మరోసారి అంతరిక్షంలోకి వెళ్లనున్న సునీత విలియమ్స్

ముచ్చటగా మూడోసారి అంతరిక్షయానం చేయడానికి సిద్ధమవుతున్న భారతసంతతి మహిళ సునీత విలియమ్స్. ఎప్పుడంటే..

Update: 2024-05-05 10:16 GMT

ఒక్కసారి అంతరిక్షయానం చేయడానికే ఎంతో మంది అహోరాత్రులు శ్రమిస్తారు. కానీ ఆ అవకాశం అతి తక్కువ మందికే లభిస్తుంది. అలా భారత్ దేశం నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత సంతతి మహిళగా కల్పనా చావ్లా నిలిచారు. అదే విధంగా అంతరిక్షంలో రెండుసార్లు అడుగు పెట్టి మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్న తొలి మహిళగా ఇప్పుడు సునీత విలియమ్స్ నిలుస్తున్నారు. అంతరిక్షయానం చేసిన రెండో భారత సంతతి మహిళ.. సునీతా విలియమ్స్. అయితే ఈమె తాజాగా మరో రికార్డ్ సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.

అదేంటంటే.. ఒక్కసారి కాదు ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లడానికి ఆమె రెడీ అంటున్నారు. మే 6న సోమవారం అంటే రేపు రాత్రి 10:34 గంటలకు ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి తన మూడో అంతరిక్ష ప్రయాణం ప్రారంభించనున్నారు. అమెరికా చేపడుతున్న స్పేస్ లాంచ్ కాంప్లెక్స్-41 ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్ సంస్థకు చెందిన ‘స్లార్‌లైనర్’ వ్యోమనౌకలో ఆమె ప్రయాణం సాగనుంది. ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో వారం రోజులు గడపనున్నారు. ఈ ప్రయాణంలో ఆమెతో పాటు వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా పాల్గొననున్నారు.

తొలి మానవ సహిత మిషన్ ఇదే

స్టార్‌లైనర్ వ్యోమనౌకలో నిర్వహిస్తున్న తొలి మానవ సహిత మిషన్ ఇదే కావడం గమనార్హం. ఈ వ్యోమనౌక సామర్థ్యాలను క్షణ్ణంగా పరిశీలించి అన్నీ బేరీజు వేసుకున్న తర్వాతనే ఈ ప్రయోగానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఒక్కసారి అంతరిక్షయానం చేసే అవకాశమే దొరకని వారు ఎందరో ఉండగా సునీత.. ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లనుండటం హాట్‌టాపిక్‌గా నిలిచింది. అందులోనూ ఆమె భారతసంతతి మహిళ కావడం విశేషం. అందుకే ఈ విషయం అమెరికా కన్నా భారత్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. చర్చలు కూడా భారీగా జరుగుతున్నాయి.

 

అసలెవరీ సునీత విలియమ్స్

సునీత విలియమ్స్.. సెప్టెంబర్ 19న 1965లో అమెరికాలోని ఓహియోలో జన్మించారు. ఆమె ఇది వరకు ఐసీసీకి చేసిన రెండు ప్రయాణాల్లో కూడా రికార్డ్‌లు సృష్టించారు. 1983లో సునీత.. యూఎస్ నావల్ అకాడమీలో చేరారు. 1987లో నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్‌కు ఏవియేటర్ ట్రైనింగ్‌కు వెళ్లారు. 1989లో ఆమె కాంబ్యాట్ హెలికాప్టర్ ట్రైనింగ్‌ను షురూ చేశారు. 1993లో నావల్ టెస్ట్ పైలట్ అయ్యారు. ఆతర్వాత టెస్ట్ పైలట్ ఇంస్ట్రక్టర్‌గా పదోన్నతి పొందారు. ఆమె అప్పటికి 2,770 ఫ్లైట్ అవర్స్‌తో 30 రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడిపారు. తొలిసారి వ్యోమగామి ప్రోగ్రామ్‌కు ఎంపికైనప్పుడు సునీత.. యూఎస్ఎస్ సైపన్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సునీత విలియమ్స్.. 1995లో మెల్‌బోర్న్‌లోని ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్‌లో ఎంఎస్ పూర్తిచేశారు. 1998లో వ్యోమగామి శిక్షణకు వెళ్లారు. అందులో భాగంగానే ఐఎస్ఎస్‌లోని సాంకేతికతలు, రోబోటిక్స్ నేర్చుకోవడానికి సునీత.. మాస్కోకు వెళ్లారు. ఆ సమయంలోనే ఆమె ఐఎస్ఎస్‌కు పనిచేస్తున్న రష్యా టీమ్‌(రష్యన్ ఫెడెరల్ స్పేస్ ఏజెన్సీ)తో కలిసి పనిచేశారు. 2006 డిసెంబర్ 9న ఆమె తొలిసారి ఎస్‌టీఎస్-116 మిషన్‌లో భాగంగా స్పేస్ షటిల్ డిస్కవరీ వ్యోమనౌకలో ఐఎస్ఎస్‌కు పయనించారు. ఆ సమయంలో ఆమె నాలుగు సార్లు స్పేస్ వాక్ చేశారు. దాంతో స్పేస్ క్రాఫ్ట్ బయట 29 గంటలు గడిపారు. మొత్తంగా ఐఎస్ఎస్ స్టేషన్‌లో 195 రోజులు గడిపారు. ఈ రెండూ కూడా ఆమె సాధించిన రికార్డ్‌లే. అప్పటి వరకు ఏ మహిళా వ్యోమగామి కూడా ఈ ఫీట్‌లు చేయలేదు. ఈ రికార్డ్‌ 2015 వరకు సునీత పేరిటే ఉంది. 2015లో ఇటలీకి చెందిన సమంత క్రిస్టోఫరెట్టి.. అంతరిక్షంలో 199 రోజులు గడిపి సునీత చేసిన రికార్డుల్లో ఒకదానిని అధిగమించారు.

 

2012 జూలై 15న సునీత రెండోసారి ఐఎస్ఎస్‌కు పయనించారు. ఈ సమయంలో ఆమె సోయుజ్ టీఎంఏ-05ఎం క్రూలో ఉన్నారు. ఎక్స్‌పెడిషన్-32లో ఆమె ఫ్లైట్ ఇంజనీర్‌గా ఉన్నారు. ఎక్స్‌పెడిషన్-33కి ఆమె కమాండర్‌గా ఛార్జ్ తీసుకున్నారు. ఈ మిషన్ సమయంలో సునీత.. మూడుసార్లు స్పేస్ వాక్ చేసి స్పేష్‌క్రాఫ్ట్ బయట 21 గంటలు గడిపారు. తద్వారా తన రికార్డ్‌ను తానే తిరగరాశారు. తన రెండు స్పేష్ మిషన్స్‌తో స్పేస్ క్రాఫ్ట్ బయట గడిపిన సమయం 50 గంటలకు చేరింది. దాదాపు 127 రోజులు స్పేస్‌లో గడిపిన తర్వాత 2012 నవంబర్ 11న ఆమె తిరిగి భూమిపైకి చేరారు. దీంతో స్పేస్‌లో సునీత గడిపిన మొత్తం రోజుల సంఖ్య 321కి చేరింది. దీంతో అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన మహిళా వ్యోమగామిగా సునీత రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో 666 రోజులు స్పేస్‌లో గడిపి అమెరికా మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ నిలిచారు.

అయితే ఐఎస్ఎస్‌కు వ్యోమగాములను, ఇతర వస్తువులను తీసుకెళ్లే నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌కు సునీత.. 2015లో ఎంపికయ్యారు. ఈ ప్రోగ్రామ్‌ను స్పేస్-ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్, బోయింగ్‌కు చెందిన సీఎస్‌టీ-100 స్టార్‌లైనర్‌ చేయనున్నాయి. ఆ తర్వాత బోయింగ్ చేస్తున్న తొలి మానవ సహిత స్టార్‌లైనర్‌ మిషన్‌కు 2022లో సునీత విలియమ్స్‌ను ఎంపిక చేశారు. ఈ మిషన్ రేపు లాంచ్ కానుంది.

Tags:    

Similar News