నాసా ఆస్ట్రోనాట్స్ రిటర్న్ జర్నీ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..
వ్యోమగాముల తిరుగు ప్రయాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసిన NASA;

వ్యోమగాములు (Astronauts) సునీతా విలియమ్స్(Sunita Williams) బుట్చ్ విల్మోర్ (Butch Wilmore) 9 నెలల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)నుంచి భూమికి తిరిగి వస్తున్నారు. వీరితో పాటు అమెరికా నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యా రోస్కోస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ రానున్నారు. ఈ నలుగురు భారత కాలమానం ప్రకారం మంగళవారం (2025 మార్చి 18) ఉదయం 8.30 గంటలకు ISS నుంచి స్పేస్ఎక్స్ క్యాప్సూల్ ద్వారా భూమి మీదకు ప్రయాణాన్ని ప్రారంభించారు. 17 గంటల పాటు ప్రయాణించి ఫ్లోరిడా తీరంలో బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు నీటిలో (స్ప్లాష్‌డౌన్) ల్యాండ్ అవుతారు. ఈ క్రమంలో డీఆర్బిట్ బర్న్ (deorbit burn), ఎంట్రీ, ల్యాండింగ్ విశేషాలను NASA+ లో ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాటు చేసింది నాసా. NASA (National Aeronautics and Space Administration) అధికారిక యూట్యూబ్ ఛానెల్, అధికారిక వెబ్‌సైట్‌లోనూ చూడవచ్చు.
రిటర్న్ జర్నీ షెడ్యూల్ (Eastern Standard Time ప్రకారం)..
4.45 PM – NASA+ లో తిరుగు ప్రయాణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం
5.11 PM – డీఆర్బిట్ బర్న్
5.57 PM – స్ప్లాష్‌డౌన్
7.30 PM – NASA+ లో "రిటర్న్ టు ఎర్త్" మీడియా సమావేశం
వ్యోమగాములకు వైద్య పరీక్షలు..
వ్యోమగాములు ల్యాండయ్యాక NASA జాన్సన్ అంతరిక్ష కేంద్రానికి (హ్యూస్టన్, టెక్సాస్) తీసుకెళ్తారు. అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ ప్రభావానికి గురికావడం వల్ల వీరి ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు కొన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
మైక్రోగ్రావిటీ ఎఫెక్ట్..
అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండకపోవడం వల్ల శరీరంలో ద్రవాలు తలకు చేరుతాయి. అందువల్ల వ్యోమగాముల ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. భూమి మీదకు వచ్చిన తర్వాత ఈ ద్రవాలు మళ్లీ యథాస్థితికి చేరతాయి. ఈ ప్రక్రియలో తల తిరగడం, సమతుల్యత కోల్పోవడం వంటి సమస్యలు వారికి కనిపించవచ్చు. Spaceflight Associated Neuro-ocular Syndrome (SANS) వల్ల దూరం, దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేకపోవచ్చు. అంతరిక్షంలో చాలా రోజులు గడపడం వల్ల తల కదిపినప్పుడు మల్టీ డైరెక్షనల్ మోషన్ సిక్‌నెస్ (motion sickness) బారిన పడే అవకాశం కూడా ఉంది. కాస్త బలహీన్న ఎముకలు బలంగా తయారుకావడానికి వ్యోమగాములు హై-క్యాల్షియం, విటమిన్-డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. భూమికి తిరిగి వచ్చిన వెంటనే వ్యోమగాములు శబ్దాలు, వాసనకు అలవాటు పడాల్సి ఉంటుంది. అంతరిక్షంలో నిశ్శబ్దం, నిర్జీవ వాతావరణానికి అలవాటుపడ్డ వారికి వాతావరణ మార్పు కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు.
ISSలో 286 రోజులు..
సునీతా విలియమ్స్, బుట్చ్ విల్మోర్ గతేడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వాస్తవానికి 8 రోజులలోపు వారు తిరిగి రావాల్సి ఉంది. అయితే వీరు ప్రయాణించిన బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల అక్కడే 286 రోజులు గడపాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చుట్టూ 4500కి సార్లు పరిభ్రమణం చేశారు. అంటే 121 మిలియన్ మైళ్ళు ప్రయాణించారు అని NASA పేర్కొంది. ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ-9 అంతరిక్ష నౌకలో భూమి పైకి తిరిగి రానున్నారు.