హసీనా పారిపోవడంలో విదేశీ గూఢచారి సంస్థ ప్రమేయం ఉంది: వాజేద్

బంగ్లాదేశ్ లో జరిగిన విద్యార్థుల ఆందోళన వెనక ఓ విదేశీ గూఢచార సంస్థల ప్రమేయం ఉందని హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ అన్నారు. భారత్ తమ దేశంలో సాఫీగా ఎన్నికలు..

Update: 2024-08-14 12:18 GMT

బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడానికి భారత్ చొరవచూపాలని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజెద్ జాయ్ కోరారు. 90 రోజుల్లో దేశంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ కూడా స్వేచ్ఛగా పాల్గొనడానికి, ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించేలా చేయాలని కోరారు. విద్యార్థుల కోటా ఉద్యమంలో తన తల్లి తప్పు చేసిందని ఆయన అంగీకరించారు. తన దేశం నుంచి హసీనా పారిపోవడానికి ఓ విదేశీ గూఢచారి సంస్థ కారణం అని పేర్కొన్నారు.

భారతదేశానికి విజ్ఞప్తి
"90 రోజుల రాజ్యాంగ కాల వ్యవధిలో ఎన్నికలు జరిగేలా చూడండి, మూక దాడుల పాలనను నిలిపివేసి, అవామీ లీగ్ ప్రచారం, పునర్వ్యవస్థీకరణకు అనుమతించబడుతుందని నేను ఆశిస్తున్నాను" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
" మేము ఎన్నికల్లో గెలుస్తామని నాకు ఇంకా నమ్మకం ఉంది... మేము ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీగానే ఉన్నాం." అని ఆయన అన్నారు. విద్యార్థి నిరసనకారులతో ప్రభుత్వం మొదటి నుంచీ మంచి వాతావరణంలో చర్చలు జరపాల్సి ఉండేదని, అలాగే వివాదాస్పద కోటాకు వ్యతిరేకంగా కూడా మాట్లాడకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
హసీనా తప్పు
మేము తప్పుచేశాం, నిర్ణయాన్ని కోర్టులకు వదిలేసే బదులు, నిరసనకారులతో మాట్లాడి తేల్చుకుంటే సరిపోయోదని అన్నారు. ప్రభుత్వం కోటాను తగ్గించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసు అప్పీల్ చేసింది. "కోర్టు తప్పు చేసిందని, మాకు కోటాలు అక్కర్లేదని పేర్కొంటూ మేము బహిరంగ వైఖరిని తీసుకోవాలని నేను సిఫార్సు చేసాను.
కానీ న్యాయ వ్యవస్థ దీన్ని నిర్వహిస్తుందని ఆశించి మా ప్రభుత్వం అలా చేయకూడదని నిర్ణయించుకుంది” అని జాయ్ అన్నారు. నిరసనలు హింసాత్మకంగా మారడంలో విదేశీ జోక్యం ఉందని, విదేశీ నిఘా సంస్థ ప్రమేయం ఉండవచ్చని ఆయన ఆరోపించారు.
ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ..
"ఒక విదేశీ గూఢచార సంస్థ ప్రమేయం ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను, ప్రత్యేకించి జూలై 15 నుంచి ప్రారంభమైన ఆందోళనలో అనేక మంది ప్రదర్శనకారులు మారణ ఆయుధాలతో వచ్చారు. వీరిలో కొంతమంది దగ్గర తుఫాకులు కూడా ఉన్నాయి.
“గత 15 సంవత్సరాలుగా మిలిటెన్సీని విజయవంతంగా నియంత్రించడం వల్ల బంగ్లాదేశ్‌లో ఆయుధాలు పొందడం చాలా కష్టం. దేశంలోకి తుపాకీలను అక్రమంగా తరలించి, ప్రదర్శనకారులకు సరఫరా చేయగల ఏకైక సంస్థ విదేశీ గూఢచార సంస్థ అని ఆయన అన్నారు.
హసీనా పారిపోవాలనుకోలేదు
హసీనాకు దేశం విడిచి వెళ్లే ఉద్దేశం లేదని జాయ్ స్పష్టం చేశారు. ప్రమాదం ముంచుకొస్తున్నందున తక్షణమే వెళ్లిపోవాలని ఆమె ప్రత్యేక భద్రతా దళం పట్టుబట్టడంతో రాజీనామా చేసి దేశం దాటవలసి వచ్చిందని చెప్పారు. అంతకుముందు బహిరంగంగా రాజీనామా చేసి ఆ ప్రకటన చేశారన్నారు. "వాస్తవానికి, ఆమె రికార్డింగ్ (ఆమె స్టేట్‌మెంట్) ప్రారంభించబోతున్నప్పుడు, 'మేడమ్, సమయం లేదు. మీరు ఇప్పుడు వెళ్లాలి' అని ప్రత్యేక భద్రత సిబ్బంది హెచ్చరించారు." జాయ్ వివరించాడు.
భారత్ కు ధన్యవాదాలు..
హసీనాకు ఆశ్రయం కల్పించినందుకు భారత్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలిపిన జాయ్, ఆమె ఏ దేశంలోనూ ఆశ్రయం పొందలేదని చెప్పారు. "బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడడానికి ఆమె వేచి ఉంది," అని జాయ్ వివరించారు. హసీనా భారతదేశంలోనే ఉంటుందని చెప్పాడు.
హసీనాను కలవడానికి మీరు భారతదేశాన్ని సందర్శిస్తారా అని అడిగినప్పుడు, తనకు కోరిక ఉందని, అయితే సమయం గురించి కచ్చితంగా తెలియదని చెప్పాడు.
Tags:    

Similar News