ముంబై దాడుల ఉగ్రవాది ‘రాణా’ వాయిస్ శాంపిల్ ను సేకరించనున్న ఎన్ఐఏ
నిరాకరిస్తే చార్జిషీట్ లో పొందుపరిచే అవకాశం, ఉద్యోగి ‘బీ’ ఎవరనే వివరాలు సేకరించే ప్రయత్నం;
By : Praveen Chepyala
Update: 2025-04-13 08:09 GMT
ముంబై ఉగ్రవాద దాడుల కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ రాణా వాయిస్ శాంపిల్ ను ఎన్ఐఏ సేకరించనుంది. దాడికి సంబంధించిన కాల్ రికార్డులను ధృవీకరించడానికి అతని వాయిస్ నమూనాలను తీసుకోవాలని దర్యాప్తు సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.
ఉగ్రవాద దాడి ప్రధాన కుట్రదారుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావుద్ గిలానీకి ప్రణాళిక, లాజిస్టిక్ మద్దతు అందించడానికి అతడిని ‘ఉద్యోగి బీ’ అని నామకరణం చేశారు.
తనతో రాణా తరుచూ టచ్ లో ఉన్నాడని దర్యాప్తు లో హెడ్లీ అమెరికాలో వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పుడు ఈ నేరాని ధృవీకరించడానికి వాయిస్ రికార్డులు ఉపయోగపడనున్నాయి.
పెద్ద కుట్ర
ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడిలో 166 మంది చనిపోయారు. ఇందులో ఆరుగురు అమెరికన్లు సైతం ఉన్నారు. దాడుల వెనక రాణా పాత్రను వెలికి తీయడానికి ఎన్ఐఏ ప్రస్తుతం సిద్దమవుతోంది.
దాడుల తరువాత జరిగిన దర్యాప్తు సమయంలో సేకరించిన వివిధ ఆధారాలతో ఇప్పుడూ రాణాను విచారించాలని అధికారులు భావిస్తున్నారు. ఇతని సహ కుట్రదారుడు హెడ్లీ అలియాస్ దావుద్ గిలానీ మధ్య వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ సంభాషణలు జరిగినట్లుగా తేలింది.
వాయిస్ నమూనా..
ప్రస్తుతం రాణా వాయిస్ శాంపిల్స్ సేకరించి, అతని కాల్స్ రికార్డుతో సరిపోల్చడం వలన 2008 నాటి ఉగ్రవాద దాడుల సందర్భంగా అతను సూచనలు చేస్తున్నాడా లేడా అని తెలుస్తుంది. ఒకవేళ రాణా తన వాయిస్ శాంపిల్ ను ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ విషయాన్ని కూడా చార్జీషీట్ లో పొందపరచనున్నారు.
ఇది తన వాదనను బలహీనపరిచే అవకాశం ఉంది. ఒకవేళ తను అంగీకరిస్తే ఫొరెన్సిక్ చెందిన నిపుణుల బృందం శబ్ధం లేని గదిలో వాటిని సేకరిస్తారు.
ఉద్యోగి ‘బీ’ ఎవరూ?
దర్యాప్తు సంస్థ రాణాను ఎంప్లాబియ్ ‘బీ’ తో ఎదుర్కోవాలని యోచిస్తోంది. హెడ్లీకి ఉగ్రవాద కార్యకలాపాలు గురించి తెలియదని, రాణా ఆదేశం మేరకు రిసెప్షన్, రవాణా, బస, ఆఫీస్ కమ్ రెసిడెన్స్ వంటి లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడంలో మాత్రమే సహకరించారని తెలిపింది.
రాణా తన ఇమ్మిగ్రేషన్ వ్యాపారం ద్వారా హెడ్లీకి రక్షణ కల్పించాడని, వీసా ఇప్పించడంలో తన నేరాలను కప్పిపుచ్చాడని ముఖ్యంగా తన మతమైన ముస్లిం, పాకిస్తాన్ పౌరసత్వం గురించి వివరాలను దాచిపెట్టాడని ఎన్ఐఏ ఆరోపించింది.
హెడ్లీ ని పక్క ప్రణాళికతో భారత వ్యాపారాలు, సైనిక వర్గాలతో కలిసి పోవడానికి సాయం చేశాడని ఆరోపించింది. ఇందుకోసం రాణా కరాచీ నుంచి విమానాలను బుక్ చేసుకున్నాడని, తన మొరాకో భార్య ఫైజా ఔతలా కోసం పత్రాలను సృష్టించడంలో సాయం చేశాడని కూడా జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
ఐఎస్ఐ సంబంధాలపై ఆరా..
అమెరికా నుంచి తీసుకొచ్చిన రాణాకు ఎన్ఐఏ కోర్టు 18 రోజుల పాటు కస్టడీ విధించింది. నిందితుడిని ప్రస్తుతం తీహాడ్ జైలులోని సీజీఓ కాంప్లెక్స్ లో అత్యంత భద్రత గల సెల్ లో భద్రపరిచారు. 24 గంటలు కట్టుదిట్టమైన కాపలా విధించారు.
పాకిస్తాన్ గూఢచారసంస్థ ఐఎస్ఐ, అధికారులతో కలిసి లష్కర్ ఏ తోయిబా ఈ కుట్ర పన్నాయని, వారితో రాణాకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయని కూడా అధికారులు వివరాలు సేకరించనున్నారు.
2008, నవంబర్ 26న దేశ ఆర్థిక రాజధానిలో జరిగిన మారణహోమానికి ముందు ఉత్తర, దక్షిణ భారతంలోకి కీలక ప్రాంతాలలో వీరు రెక్కి నిర్వహించారు. దీనిపై కూడా కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
రాణాకు పెన్ను, కాగిత.. ఖురాన్ అందజేత
జాతీయ మీడియా ప్రసారం చేసిన కథనాల ప్రకారం.. రాణాకు ప్రత్యేక సదుపాయాలు ఏవి కల్పించలేదు. ఇతర ఖైదీలు మాదిరే చూస్తున్నామన్నారు. అతనికి ఎలాంటి చికిత్స అందించలేదని, తన అభ్యర్థన మేరకు ఖురాన్ కాపీ అందించామన్నారు.
సెల్ లో రోజుకు ఐదుసార్లు నమాజ్ ఆచరిస్తున్నాడని తెలిపారు. వీటిపై నిరంతరం నిఘా ఉందన్నారు. తనను తాను గాయపరుచుకునే ఉద్దేశం లేదని ప్రకటించాకే.. జైలు నిబంధనల ప్రకారం వీటిని అందించామన్నారు.