మోదీజీ.. మా విషయంలో మీరు చూపిన శ్రద్ధ అమోఘం: ఖతార్ నుంచి విడుదలైన..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన పనికి జీవితాంతం తాము రుణపడి ఉంటామని ఖతార్ లో ఉరిశిక్ష పడి, విడుదలైన భారత మాజీ నేవీ అధికారి అన్నారు.

Update: 2024-04-24 12:33 GMT

ఖతార్ లో ఉరిశిక్ష పడి, తరువాత భారత ప్రభుత్వ చొరవతో విడుదలైన ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారుల్లో ఒకరైన కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ్, అతని తండ్రి.. ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ లేఖ రాశారు.

తమ జీవితంలో అత్యంత సవాళ్లతో కూడుకున్న ఒక దశలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మాకు అండగా నిలిచిందని కొనియాడారు. అనేక అవిశ్రాంత ప్రయత్నాల తరువాత మీరు మమ్మల్ని తిరిగి మా ఇంటికి చేర్చారని అన్నారు. నా హృదయం మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తిందని లేఖలో వివరించారు. మా జీవితాల్లో ఒక దీప స్తంభం గా ఉద్భవించారని అన్నారు. ఇంకా లేఖలో..

"భారతీయులెవరూ వెనుకబడి ఉండరాదనే మీ గంభీరమైన ప్రతిజ్ఞ.. మా హృదయాల్లో లోతుగా ప్రతిధ్వనించింది. మీరు చూపించిన నిబద్ధత, లోతైన చిత్తశుద్ధిని పదే పదే ప్రదర్శించారు." అని చెప్పారు. తమ విడుదల కోసం మీరు అన్ని ప్రయత్నాలు చేశారు. మేము ఖతార్ జైలులో ఖైదీగా ఉన్నప్పుడు ఏ చిన్న అంశమైన సరే వదలకుండా ప్రయత్నించారు. ఇందుకు మీరు అమెరికా, ఫ్రాన్స్, జీ20 వంటి వేదికలను సైతం వదలకుండా మా కోసం పరితపించారు. దాని పర్యవసానంగానే మేము మా ఇంటికి చేరగలిగామని లేఖలో కొనియాడారు.
మీరు అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. మాకు స్వేచ్ఛ లభించడానికి బహూశా రాముడు కూడా ఆశీర్వదించి ఉంటాడని అనిపిస్తోంది. మా దుస్థితి తొలగించడానికి మీరు చేసిన అచంచలమైన పోరాటానికి, నేను మీకు శాశ్వతంగా రుణపడి ఉంటానని చెప్పారు. కెప్టెన్ వశిష్ట్ తండ్రి వింగ్ కమాండర్ రాజిందర్ కుమార్ వశిష్ట్ (రిటైర్డ్) కూడా తన కొడుకు తిరిగి వచ్చినందుకు ప్రధాని మోదీని ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపారని అధికారులు తెలిపారు.
"18 నెలల పాటు సాగిన ఈ బాధాకరమైన కథలో, మీరు మా అచంచలమైన ఆశల స్తంభంగా ఆవిర్భవించారు. 86 సంవత్సరాల వయస్సులో, నా కొడుకును నిరాశ అంచుల నుంచి తిరిగి తీసుకురావడంలో మీరు చేసిన ఎడతెగని ప్రయత్నాలకు నేను చాలా కృతజ్ఞతతో మునిగిపోయాను. " ఆయన కూడా లేఖలో సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ అనేకమంది నాయకులను చూశానని, అయినప్పటికీ " దేశం, పౌరుల పట్ల మీకున్నట్లుగా అచంచలమైన కరుణ, దూరదృష్టి, భక్తిని ఎవరూ ప్రసరింపజేయలేదని" అన్నారు.
గత ఏడాది ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన సొరంగంలో చిక్కుకున్న వారి భద్రత కోసం ఆయన చేసిన కృషిని కొనియాడుతూ, “మీ నాయకత్వంలో భారతదేశం ఆశాజ్యోతిగా వికసించింది, మరోమారు రామరాజ్యాన్ని గుర్తుచేస్తుంది” అని ఆయన అన్నారు.
"భారతీయులెవరూ వెనుకబడకుండా చూసేందుకు మీరు ప్రదర్శించిన అసాధారణ ప్రయత్నాలు, అచంచలమైన దృఢ సంకల్పానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. మీపై మాకు కలిగిన కృతజ్ఞతా భావానికి అవధులు లేవు. నా కొడుకు నిర్బంధంలో ఉన్నంత కాలం నేను 'మోదీ హై టు ముమ్కిన్ హై, ఈ రోజు నేను ప్రపంచానికి చెబుతున్నాను. ఈ మాటల్లో నిజం ఉందని గొప్పగా గర్విస్తున్నాను" అని ఆయన అన్నారు.
ఖతార్ లో ఏం జరిగిందంటే..

భారత నేవీకి చెందిన ఎనిమిది మంది రిటైర్డ్ అధికారులు ఖతార్ లో నిర్వహిస్తున్న ఓ సెక్యూరిటీ కంపెనీలో పనిచేయడానికి వెళ్లారు. ఈ కంపెనీ ఖతార్ నేవికి సబ్ మెరైన్లను అందించేది. అయితే వీటికి సంబంధించిన కీలక సమాచారాన్ని భారత నేవీ అధికారులు తమ శత్రు దేశమైన ఇజ్రాయెల్ కు అందించారని వారిని ఆ దేశం అరెస్ట్ చేసి నిర్భంధించింది. అంతేకాకుండా అక్కడి కోర్టు వీరికి మరణ శిక్ష విధించింది. ఈ సంఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.

వెంటనే భారత ప్రభుత్వం దౌత్య మార్గాల్లో రంగంలోకి దిగింది. కొన్ని ప్రత్యేక బృందాలు అమెరికా, ఫ్రాన్స్, రష్యా అధికారులతో మాట్లాడుతుండగానే, మరికొన్ని బృందాలు ఖతార్ అధికారులతో చర్చలు ప్రారంభించాయి. మొదట భారత ప్రభుత్వ చొరవతో ఉరిశిక్షను ఆపిన ఖతార్.. చివరకు ఉరిశిక్ష పడిన మాజీ నేవీ అధికారులను బేషరతుగా విడిచిపెట్టింది. మొదట అరెస్ట్ అయిన అధికారుల వివరాలు సైతం ఇవ్వడానికి నిరాకరించిన అక్కడి ప్రభుత్వం చివరకు విడిచిపెట్టడం గమనార్హం.

ఖతార్ కు తప్పుడు సమాచారం అందించి భారత నేవీ అధికారులు అరెస్ట్ చేయించారని అంతర్జాతీయవర్గాల సమాచారం. అయితే దౌత్య మార్గాల్లో వీరిని భారత సురక్షితంగా రక్షించగలిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో మోదీ ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయారు.


Tags:    

Similar News