రెండో దశలోనూ పుంజుకోని పోలింగ్.. మందకొడిగా ఓటింగ్
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతోంది. కానీ ఈ విడతలో కూడా ఓటింగ్ శాతం అంతంత మాత్రంగానే ఉంది.
(ది ఫెడరల్ ప్రతినిధి)
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలోని14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8 స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్‌లో 7, అస్సాం, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లలో 3, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. 88 నియోజకవర్గాల నుంచి 1,202 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశలో ఓటింగ్ శాతం తగ్గడంతో రెండో దశలోనైనా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.
మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ వివరాలు.. మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ రాష్ట్రాలలో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. మణిపూరు, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలలో 30 శాతం పోలింగ్ దాటగా మిగతా రాష్ట్రాలలో రెండంకెల ఓటింగ్ శాతం దాటింది. కేరళలో 25.61 శాతం, మధ్యప్రదేశ్ 28.15, మహారాష్ట్ర 18.83, మణిపూర్ 33.22, రాజస్థాన్ 26.84, త్రిపుర 36.42, అస్సాం 27.35, బీహార్ 21.68, ఛత్తీస్ ఘడ్ 35.47, జమ్మూ కాశ్మీర్ 26.45 శాతం పోలింగ్ అయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
పోటీలో ఉన్న ప్రముఖులు వీరే…
రెండో దశ పోలింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నుంచి సీనియర్ నేతలు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ, శశి థరూర్, అరుణ్ గోవిల్‌లు వంటి అనేక మంది కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ హ్యాట్రిక్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆయన సీపీఐకి చెందిన అన్నీ రాజా, బీజేపీకి చెందిన కే సురేంద్రన్‌తో పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికలలో రాహుల్ సీపీఐకి చెందిన సునీర్‌పై 7 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తిరువనంతపురం సీటును నాలుగోసారి నిలబెట్టుకోవాలని కష్టపడుతున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, సీపీఐ నుంచి పన్నయన్ రవీంద్రన్ అదే సీటు నుంచి పోటీలో ఉన్నారు.
మధుర నుంచి హేమమాలిని
2014 నుంచి మథుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమమాలిని మళ్లీ బీజేపీ అభ్యర్థిగా.. కాంగ్రెస్ నేత ముఖేష్ ధన్‌గర్‌పై పోటీ చేస్తున్నారు. కోటా నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా కాంగ్రెస్ అభ్యర్థి ప్రహ్లాద్ గుంజాల్‌తో తలపడుతున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జోధ్‌పూర్ స్థానం నుంచి మూడోసారి విజయం సాధించాలని చూస్తున్నారు. బెంగళూరు సౌత్ సిట్టింగ్ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డితో తలపడనున్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ గత 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న రాజ్‌నంద్‌గావ్ నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత వీరేంద్ర కుమార్ ఖాటిక్ తికమ్‌గఢ్‌లో బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పంకజ్ అహిర్వార్‌ను రంగంలోకి దిగారు. 2019లో ఖాటిక్ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ అహిర్వార్‌పై 3.48 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2014 తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తిరిగి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడంతో కేరళలోని అలప్పుజ సీటులో పోటీ కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మక మారింది. 2019 ఎన్నికల్లో కేరళలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19-1 తేడాతో ఘన విజయం సాధించింది. వేణుగోపాల్ 1996, 2001, 2006లో వరుసగా మూడుసార్లు అలప్పుజ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. 2009, 2014లో అలప్పుజా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో పార్టీ ఆయనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో ఎన్నికల్లో పోటీ చేయలేదు. త్రిస్సూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన కె మురళీధరన్, సీపీఎంకు చెందిన వీఎస్ సునీల్ కుమార్‌లపై నటుడు, రాజకీయవేత్త సురేష్ గోపి పోటీలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బలూర్‌ఘాట్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న సుకాంత మజుందార్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇలా వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలో రెండో విడత పోరులో తలపడనున్నారు.
తొలిగంటల్లో ఓటేసిన ప్రముఖులు వీరే..
అలప్పుళ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఓటేశారు. మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే బెంగళూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ బెంగళూరులోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ లైన్‌లో నిల్చొని ఓటేశారు. మీరు నమ్మిన వ్యక్తిని ఎంచుకోవడం ముఖ్యమని, అందుకోసం ప్రతి ఒక్కరు పోలింగ్‌లో పాల్గొనాలని ఓటేసిన అనంతరం ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. బీజేపీ బెంగళూరు సౌత్ అభ్యర్థి తేజస్వీ సూర్య, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి, కేంద్రమంత్రి, బెంగళూరు నార్త్ అభ్యర్థి శోభా కరంద్లాజె, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్ష వర్ధన్ శింగ్లా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కుటుంబం, పశ్చిమ్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, కేంద్రమంత్రి, జోధ్‌పుర్ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్, భాజపా తిస్సూర్, పథనంథిట్ట అభ్యర్థులు సురేశ్ గోపి, అనిల్ ఆంటోనీ ఓటు వేశారు. ‘చిరుత’ బ్యూటీ నేహా శర్మ బిహార్‌లో, మలయాళీ నటుడు టొవినో థామస్ కేరళలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.