ఏర్పాట్లను నిర్వాహకులు చూసుకోవాలి’’ అని చెప్పారు. 

Tags:    

Similar News