IPL-2024 తొలి క్వాలిఫయర్.. అమితుమీ తేల్చుకోనున్న ఎస్‌ఆర్‌హెచ్, కేకేఆర్

ఐపీఎల్ 2024 టోర్నీ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఇందులో టాప్ టయర్‌లో ఉన్న కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ తలపడనున్నాయి..

Update: 2024-05-21 06:59 GMT

ఐపీఎల్ 2024 టోర్నీ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఇందులో టాప్ టయర్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్), సన్‌ రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్‌హెచ్) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగనుందని, అందుకు ఈ మ్యాచ్ సందర్బంగా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఒక గుడ్ న్యూస్, కేకేఆర్‌కు ఒక బ్యాడ్ అందడమే కారణమని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇంతకీ ఆ గుడ్, బ్యాడ్ న్యూస్‌లేంటనేదే ఇప్పుడు అసలు పాయింట్. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్.. ఫైనల్స్‌కు చేరుకుని తన ప్రత్యర్థి కోసం వెయిట్ చేస్తుంటుంది. అయితే పాయింట్స్ టేబుల్‌లో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఆర్ఆర్, బెంగళూరు మధ్య రేపు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. వాటిలో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు వెళుతుంది. అక్కడ అసలు టోర్నీ విజేత ఎవరనేది తేలుతుంది. అయితే ఇంతకీ ఈరోజు జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్, కేకేఆర్‌కు బ్యాడ్‌న్యూస్‌గా మారనున్నది ఏంటంటే.. మ్యాచ్ జరిగే వేదిక.

రికార్డుల్లో కేకేఆర్‌దే పైచేయి

ప్రస్తుతం ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్ రెండు జట్లు కూడా ఫేవరెట్లగానే క్వాలిఫయర్ బరిలో దిగనున్నాయి. ఈ రెండు జట్లు బీభత్సమైన ఫామ్‌లో కూడా ఉన్నాయి. రికార్డుల పరంగా చూసుకున్నా కేకేఆర్ ముందంజలో ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 26 మ్యాచుల్లో తలపడగా వాటిలో 17 సార్లు కేకేఆర్, తొమ్మిది సార్లు ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించాయి. దీనిని బట్టి చూస్తే ఈరోజు జరిగే మ్యాచ్‌లో కేకేఆర్‌కే అప్పర్ హ్యాండ్ ఉందొచ్చని అందరూ భావిస్తున్నారు. ఇక్కడే అసలు మెలిక ఉంది.

క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతున్న అహ్మదాబాద్‌ స్టేడియం మాత్రం ఆరెంజ్ ఆర్మీకి కలిసివస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. కేకేఆర్ ఆటగాళ్లు ఎంత ఫామ్‌లో ఉన్నా ఈ స్టేడియంలో మాత్రం వాళ్ల రికార్డ్‌లు పరమచెత్తగా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ టోర్నీలో కేకేఆర్ తరపున అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్‌గా సునీల్ నరైన్ మెరుస్తున్నారు. ఇన్నాళ్లూ తన స్పిన్ బౌలింగ్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన నరైన్.. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో మెరిశాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కానీ అహ్మదాబాద్ స్టేడియంలో నరైన్ రికార్డులు కూడా చెప్పుకోదగ్గ విధంగా లేవు. అక్కడ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగితే మూడు సార్లు కూడా నరైన్ డకౌట్ అయ్యాడు. ఇదే ఇప్పుడు సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. కేకేఆర్‌కు బ్యాడ్ న్యూస్.

ఒకవేళ వర్షం పడితే

ఒకవేళ ఈరోజు మ్యాచ్ వర్షంతో ఆగిపోతే అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే ఈ మ్యాచ్‌ను రిజర్వ్‌ డే రోజున నిర్వహిస్తారు. అప్పుడు కూడా ఏదో ఒకటి జరిగి మ్యాచ్ ఆగిపోతే.. టేబుల్ టాపర్‌గా ఉన్న కేకేఆర్‌ను విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి డూ ఆర్ డైగా మారుతుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టును ఎట్టిపరిస్థితుల్లో చిత్తు చేయాల్సి వస్తుంది. కానీ ఈరోజు వాతావరణ పరిస్థితి చూస్తే అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. 98శాతం వర్షం పడదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరి ఈరోజు మ్యాచ్‌లో ఎవరు మెరుస్తారో చూడాలి.

Tags:    

Similar News