చంద్రుడిపైకి రెండో ల్యాండర్ పంపిన చైనా.. ఎందుకో తెలుసా ?
మన పొరుగు దేశం చైనా మరోసారి చంద్రుడిపైకి ల్యాండర్ ను పంపింది. ఇంతకుముందు 2020లో చాంగ్ 5 అనే ల్యాండర్ ను పంపి..
అంతరిక్ష ప్రయోగంలో బీజింగ్ మరో ముందడుగు వేసింది. చంద్రుడి ఉపరితలం పైకి మరో ల్యాండర్ ను ప్రయోగించగా అది సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ప్రకటించింది. చంద్రుడిపై తక్కువ పరిశోధనలు జరిగిన దక్షిణ ప్రాంతం నుంచి పరిశోధన కోసం మట్టి, రాళ్లను సేకరిస్తున్నట్లు వెల్లడించింది.
ల్యాండింగ్ మాడ్యూల్ బీజింగ్ కాలమానం ప్రకారం ఉదయం 6:23 నిమిషాలకు సౌత్ పోల్-ఐట్‌కెన్ బేసిన్ అని పిలువబడే భారీ క్రేటర్‌ను తాకినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. దీనికి చైనా చంద్ర దేవత పేరు ‘ చాంగ్ ’ పేరును పెట్టారు. చంద్రుడి పరిశోధనలో భాగంగా చైనా ప్రయోగించిన ఆరో కార్యక్రమం ఇది.
ఇంతకుముందు చైనా 2020లో చాంగ్ 5 మాడ్యూల్ ద్వారా చంద్రుడి ఉపరితలం లోని మట్టి, రాళ్ల నమూనాలను సేకరించింది. అంతరిక్ష పరిశోధనలో అమెరికాతో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చైనా కూడా తన ప్రయోగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. మరో వైపు భారత్, జపాన్ సైతం అంతరిక్ష పరిశోధనలలో దూసుకుపోతుండటంపై చైనా అక్కసుగా ఉంది. ఇప్పటికే సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించిన బీజింగ్.. అక్కడికి క్రమం తప్పకుండా వ్యోమగాములను పంపుతోంది.