సునీతా విలియమ్స్.. మన భారతీయ వనితే..
ఆమె వ్యక్తిగత జీవితం చాలా సాదాసీదా. అంతపేరున్నా ఆమె జీతం మాత్రం అంతంతే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఎంత వస్తుందో అంతకు మించి రాదు.;
By : Amaraiah Akula
Update: 2025-03-18 09:47 GMT
బహుశా మరికొన్ని గంటల్లో ఆమె భూమ్మీద దిగుతారు. 9 నెలల 13 రోజుల తర్వాత ఆమె జనారణ్యంలోకి వస్తున్నారు. రేపట్నుంచి ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడని పత్రికలు, ఛానళ్ళు, సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇంతటి క్రేజ్ ఉన్న ఆ మహిళే సునీతా విలియమ్స్. ఇంతకీ ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు మార్మోగుతున్నట్టు? ఆమేమీ సినీమా నటి కాదు, మరో సెలబ్రిటీ కుమార్తె కూడా కాదు, మరెమిటీ ఈమె ప్రత్యేకత? ఆమె ఎక్కడ పుట్టారు, ఏమి చేశారు, ఆమె ప్రత్యేకత ఏమిటో చూద్దాం.
ఆమె తండ్రి భారతీయుడే...
ఆమె పేరు సునీత. భారతీయ మూలాలున్న వ్యక్తి. 1965 సెప్టెంబర్ 19న పుట్టారు. వచ్చే సెప్టెంబర్ నాటికి ఆమెకి 60 ఏళ్లు నిండుతాయి. సునీతా విలియమ్స్ ప్రముఖ అమెరికన్ వ్యోమగామి. యునైటెడ్ స్టేట్స్ నేవీ అధికారి. ఒహియో రాష్ట్రంలోని యూక్లిడ్‌లో జన్మించారు. తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా. ఇండియన్ అమెరికన్ న్యూరో అనాటమిస్ట్. తల్లి బోనీ. స్లోవేనియా సంతతికి చెందినవారు. సునీతా తండ్రి దీపక్ పాండ్యా కుటుంబం గుజరాత్ రాష్ట్రానికి చెందింది.
సునీతా విలియమ్స్ 1987లో యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. తర్వాత 1995లో ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె 1987లో యునైటెడ్ స్టేట్స్ నేవీలో చేరి, నావల్ ఏవియేటర్‌గా సేవలు అందించారు. 1998లో నాసా వ్యోమగామి ప్రోగ్రామ్ కోసం ఎంపికయ్యారు.
వివాహం విలియమ్స్ తో...
సునీత మైఖేల్ జే. విలియమ్స్‌ను వివాహం చేసుకున్నారు. మైఖేల్ ఫెడరల్ పోలీస్ అధికారి. సునీతా విలియమ్స్‌కు పరుగుపందెం, ఈత, సైక్లింగ్ వంటి క్రీడల్లో ఆసక్తి ఉంది. ఆమె బోస్టన్ రెడ్ సాక్స్ బేస్‌బాల్ జట్టుకు వీరాభిమాని. పెంపుడు జంతువులంటే మహా ఇష్టం. ఆమెకు గోర్బి అనే కుక్క ఉంది. ఆమె ఎక్కడికి వెళ్లినా ఈ డాగ్ వెంట ఉంటుంది.
2007లో సునీతా విలియమ్స్ భారత్ లో పర్యటించారు. ఈ పర్యటనలో సబర్మతి ఆశ్రమం, గుజరాత్‌లోని తన పూర్వీకుల గ్రామం ఝులాసన్‌ను సందర్శించారు. ఆమెకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వ ప్రతిభ అవార్డు, పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు.
సునీతా విలియమ్స్ తన వ్యోమగామి కెరీర్‌లో అనేక రికార్డులు సృష్టించారు. ఆమె మహిళా వ్యోమగాముల్లో అత్యధిక స్పేస్‌వాక్‌లు చేసిన వ్యక్తిగా నిలిచారు. ఆమె స్పేస్‌వాక్‌లలో గడిపిన సమయం 50 గంటల 40 నిమిషాలు. ఆమె మొత్తం 321 రోజులు 17 గంటలు 15 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు.
మార్చి 18 వరకు సునీతా విలియమ్స్, మరో నాసా వ్యోమగామి బారీ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. వీరు 2024 జూన్ 5న 10 రోజుల మిషన్‌లో భాగంగా అంతరిక్ష యాత్రను ప్రారంభించారు. కానీ, స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీరి తిరుగు ప్రయాణం వాయిదా పడింది. ప్రస్తుతం, వీరు 2025 మార్చి 19న భూమికి చేరుకోనున్నారు.
సునీతా విలియమ్స్, ఆమె భర్త మైఖేల్ జే. విలియమ్స్‌కు సంతానం లేరు. అయితే 2012లో ఆమె గుజరాత్‌లోని ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలనుకున్నారు. కారణాలు తెలియవు గాని ఇప్పటివరకు దత్తత తీసుకోలేదు.
మైఖేల్ జె. విలియమ్స్ హిందూ మత విశ్వాసాలను నమ్ముతారు. వాటిని ఆచరిస్తుంటారట. సునీత జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన హిందూ మతమంటే తనకూ నమ్మకం లేకపోలేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విలియమ్స్ తనకు పూర్తిగా సహకరిస్తారని, తన కెరియర్ కు మార్గదర్శకత్వం వహించిన వ్యక్తుల్లో విలియమ్స్ ప్రధముడని సునీత చెప్పారు.
2006 సంవత్సరంలో, సునీత తనతో పాటు భగవద్గీత ప్రతిని ISSకి తీసుకువెళ్లింది. 2012లో, తన అంతరిక్ష యాత్రకు వెళుతూ శివుడు, వినాయక విగ్రహాలను తీసుకెళ్లింది.
సునీతాకు మేనకోడళ్లు, మేనమామలు ఉన్నారు. ఆ కుటుంబాలతో చాలా ఉత్సాహంగా, ఆనందంగా గడుపుతుంటారు. భావి తరం పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. పిల్లల పెంపకంపై ఎంతో శ్రద్ధ చూపుతారని సునీత బంధువులు చెబుతుంటారు. తన పెంపుడు కుక్కలను కూడా కుటుంబ సభ్యులుగానే సునీత విలియమ్స్ భావిస్తుంటారు.
సునీతా విలియమ్స్ ఆస్తుల గురించి స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు. అయితే, నాసా వ్యోమగామిగా ఆమెకు ఏడాదికి సుమారు $110,000 (సుమారు రూ. 90 లక్షలు) జీతం వస్తుంది.
భూమికి తిరిగి వచ్చిన తర్వాత, సునీతా విలియమ్స్ అమెరికా టెక్సాస్ లోని హ్యూస్టన్ లో నివసిస్తారు. ఎందుకంటే నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ అక్కడే ఉంది. అనుమతి లేకుండా ఆమెను కలవడం సాధ్యం కాదు. పబ్లిక్ ప్రోగ్రామ్స్ లేదా సదస్సుల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది.