Mahakumbh | కుంభమేళాలో అగ్నిప్రమాదం, జనం ఉరుకులు పరుగులు

మహా కుంభమేళా(Kumbh Mela)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులు ఉరుకులు పరుగులు పెట్టారు. సీఎం ఆదిత్య నాథ్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు;

Update: 2025-01-19 13:13 GMT

మహాకుంభమేళాలో అగ్నిప్రమాదం దృశ్యం

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గుడారంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి క్రమంగా మంటలు ఇతర గుడారాలకు వ్యాపించాయి. మరోవైపు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఒక మహిళ గాయపడ్డారని ప్రాధమిక సమాచారం. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ముఖ్యమంత్రి హుటాహుటిన రాక...
మహాకుంభమేళా (Mahakumbh) లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు సమీపంలోని 10 టెంట్లకు పాకడంతో పోలీసులు, స్థానిక యంత్రాంగం అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసినట్టు ప్రయాగ్‌రాజ్ జిల్లా కలెక్టర్ రవీంద్ర కుమార్ తెలిపారు.
మంటలు ఇలా మొదలయ్యాయి...
ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో సెక్టార్ 5లో మంటలు చెలరేగాయి. వారణాసిలోని వివేకానంద సేవా సమితి టెంట్‌లో భోజనం వండుతుండగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఇదింకా అధికారికంగా ధృవీకరించలేదు. గ్యాస్ సిలిండర్లలో పేలుళ్లు సంభవించడంతో టెంట్లను మంటలు చుట్టుముట్టి పెద్ద ఎత్తున నల్లటి పొగ ఎగసిపడుతోంది. 20 నుంచి 25 టెంట్లు కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు ఆరు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. అయినా మంటలు అన్ని వైపులా విస్తరిస్తున్నందున పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. మహాకుంభమేళా పరిధిలోకి వచ్చే శాస్త్రి బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతంలో మంటలు చెలరేగాయని అనధికారిక సమాచారం.
సెక్టార్ 5లో చెలరేగిన మంటలు క్రమంగా సెక్టార్ 19, 20కి కూడా వ్యాపించాయి. బలమైన గాలి కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. సమీపంలోని టెంట్‌లను కూడా చుట్టుముట్టడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నిప్రమాదం తర్వాత జాతర ప్రాంతమంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా సమాచారం అందలేదు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికార యంత్రాంగం ప్రకటించింది. పుకార్లను పట్టించుకోవద్దని భక్తులను విజ్ఞప్తి చేసింది. ప్రమాదం తీవ్రత, వాటిల్లిన నష్టంపై సమాచారం వెల్లడించలేదు.
ప్రమాదానికి కారణమేమిటీ...
భక్తులు బస చేసేందుకు జాతర ప్రాంతంలో గుడారాల ఏర్పాట్లు చేశారు. టెంట్‌లో బస, భోజనానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఉంటాయి. ఇక్కడ ఏదొక టెంట్‌లో ఉంచిన సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. గుడారాలు ఒక వరుసలో ఏర్పాటు చేయడంతో ప్రమాదం తర్వాత మంటలు ఒకదాని తర్వాత మరొకదానిని చుట్టుముట్టాయి.
‘‘మహా కుంభమేళాలోని సెక్టార్‌ 19 వద్ద గుడారంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. ఆ మంటలు ఇతర గుడారాలకు వ్యాపించాయి. కుంభమేళా (Kumbh Mela) వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా అప్పటికే ఉంచిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశాయి. సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం’ అని పోలీసులు తెలిపారు.
‘‘గీతాప్రెస్‌కు చెందిన టెంట్‌లలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వే జరుగుతోంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి కారణాలను తెలుసుకొనేందుకు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. టెంట్లు, కొన్ని వస్తువులు మాత్రం దగ్ధమయ్యాయి’’ అని మహా కుంభమేళా డీఐజీ వైభవ్‌ కృష్ణ ట్వీట్ చేశారు.
మరోవైపు, ఈ ఘటనపై మహా కుంభమేళా నిర్వాహకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద ఘటన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండాలని గంగా మాతను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
Tags:    

Similar News