సరిహద్దుకు అదనపు బలగాలు పంపుతున్న ట్రంప్
మెక్సికో నుంచి వస్తున్న వలసలు ఆపడం, దేశం నుంచి సామూహికంగా అక్రమ వలసదారులను వెనక్కి పంపడం పై దృష్టి;
By : Praveen Chepyala
Update: 2025-01-23 06:32 GMT
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్.. వలసదారులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్న సంగతి. అందులో భాగంగా దేశంలోని దక్షిణ సరిహద్దుకు అదనంగా మరో 1500 మంది దళాలను పంపాలని పెంటగాన్ నిర్ణయించింది. మెక్సికో నుంచి ప్రతి రోజు వందల సంఖ్యలో అక్రమవలసలు కొనసాగుతుంటాయి. దీనిని అరికట్టడానికి టెక్సాస్ కు అదనపు బలగాలు పంపాలని నిర్ణయించామని పెంటగాన్ ప్రతినిధి చెప్పారు.
దేశం నుంచి సామూహికంగా అక్రమ వలసదారులను బహిష్కరించబోతున్నామని సంకేతాలు సైతం వెలువడుతున్నాయి. అందుకు అనుగుణంగా అమెరికా- మెక్సికో సరిహద్దులోని ఖాళీ ప్రదేశాలలో భారీ ఎత్తును గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రమైన టెక్సాస్ లోని ఎల్ పాసో సరిహద్దు ప్రాంతంలో ఖాళీ ప్రదేశాలను, అలాగే సియుడాడ్ జూయారేజ్ ప్రాంతంలోని ప్రదేశాలను ఎంపిక చేసి షెల్టర్లను నిర్మిస్తున్నారు.
అమెరికా కాంగ్రెస్... దొంగతనం, హింసాత్మక నేరాలకు పాల్పడిన అనధికార వలసదారులను నిర్భంధించడం అవసరమయ్యే బిల్లుకు తుది ఆమోదం తెలిపింది. కొంత ద్వైపాక్షిక మద్దతుతో ట్రంప్ కాంగ్రెస్ కు సంతకం చేయగల మొదటి చట్టాన్ని సూచిస్తుంది. ఇవన్నీ అక్రమవలసలకు అణిచివేసేందుకు తన ప్రణాళికలకు అనుగుణంగా ఉండబోతున్నాయి.
భారత్ కు 18 వేల మంది అక్రమ వలసదారులు..
ట్రంప్ ను ప్రసన్నం చేయడానికి భారత్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో అక్రమంగా వలస వచ్చిన విద్యార్థులు, ఇతరులను వెనక్కి తీసుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. అందులో భాగంగా మొదటి విడతలో 18 వేల మందిని వెనక్కి రప్పించబోతోంది. అమెరికాలో దాదాపు 7 లక్షల మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నారని ఓ లెక్క ఉంది. మెక్సికన్లు, ఎల్ సాల్వేడార్ల తరువాత అత్యధిక మంది అక్రమ వలసదారుల్లో భారతీయులే అధికం.