ఈవీఎంపై ఈసీకి సుప్రీం కీలక ఆదేశం.. బార్ కోడ్,స్లిప్పుల కౌంటింగ్..
దేశంలోని ఏ వ్యవస్థనైనా గుడ్డి గా వ్యతిరేకించడకూడదని పిటిషన్ దారులకు విచారణ సందర్భంగా జస్టిస్ దత్తా చురకలంటించారు. సమాజంలో అనవసర సందేహాలు లేవనెత్తకూడదని..
By : Praveen Chepyala
Update: 2024-04-26 08:50 GMT
ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ (వీవీపీఏటీ)తో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లలో(ఈవీఎం) పోలైన ఓట్లను 100 శాతం క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అయితే కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్పులను లెక్కించేందుకు ఎలక్ట్రానికి మెషిన్లు ఉపయోగించవచ్చో లేదో పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అలాగే వీవీ ప్యాట్ స్లిప్పులపై పార్టీల గుర్తుతో పాటు బార్ కోడ్ ముద్రించే అవకాశం ఉంటే పరిశీలించాలని కోరింది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్యా ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషన్ దారులు లేవనెత్తిన అభ్యంతరాలపై న్యాయస్థానం విస్తృతంగా చర్చించిందని, అలాగే ప్రోటోకాల్, సాంకేతిక అంశాలపై కూడా దృష్టి సారించిందని అన్నారు. అందువల్ల VVPAT స్లిప్‌లతో EVM ఓట్లను మొత్తం వెరిఫికేషన్ చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతున్నట్లు ప్రకటించింది.
సుప్రీం ఆదేశాలు..
ఈ ఏడాది మే 1 న లేదా ఆ తర్వాత చేపట్టిన వీవీప్యాట్‌లలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సింబల్ లోడింగ్ యూనిట్‌లను (ఎస్‌ఎల్‌యూ) సీల్ చేసి కంటైనర్‌లో భద్రపరచాలని పోల్ ప్యానెల్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడే దానికంటే ముందు అంటే కనీసం 45 రోజుల పాటు సీల్డ్ కంటైనర్‌ను ఈవీఎంలతో పాటు స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచుతారు .లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఐదు శాతం ఈవీఎంలలో వాడిన మెమరీ సెమీ కంట్రోలర్‌ను ఈవీఎం తయారీదారుల ఇంజనీర్లు తనిఖీ చేసి ధృవీకరించాలని కోర్టు పేర్కొంది .
గుడ్డిగా వ్యతిరేకించ కూడదు..
వ్యవస్థలోని ఏదైనా అంశాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తే అనవసర సందేహాలు సమాజంలో తలెత్తుతాయని విచారణ సందర్భంగా జస్టిస్ దత్తా అన్నారు. మన ఓటింగ్ వ్యవస్థలో ప్రతి ఈవీఎం బ్యాలేట్ యూనిట్, వీవీప్యాట్ లతో అనుసంధానించబడింది. ఓటు వేసినప్పుడు తను ఎవరికి ఓటు వేస్తున్నాడో ఓటర్ కు తెలుస్తోందని అన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన ఐదు పోలింగ్ బూత్‌లలో పోలైన ఓట్లను ధృవీకరించిన తరువాత కౌంటింగ్ చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం అన్ని వీవీప్యాట్లను, ఈవీఎంలతో క్రాస్ చెక్ చేయాలని కోరుతున్నాయి.
ఇప్పటి వరకూ ఒక్క ఫిర్యాదు రాలేదు
ఈవీఎంలు ప్రవేశపెట్టిన తరువాత సాధారణంగా ఏ ఎన్నికల్లో సాధారణ ఓటర్ తన ఓటు వేరే వారికి పడుతుందని ఫిర్యాదు చేయలేదు. ఇప్పటి వరకూ 118 కోట్ల ఓట్లను కౌంట్ చేయగా కేవలం ఒక్కసారి మాత్రమే ఒకే ఒక్క ఓటు తప్పుగా చూపించింది. అది కూడా మానవ తప్పిదం కారణం అని తరువాత తేలింది.
బ్యాలెట్ బాక్స్ లను ప్రవేశపెడితే విపరీతమైన ఆలస్యంతో పాటు.. కొన్ని ప్రాంతాల్లో బూత్ క్యాప్చర్ జరిగితే పది నిమిషాల్లో వందల ఓట్లు వేసుకునే ప్రమాదం ఉంది. అయితే ఈవీఎం ద్వారా ఒక్క ఓటు వేయడానికి కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాలు సమయం పడుతుంది. దీనివల్ల ప్రజాస్వామ్యంలో పారదర్శకత పెరిగే అవకాశం పెరిగింది.
విదేశాల్లో జనాభా చాలా తక్కువ.. కాబట్టి వారు ఇప్పటికీ బ్యాలెట్ బాక్స్ లను వాడుతున్నారు. అమెరికాలో బ్యాలెట్ బాక్స్ ల ద్వారా ఎన్నికలు జరుగుతుంటాయి. అయితే చివరిసారిగా ఆ దేశంలో జరిగిన గందరగోళం ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేక పోతోంది.