MUTTON WAR|బీజేపీ ఎంపీ విందులో 'మటన్ వార్'!
నవంబర్ 20న ఉత్తరప్రదేశ్ లోని మజావాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక సందర్భంగా ఏర్పాటైన ఈ విందుపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
By : The Federal
Update: 2024-11-18 13:45 GMT
ఆమధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మటన్ కూర దొరకలేదని పెద్ద గలాటాయే జరిగింది. సరిగ్గా ఇప్పుడు అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ మీర్జాపుర్ లో జరిగింది. c ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh YADAV) కూడా ఆ సంఘటనపై జోక్ పేల్చారు. మటన్ వార్ (Mutton War) అని అభివర్ణించారు. అసలేం జరిగిందంటే...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో బీజేపీ ఎంపీ ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఎంపీ ఇచ్చిన విందుకు జనం ఇరగబడ్డారు. దీంతో గందరగోళం చెలరేగింది. జనం ఎక్కువ కావడంతో మటన్ కూరలో ముక్కలు తరిగాయి. మాసాలా మిగిలింది. వచ్చిన వాళ్లు చికాకు పడ్డారు. ఈమాత్రం దానికి మమ్మల్ని ఎందుకు పిలిచారంటూ చిర్రుబుర్రులాడారు. విందు కాస్తా రాజకీయమైంది. విమర్శలకు దారితీసింది. సెటైర్లు పేలాయి.
"రక రకాల యుద్ధాలను చూశానని, కానీ.. ఈ ‘మటన్ యుద్ధం’ (Mutton War) మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని" సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు.
మీర్జాపుర్‌లోని తన ఆఫీస్‌లో బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ బింద్ ఇటీవల విందు ఇచ్చారు. ఆయన గతంలో మజావాన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయన ఎంపీగా ఎన్నిక కావడంతో అక్కడ ఉపఎన్నిక జరుగనుంది. ఈ సందర్భంగా ఆయన ఓ విందు ఇచ్చారు. ఆ విందులో వడ్డించిన మటన్ కూరలో ముక్కలు లేవని అతిథులు అసహనం వ్యక్తం చేశారు. కొందరైతే ఏకంగా వడ్డించేవారిపై చేయికూడా చేసుకున్నారు. తర్వాత కొందరు బీజేపీ నేతలు జోక్యంతో ఆ గొడవ సద్దుమణిగింది. దీనిపై ఎంపీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కానీ వినోద్ కుమార్ కార్యాలయానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ..ఇదంతా మద్యం తాగిన కొందరు వ్యక్తులు చేసిన హంగామా అన్నారు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అఖిలేశ్ యాదవ్ సెటైర్లు పేల్చారు. ‘‘మీ నియోజకవర్గంలో ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. కానీ మటన్ వార్ కూడా జరిగిందని నాకు తెలియనే లేదు. నేను ఎన్నో యుద్ధాలను చూశాను కానీ.. ఈ యుద్ధం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది’’ అని వ్యంగాస్త్రాన్ని సంధించారు. వినోద్ కుమార్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడంతో మీర్జాపుర్‌లోని మజావాన్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దాంతో నవంబర్ 20న అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానంలో విజయం కోసం సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది.