ఇండియన్ నేవీకి మరో అణ్వాస్త్రం.. నౌకాదళంలోకి ఐఎన్ఎస్ అరిఘాత్
హిందూ మహాసముద్రంలో చాలాకాలంగా చైనా నౌకల కదలికలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా తప్పనిసరిగా తన శక్తిని పెంచుకోవాల్సి వచ్చింది.
By : 491
Update: 2024-08-30 07:13 GMT
భారత నేవీ అమ్ములపొదిలో మరో అణ్వస్త్రం చేరింది. అణుశక్తితో నడిచే సబ్ మెరైన్ ఐఎన్ఎస్ అరిఘాత్ గురువారం నౌకాదళంలోకి చేరింది. విశాఖ పట్నంలో జరిగిన కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ అణుజలాంతర్గమిని లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఇది బాలిస్టిక్ క్షిపణులను నీటి అడుగు నుంచి ప్రయోగించగలదు. ఇది దేశంలో తయారైన రెండో అణు జలాంతర్గమి. ఈ సబ్ మెరైన్ అరిహంత్ శ్రేణికి చెందినది. ఇంతకుముందు భారత నేవీ అమ్ముల పొదిలో ఐఎన్ఎస్ అరిహంత్ తన విధులు నిర్వహిస్తోంది. ఇది 2009 లో లాంఛనంగా ప్రారంభించబడి, 2016 లో అన్ని పరీక్షలు పూర్తి చేసి నిశ్శబ్ధంగా నౌకా దళంలోకి ప్రవేశపెట్టారు. అరిహంత్ అనగా శత్రువులను జయించేదని అర్థం. అరిఘాత్ అంటే శత్రువులను మర్ధించేదని.
ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇది దేశ అణు త్రయాన్నిమరింత బలోపేతం చేసిందని వ్యాఖ్యానించారు.( ఐఎన్ఎస్ చక్ర.. రష్యా నుంచి భారత్ లీజుకు తీసుకుంది., ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్). ఈ ప్రాంతంలో వ్యూహాత్మక సమతుల్యత, శాంతిని నెలకొల్పడంలో సహాయపడుతుందని, దేశ భద్రతలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇది దేశం సాధించిన విజయం, రక్షణలో ‘ఆత్మనిర్భరత’ సాధించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ‘అచంచలమైన సంకల్పం’కు నిదర్శనమని ఆయన అభివర్ణించారు. నౌకదళాన్ని, డీఆర్డీఏ శాస్త్రవేత్తలను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇది దేశాన్ని బలోపేతం చేయడమే కాకుండా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉందన్నారు.
దేశ పారిశ్రామిక రంగానికి, ముఖ్యంగా చిన్నతరహ పరిశ్రమలకు ఇలాంటివి అండగా నిలబడతాయన్నారు. వీటి వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు.
దేశాన్ని అణ్వాయుధ దేశంగా నిలపిన అటల్ బిహారి వాజ్ పేయ్ రాజకీయ సంకల్పాన్న ఆయన గుర్తు చేసుకున్నారు. “నేడు, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతోంది, రక్షణతో సహా ప్రతి రంగంలో వేగంగా అభివృద్ధి చెందడం మనకు చాలా అవసరం. ముఖ్యంగా నేటి భౌగోళిక రాజకీయ పరిస్థితులలో ఆర్థిక శ్రేయస్సుతో పాటు బలమైన సైన్యం అవసరం. మా సైనికులు భారత గడ్డపై తయారు చేసిన అత్యున్నత-నాణ్యత ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు కలిగి ఉండేలా మా ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పని చేస్తోంది," అన్నారాయన
ఈ జలాంతర్గామిలో దేశీయంగా చేపట్టిన సాంకేతిక అభివృద్ధి "దాని ముందున్న ఐఎన్‌ఎస్ అరిహంత్ కంటే గణనీయంగా మెరుగుపరిచాము" అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. INS అరిఘాత్ ను ప్రారంభించడం భారతదేశ నౌకాదళ పరాక్రమం, అణు నిరోధక సామర్థ్యాలను పెంపొందించే దిశగా ఒక అడుగుగా రక్షణరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారతదేశం అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి SSBN (షిప్, సబ్‌మెర్సిబుల్, బాలిస్టిక్, న్యూక్లియర్) కార్యక్రమం చాలా దగ్గర రక్షణతో కూడిన ప్రాజెక్ట్.
ఐఎన్‌ఎస్ అరిఘాత్ నిర్మాణంలో అధునాతన డిజైన్, తయారీ సాంకేతికత, వివరణాత్మక పరిశోధన, అభివృద్ధి, ప్రత్యేక పదార్థాల వినియోగం, కాంప్లెక్స్ ఇంజినీరింగ్, అత్యంత నైపుణ్యం కలిగిన పనితనం వంటివి ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
"భారత శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, నౌకాదళ సిబ్బందిచే రూపొందించబడి, ఏకీకృతం చేయబడిన స్వదేశీ వ్యవస్థలు, పరికరాలను ఇందులో ప్రత్యేకంగా అమర్చారు" అని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది. ఐఎన్‌ఎస్ అరిహంత్ 2022 అక్టోబర్‌లో బంగాళాఖాతంలో జలాంతర్గామి నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి (ఎస్‌ఎల్‌బిఎం)ని "చాలా అధిక ఖచ్చితత్వంతో" విజయవంతంగా ప్రయోగించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశ అణు నిరోధక సామర్థ్యంలో SSBN కార్యక్రమం కీలకమైన అంశం అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సాంప్రదాయ డిజీల్ ఇంజన్లతో నడిచే జలాంతర్గముల్లో బ్యాటరీల చార్జింగ్ కోసం నీటిపైకి రావాల్సి ఉంటుంది. ఆ సమయంలో వీటి ఉనికి శత్రుదేశాలు గుర్తించే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా వీటి ఇంజన్ల నుంచి శబ్దం వచ్చిన ఆధునిక సోనార్ వ్యవస్థలు గుర్తించి సబ్ మెరైన్ జాడను పసిగట్టేలా చేస్తాయి. అందువల్ల అణు శక్తితో నడిచే సబ్ మెరైన్ ల కోసం భారత్ చాలాకాలంగా పరిశోధన చేస్తోంది. ప్రస్తుతం వీటిలో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కేవలం యూఎస్ఏ, బ్రిటన్ దగ్గర మాత్రమే ఉంది. ప్రస్తుతం దీనిని ఆస్ట్రేలియాకు బదిలీ చేస్తున్నారు.
మన శత్రుదేశం పాకిస్తాన్ కు సాంప్రదాయ డిజీల్ ఇంజన్లతో నడిచే సబ్ మెరైన్ లు ఉన్నాయి. ఇవి నీటి అడుగు నుంచి క్షిపణులను ప్రయోగించలేవు. కానీ చైనా, పాకిస్తాన్ కు ఇలాంటి సాంకేతికతను అందించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన పరిశోధనలను వేగవంతం చేస్తోంది. వీటిలో భాగంగా 60 వేల కోట్లతో కొత్త సబ్ మెరైన్ నిర్మాణానికి పూనుకుంది.