MONALISA BHOSLE | కేంద్ర బడ్జెట్ కంటే మోనాలిసాయే హాట్ టాపిక్!
పూసలమ్మిన మోనాలిసా.. ఈ పేరిప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్. కేంద్ర బడ్జెట్ కన్నా ఈమె వీడియోలు, ఆమె గురించి సమాచారమే నెటిజన్లకిప్పుడు మహా మక్కువైంది.;
By : The Federal
Update: 2025-02-01 10:04 GMT
మోనాలిసా.. ఈ పేరిప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్. కేంద్ర బడ్జెట్ కన్నా ఈమె వీడియోలు, ఆమె గురించి సమాచారమే నెటిజన్లకిప్పుడు మహా మక్కువైంది. వారం పదిరోజులుగా దేశ ప్రజల నోళ్లలో నానుతున్న ఈమె ఇప్పుడు ఏ హడావిడీ లేకుండా బాలివుడ్ స్టార్ కాబోతోంది.
ఈ పదహారేళ్ల సహజ సుందరికి నెటిజన్లు పెట్టిన పేరు మోనాసిసా భోస్లే. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ సమీప మహేశ్వర్ ఆమె ఊరు. ఓ నిరుపేద కుటుంబం. రేకుల షెడ్డు లాంటి ఇల్లు ఆమె నివాసం. పొట్టకూటి కోసం పూసలమ్మడం ఆమె వృత్తి.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పూసలు అమ్మడానికి వెళ్లి ఓ వీడియో గ్రాఫర్ కంట పడింది. అతను ఆమె ఫోటో తీసి నెట్ లో పెట్టడంతో అది సూపర్ డూపర్ స్థాయిలో వైరల్ అయింది. ముదురు గోధుమరంగులో ఉన్న ఆమె కళ్లు, మైమరిపించే నవ్వు చూసి నెటిజన్లు ఆమెకు ‘మోనాలిసా’ అని పేరు పెట్టారు. ఒకదశలో ఆమె చుట్టూ చేరుతున్న జనం, కెమెరాల తాకిడి పెరగడంతో మేళా నుంచి స్వగ్రామానికి వెనక్కు రావాల్సి వచ్చింది. ఈ పాపులారిటీతో బాలీవుడ్ అవకాశం ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది.
16 ఏళ్ల అంబర్ కళ్ల యువతి మొనాలిసా భోస్లే ఇంటిని వెతుక్కుంటూ దర్శకుడు సనోజ్ మిశ్రా మహేశ్వర్ గ్రామం వెళ్లాడు. సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఆయన త్వరలో తెరకెక్కించనున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంతో నటించమని కోరారు. ఆ విషయాన్నే ఆయన ఆమె తల్లిదండ్రులతో చెప్పారు. వాళ్లు తెల్లమొహం వేసినా దర్శకుడు సనోజ్ మిశ్రా వాళ్లను ఒప్పించారు. దీంతో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ప్రఖ్యాత నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. అటువంటి నటుడితో పాటు అసలేమాత్రం నటన తెలియని ఈ సుందరి నటించనుంది.
అంబర్ కళ్లతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే మొనాలిసా భోస్లే పేరు.. ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ చిత్రించిన 16వ శతాబ్దపు ప్రముఖ పెయింటింగ్ ‘మొనాలిసా’ను గుర్తుచేస్తుంది.
‘ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సనోజ్ మిశ్రా 16 ఏళ్ల ఈ అమ్మాయిని తన రాబోయే చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’లో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు.
సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను అధికారికంగా ప్రకటించిన మిశ్రా స్వయంగా ఆమె ఊరు వెళ్లారు. ‘‘ఎప్పటి నుంచో ఆమె లాంటి వ్యక్తి కోసం వెతుకుతున్నాను. ఇప్పటికి నాకు సరైన మనిషి కనిపించారు. నా చిత్రానికి ఆమె సరైన ఎంపిక అవుతుంది. ఇది ఆమె జీవితాన్ని మార్చివేయగల అవకాశం,’’ అన్నారు సరోజ్.
మొనాలిసాకు అవకాశమిచ్చినందుకు సరోజ్ ను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. ఒక నెటిజన్ ఏమని వ్యాఖ్యానించారంటే ‘‘ఈ అవకాశం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఆమె నిజంగా కష్టపడితే గొప్ప భవిష్యత్తును సాధించగలదు. మంచి పని. సరోజ్ సర్ కి, ఆమెకు, ఆమె కుటుంబానికి అభినందనలు,’’ అని కామెంట్ చేశారు. మోనాలిసా ఊరు వెళ్లి వచ్చిన తర్వాత సరోజ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, ‘‘మొనాలిసా గ్రామం మహేశ్వర్‌కు వెళ్లి వచ్చా. ఆమెను, ఆమె కుటుంబాన్ని కలిశాను. వాళ్లు చాలాసాదాసీదా మనుషులు. మంచి మర్యాద వినయశీలురు. నేను ఆమె భవిష్యత్తుకు పూచీ పడుతున్నా. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో మొనాలిసా నటించనుంది.’’ అని చెప్పారు.
ఈ అవకాశంపై మొనాలిసా కూడా మాట్లాడారు. ‘‘సనోజ్ మిశ్రా సర్ ప్రయాగ్‌రాజ్ వచ్చి నన్ను కలిశారు, ఈ పాత్రను ఆఫర్ చేశారు. నా కుటుంబం, నేను చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సినిమాకు నేను చాలా కష్టపడతాను,’’ అని చెప్పింది.
సినిమా షూటింగ్ కి ముందు మొనాలిసాకు ముంబైలో 3 నెలల శిక్షణ ఇవ్వనున్నారు. ‘‘అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఆమె ఓ సైనిక అధికారి కుమార్తె పాత్రను పోషించనుంది. ఆ అధికారి పాత్రలో అనుపమ్ ఖేర్ కనిపించనున్నారు’’ అని దర్శకుడు తెలిపారు.
మొనాలిసా భోస్లే ఎవరంటే...
మొనాలిసా భోస్లే పేరు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయంది. దీనికి ఓ కంటెంట్ క్రియేటర్ కారణం. ఆమెను వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళాలో పూసలు, ఇతరత్రా గిల్ట్ నగలతో తయారుచేసిన హారాలను అమ్ముతున్నప్పుడు ఆమెను వీడియో తీసి చూపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో, ఆమెను చూడాలని భక్తులు, సందర్శకులు తండోపతండాలుగా ఎగబడ్డారు. ఈ తాకిడిని తట్టుకోలేక ఓ దశలో ఆమె తల్లిదండ్రులు ఏమి ప్రమాదం ముంచుకొస్తుందోనని మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని తమ స్వగ్రామానికి పంపించారు. ఆమెను పెళ్లి చేసుకుంటామంటూ బోలెడంత మంది ముందుకు వచ్చారు. మోడలింగ్ అవకాశాలు ఇస్తామని, మహేశ్వరి శారీస్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమంటూ ఆఫర్లు వచ్చినా ఆమె కుటుంబం వాటిని తిరస్కరించింది. అయితే, సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్న సినిమాలో నటించేందుకు మాత్రం వారు అంగీకరించారు.