జియో, ఎయిర్టెల్ కి రూ. లక్ష కోట్లు ఇవ్వబోతున్న కస్టమర్లు

జియో, ఎయిర్టెల్ సంస్థలు సంవత్సరానికి రూ. లక్ష కోట్లు లబ్ది పొందనున్నాయి.

By :  Vanaja
Update: 2024-07-10 12:44 GMT

రెండు దిగ్గజ టెలికామ్ సంస్థలు తమ టారిఫ్ లు అమాంతం పెంచేశాయి. జియో, ఎయిర్టెల్ ఇప్పుడున్న ప్లాన్ ధరలపై 20 శాతం అదనంగా పెంచాయి. ఒక్కో ప్లాన్ పై అదనంగా రూ.100 పెంచేశాయి. దీంతో ఈ రెండు సంస్థలు సంవత్సరానికి రూ. లక్ష కోట్లు లబ్ది పొందనున్నాయి. ఒకేసారి ఇంత మొత్తంలో టారిఫ్ ల ధరలు పెంచేసి వినియోగదారులపై అధిక భారం మోపుతున్నప్పటికీ ట్రాయ్ నోరు మెదపకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల ఎయిర్టెల్ సంస్థ తమ కస్టమర్లకు టారిఫ్ రేట్లు పెరగబోతున్నాయని ఒక మెసేజ్ పంపింది. అందులో ఏముందంటే... "ప్రియమైన కస్టమర్, మీ ఎయిర్‌టెల్ బ్లాక్ కనెక్షన్‌లో భాగంగా మీ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధర రూ.499 నుండి రూ.599కి సవరించబడింది. మీ ఎయిర్‌టెల్ బ్లాక్ రెంటల్ రూ.100కి రివిజన్ చేయబడుతుంది, ఇది మీలో ప్రతిబింబిస్తుంది. రాబోయే బిల్లు, 9-Aug'24 నుండి అమలులోకి వస్తుంది" అని ఆ మెసేజ్ సారాంశం.

అయితే, అదనపు సేవలను అందించడానికో, సేవల నాణ్యతలను మెరుగుపర్చినందుకో టారిఫ్ రేట్లు భారీగా పెంచారంటే అర్థముంది. అలాంటిదేమీ లేకుండా రూ.500 పైనే ప్లాన్ ధరలు పెంచడం, అంటే ఇప్పుడున్న ప్లాన్ పై 20 శాతం పెంచుతూ కస్టమర్ల నుండి రూ.100 అధికంగా వసూలు చేయనుంది.

దేశంలో రెండు కంపెనీలకు కలిపి సుమారు 837 మిలియన్ల మొబైల్ కస్టమర్ బేస్ ఉంది. ప్రతి కస్టమర్ నెలకు రూ. 100 అదనంగా చెల్లిస్తే, వారి లాభాలకు తక్షణమే జోడించిన అదనపు ఆదాయం నెలకు రూ. 8,370 కోట్లు, సంవత్సరానికి రూ. 1,00,000 కోట్లకు చేరుకుంటుంది. టెలికామ్ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రెండు సంస్థలు కస్టమర్లను ఇలా దోచుకుంటుంటే TRAI (టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఏం చేస్తోంది? ఈ దోపిడీని ప్రశ్నించదా? అని మాజీ ఐఏఎస్ అధికారి, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్రాయ్ కి, భారత టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కి మెయిల్ ద్వారా ఒక లేఖ రాశారు.

ప్రభుత్వం ప్రాథమిక సౌకర్యాలను కల్పించే ముసుగులో లక్షలాది పేద కుటుంబాలను ఈ కంపెనీల చేతుల్లోకి నెట్టేసింది. టెలికామ్ కంపెనీలు ఏకపక్షంగా అధిక ధరలు పెంచడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. స్వతంత్ర దర్యాప్తు నిర్వహించి అసలు నిజాలు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. భారత టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ప్రజలపక్షాన నిలబడకుండా కంపెనీల వైపు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది అని ఈఏఎస్ శర్మ లేఖలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ట్రాయ్ మౌనం వహిస్తే ఇంక ఆ సంస్థ ఏం చేయడానికి ఉన్నట్టు అని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News