మైనారిటీలను కాపాడాల్సిన బాధ్యత మధ్యంతర ప్రభుత్వానిదే: యూఎస్
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న హింసాత్మక దాడులపై యూఎస్ స్పందింంచింది. మానవ హక్కులు, ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత అక్కడి..
By : 491
Update: 2024-12-04 05:48 GMT
భారత పొరుగు దేశం బంగ్లాదేశ్ లో కొన్ని రోజులుగా మైనారిటీ హిందువులు, సిక్కులు, క్రిస్టియన్స్ తో పాటు ముస్లింలోని కొన్ని తెగలపై జరుగుతున్న దాడులపై యూఎస్ స్పందించింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీల హక్కులను కాపాడాలని, మానవ హక్కులను పరిరక్షించాలని కోరింది. యూఎస్ విదేశాంగ శాఖ డిప్యూటీ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ మానవ హక్కులతో పాటు సహ ప్రాథమిక స్వేచ్చలను గౌరవించాలని యూఎస్ పిలుపునిస్తోంది’’ అని ఆయన అన్నారు.
మానవ హక్కులు.. మత స్వేచ్ఛకు గౌరవం..
ప్రభుత్వాలే చట్టాలు గౌరవించాలి. అందులో భాగంగా ప్రాథమిక మానవ హక్కులను వారు కాపాడాలని మేము బంగ్లాదేశ్ కు గట్టిగా చెబుతున్నామన్నారు. హక్కులకు భంగం కలిగితే కొనసాగితే జరిగే నిరసనలు కూడా శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు.
" నిర్బంధంలో ఉన్న వారికి కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రాథమిక స్వేచ్ఛ, మానవ హక్కులు అమలు చేయాల్సిన అవసరం ఉందని మేము గట్టిగా చెబుతూనే ఉన్నాము" అని పటేల్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మధ్యంతర ప్రభుత్వానిదే "సంపూర్ణ బాధ్యత"
బంగ్లాదేశ్ లోని హిందూ మైనారిటీలను కాపాడే బాధ్యత మధ్యంతర ప్రభుత్వానిదే అని యూఎస్ చట్టసభ సభ్యుడు బ్రాడ్ షెర్మాన్ అన్నారు. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ దే ఈ బాధ్యత అని ఆయన పరోక్షంగా చెప్పారు. ఆ దేశంలో జరిగిన అధికార మార్పుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లర్ క్లింటన్ కు అత్యంత సన్నిహితుడు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
యూఎస్ లో ర్యాలీలు..
బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులపై హిందూ సమాజం ఆందోళన చెందుతూ.. యూఎస్ లోని వైట్ హౌజ్ దగ్గర ర్యాలీలు చేస్తున్నారు. ఇస్కాన్ ప్రతినిధి స్వామి చిన్మయా దాస్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం పై వారు నిరసనలు చేపడుతున్నారు. అలాగే అమెరికాలోని ఇస్కాన్ ఇంటర్నేషనల్ కూడా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నిరసనలను కూడా షెర్మాన్ ప్రస్తావించారు.
" బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం తన హిందూ మైనారిటీని రక్షించే సంపూర్ణ బాధ్యతను కలిగి ఉంది. ఇటీవలి దాడులు, వేధింపుల వల్ల వేలాది మంది మైనారిటీ హిందువులు జరుపుతున్న నిరసనలను అర్థవంతంగా పరిష్కరించాలి" అని షెర్మాన్ చెప్పారు. ఇవి మరింత తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు
బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా రాడికల్ ఇస్లామిస్టులు చేస్తున్న దురాగతాలను బైడెన్ - హారిస్ పరిపాలన యంత్రాంగం పరిష్కరించాలని హిందూ యాక్షన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్సబ్ చక్రవర్తి కూడా పిలుపునిచ్చారు.
"బంగ్లాదేశ్ నుంచి మాకు అందుతున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, తాత్కాలిక ప్రభుత్వంచే నిర్బంధించబడిన హిందూ సన్యాసి, పౌర హక్కుల పరిరక్షకుడు చిన్మోయ్ కృష్ణ బ్రహ్మచారి కస్టడీలో ప్రాణాలకు ముప్పు ఉంది" అని ఆయన చెప్పారు.
భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆగస్టులో ప్రధానమంత్రి షేక్ హసీనాను తొలగించిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ - బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.