లడ్డూ గొడవ మీద తెలుగు ప్రజానీకానికి ‘సంగమం’ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ ను ఉత్తరప్రదేశ్ లా మార్చాలని గత అనేక సంవత్సరాలుగా జిత్తులు పన్నుతున్న మతతత్వ శక్తులకు తిరుపతి ప్రసాదంలో కల్తీ, తేరగా దొరికిన లడ్డూలా దురాశ కలిగిస్తోంది.

By :  Admin
Update: 2024-09-27 08:01 GMT

తిరుమల లడ్డుకు కల్లీ చేసిన నెయ్యి సరఫరా చేశారని  ఉద్వేగాలతో పెంపొందిస్తున్న మతతత్వ వ్యాప్తిని నిరోధించే చర్యలను తీసుకోండని విజయవాడ కేంద్రంగా లౌకిక ప్రజాస్వామిక వేదిక ‘సంగమం’ విజ్ఞప్తి చేసింది. రచయితలు మేధావులతో పాటు అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం, జన సాహితి, సాహితీ స్రవంతి, శ్రీశ్రీ సాహిత్య నిధి , జాషువా కళావేదిక, సోషల్ సైన్సెస్ ట్రస్ట్ తదితర సంస్థలతో ఏర్పడిన వేదిక ‘సంగమం’.


వివరాలు:
ఇందుగలదందు లేదని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన అందందే కలదు, అవినీతి! ఆంధ్ర మహా జనులారా!!

అనేకానేక రూపాల అవినీతిలో ఆహార పదార్థాల కల్తీ ఒకటి. ఏ తల్లీ తన పిల్లలకు కల్తీ పాలు ఇవ్వాలని అనుకోదు గాక అనుకోదు. కానీ తల్లులు తీసుకునే అనేక ఆహార పదార్థాలలో కల్తీ కారణంగా తల్లిపాలు కూడా కల్తీ అయిపోతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం.

నేటి ధనస్వామ్య వ్యాపార ప్రపంచంలో, మార్కెట్ సంస్కృతి ప్రబలిన ప్రతి చోటా కల్తీ విశ్వరూపిగా మారింది. డబ్బులు పంచి ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేయటం ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కల్తీ చేయడం కాదా?
ఇలాంటి వాతావరణంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భక్తులు స్వీకరించే తిరుపతి లడ్డూలో కల్తీ లేదని మనం చెప్పలేము. కల్తీ జరిగిందనే భావన కూడా భక్తుల విశ్వాసాలను ఖచ్చితంగా గాయపరుస్తుంది. లడ్డూలో నిజంగా కల్తీ ఉంటే దాన్ని ఆధునిక పరికరాలతో లోతైన పరీక్షల ద్వారా, నమ్మకమైన న్యాయ విచారణ ద్వారా కనిపెట్టి, తగిన రుజువులతో బాధ్యులైన వారిని శిక్షించాలి. భక్తులకు పూర్తి ఊరట కలిగించాలి.
ఆ బాధ్యత టీటీడీ పాలకవర్గానిది, వారిని నియమించిన రాష్ట్ర ప్రభుత్వానిది.
అయితే ఇలాంటి సంఘటనలు ప్రజల దృష్టికి వచ్చినప్పుడు నిజమైన భక్తులు తాము గతం నుండి స్వీకరిస్తూ వస్తున్న దైవ ప్రసాదం స్వచ్ఛమైనదిగా రుజువవాలనీ, కల్తీ లాంటిది
జరిగి ఉండకుంటే బాగుండుననీ కోరుకుంటారు. దేవుడిని రాజకీయ వివాదాలకు దూరంగా నిలుపుకోవాలని భావిస్తారు. రాజకీయాల కల్తీ... దేవుడి ప్రసాదానికి అంట కూడదని తలుస్తారు.

ఈ సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలూ , వాటి నాయకులూ వేసుకోగలిగిన ప్రశ్నలు రెండే రెండు!

1.భక్తులలో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక
2. ప్రజల మనోభావాలు గాయపడకుండా, పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించు కోవడమా?

నేయి కల్తీకి పాల్పడిన అవినీతి శక్తులపై తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవలసి ఉండగా, ప్రత్యర్థులను బజారుకీడ్చి ఇరుకున పెట్టే రాజకీయాలకు తెర లేపడం హర్షణీయం కాదు. రుచికరమైన తీయని లడ్డూని నడి బజారులో పెడితే అనేక ఈగలు, పురుగులు దానిని ఆవహించటం సహజమే కదా!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గంగవరం పోర్టు భూములను ఆదానీ కంపెనీకి కట్టబెట్టడంలో రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తూ అడ్డగోలుగా వ్యవహరించిన దానిని ఆనాడు పట్టించుకోని ప్రస్తుత ప్రభుత్వ భాగస్వామ్యులు, భక్తుల మనోభావాలను గాయపరిచే చర్యలకు పాల్పడుతున్నారు.

తిరుపతి లడ్డూల కల్తీ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని, మతోన్మాద శక్తులు బలం పొంది, అంతిమంగా రాష్ట్ర రాజకీయాలలో పైచేయి సాధించటానికి దారిని సులువు చేస్తున్నారు. మతసామరస్యానికి పెట్టింది పేరైన ఆంధ్రప్రదేశ్ ను ఉత్తరప్రదేశ్ లా మార్చాలని గత అనేక సంవత్సరాలుగా జిత్తులు పన్నుతున్న మతతత్వ శక్తులకు తిరుపతి ప్రసాదంలో కల్తీ, తేరగా దొరికిన లడ్డూలా దురాశ కలిగిస్తోంది.

"లౌకిక రాజకీయాలలోకి అలౌకిక విశ్వాసాలతో కూడిన మత ఉద్వేగాలు చొరబడకూడదు, మతసామరస్యం నెలకొనాలి!" అని భావించటం లౌకికవాదంలో ముఖ్యమైన అంశం. మనుషుల వల్లనే అవినీతి, కల్తీ జరుగుతాయని చెబుతుంది లౌకికవాదం. ఆధునిక ప్రజాస్వామ్య యుగ లక్షణం లౌకికవాదం! అలాంటి లౌకికవాదం మీద దాడికి పూనుకోవటం మతతత్వ విస్తరణలో భాగం. అవినీతి మీద జరపవలసిన పోరాటాన్ని లౌకికవాదం మీదకు మళ్లించడం రాజకీయ ఆధిపత్య ప్రయోజనాల కోసమే!
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ తరహా మతతత్వ శక్తులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయునికి గల చేదు అనుభవాలు తక్కువ కాదు.

రచయితల, కళాకారుల, మేధావులతో కూడిన లౌకిక ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక సంగమం, నేటి వివాదంలో ప్రజల తరఫున ఈ క్రింది కోర్కెలను ప్రభుత్వం దృష్టికి తెస్తోంది!

1. దైవభక్తిలోకి రాజకీయాలను చొరబడనివ్వకండి!

2. కల్తీ నెయ్యి విషయంపై ప్రభుత్వానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు అవినీతికి పాల్పడిన వారందరిపై కేసులు పెట్టి చట్టబద్ధమైన చర్యలను తీసుకొనండి.

3. ఆహార పదార్థాలలో కల్తీని తనిఖీ చేసే, మన దేశ స్థాయిలో అత్యున్నత పరీక్షా కేంద్రమైన 'నేషనల్ ఫుడ్ లాబరేటరీ, ఘజియాబాద్' కు వివాదాస్పదమైన పదార్థాన్ని పరీక్షలకు పంపి నిజానిజాలు నిగ్గు తేల్చండి.

4. ఉద్వేగాలతో పెంపొందిస్తున్న మతతత్వ వ్యాప్తిని నిరోధించే చర్యలను తీసుకోండి!


Tags:    

Similar News