సునీతా విలియమ్స్‌కు మోదీ లేఖ
భారత్‌లో పర్యటనకు ఆహ్వానం;
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) లేఖ రాశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో తొమ్మిది నెలల పాటు గడిపిన ఆమె..ఈ నెల 19 (బుధవారం) భూమికి తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఆమెను భారత పర్యటనకు ఆహ్వానించారు. మోదీ రాసిన ఈ లేఖను కేంద్ర విజ్ఞాన, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ లేఖను ‘ఎక్స్’ లో షేర్ చేశారు.
మీకు ఆతిథ్యం.. మాకు గర్వకారణం..
"మీరు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. మా హృదయాలకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారు. మీ మిషన్ విజయవంతంగా పూర్తవ్వాలని యావత్ భారతవని కోరుకుంటోంది. అలాగే మీ రాక కోసం భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తన కుమార్తెకు ఆతిథ్యం ఇవ్వడం పట్ల భారత్ సంతోషం. గర్వకారణం కూడా,’’ అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.
2016లో సునీతా విలియమ్స్(Sunita Williams)తో మోదీ భేటీ..
అమెరికా పర్యటన సందర్భంగా 2016లో సునీతా విలియమ్స్, ఆమె తండ్రి దీపక్ పండ్యాతో కలిసిన జ్ఞాపకాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మైక్ మస్సిమినోను కలిసినపుడు సునీతా విలియమ్స్ పేరు ప్రస్తావనకు వచ్చిందని మోదీ తెలిపారు.
286 రోజుల అనంతరం..
వ్యోమగాములు(Astronauts) సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు (భారత కాలమానం ప్రకారం) భూమి మీదకు చేరుకుంటారని అమెరికా అంతరిక్ష సంస్థ (NASA) ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. వారం రోజులకే తిరిగి భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు.
సునీత తండ్రి భారతీయుడే...
అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా. ఇండియన్ అమెరికన్ న్యూరో అనాటమిస్ట్. తల్లి బోనీ. స్లోవేనియా సంతతికి చెందినవారు. సునీతా తండ్రి దీపక్ పాండ్యా కుటుంబం గుజరాత్ రాష్ట్రానికి చెందింది.
సునీతా విలియమ్స్ 1987లో యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. తర్వాత 1995లో ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె 1987లో యునైటెడ్ స్టేట్స్ నేవీలో చేరి, నావల్ ఏవియేటర్‌గా సేవలు అందించారు. 1998లో నాసా వ్యోమగామి ప్రోగ్రామ్ కోసం ఎంపికయ్యారు. సునీత మైఖేల్ జే. విలియమ్స్‌ను పెళ్లాడారు. మైఖేల్ ఫెడరల్ పోలీస్ అధికారి. 2007లో సునీతా విలియమ్స్ భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో సబర్మతి ఆశ్రమం, గుజరాత్‌లోని తన పూర్వీకుల గ్రామం ఝులాసన్‌ను సందర్శించారు.