ఈ అరెస్ట్, ఎన్నికల స్వేచ్ఛకు భంగం కాదు: సుప్రీంలో వాదనలు..
రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ, ప్రచారం పేరుతో దర్యాప్తు సంస్థల జరిపే విచారణల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఈడీ సుప్రీంకోర్టులో వాదించింది.
By : Praveen Chepyala
Update: 2024-04-25 10:42 GMT
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను దర్యాప్తు సంస్థ ఈడీ సమర్ధించుకుంది. ఈసందర్భంగా సుప్రీంకోర్టులో బలంగా తన వాదనలు వినిపించింది. ఆప్ అధినేతే ఎక్సైజ్ కుంభకోణంలో కింగ్ పిన్ అని, కీలక కుట్రదారుగా అభివర్ణించింది. తమకు లభించిన సాక్ష్యాల మేరకు నేరానికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, స్వేచ్చాయుత, నిష్పాక్షికమైన ఎన్నికల భావనను ఉల్లఘించదని సుప్రీంకోర్టుకు తెలిపింది.
కేజ్రీవాల్ తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేందుకు కుట్రపన్నారని, ఇది స్వేచ్చాయుత ఎన్నికలు, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్ లో ఆరోపించారు. దీనిపై ఈ డీ, సుప్రీంకోర్టు ముందు తన వాదనలు వినిపించింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదనల ప్రకారం.. ఈ కుట్రలో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, అతని మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీలోని కీలక నాయకులు ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో కీలకపాత్ర పోషించారని, అందుకు బదులుగా మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు డిమాండ్ చేసి, వసూలు చేసుకున్నారని పేర్కొంది.
" ఈ పాలసీ రూపొందించడంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కీలక కుట్రదారు, కింగ్, ఆప్ మంత్రులు, నాయకులు ప్రభుత్వంలో పెద్దలు కలిసి ప్రయివేట్ వ్యక్తుల కోసం పాలసీ రూపొందించారు" అని ఏజెన్సీ తన 734 పేజీల అఫిడవిట్‌లో పేర్కొంది.
'కుట్రలో ప్రత్యక్ష ప్రమేయం'
"అరవింద్ కేజ్రీవాల్ కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా ఉండేలా 2021-22 ఎక్సైజ్ పాలసీని రూపొందించే కుట్రలో పాలుపంచుకున్నారు. ఆ పాలసీలో చేసిన సాయాలకు బదులుగా మద్యం వ్యాపారుల నుంచి డబ్బు డిమాండ్ చేశారు. ఆ డబ్బును కూడా ఆయన స్వయంగా అడిగారు" అని దర్యాప్తు సంస్థ అభియోగం మోపింది.
ఒక ముఖ్యమంత్రిని లేదా సాధారణ పౌరుడిని అరెస్టు చేయడానికి అందుబాటులో ఉన్న ఆధారాలు సరిపోతాయని, 2002 PMLA(చట్టం)లో వేర్వేరు నిబంధనలు లేవని ఈడీ వాదించింది. పిటిషనర్ తన స్థానాన్ని చెప్పడం ద్వారా ప్రత్యేక ప్రయోజనాన్నిపొందడానికి ప్రయత్నిస్తున్నారని ఈడీ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.“ఒక వ్యక్తి ఎంత పై స్థాయిలో ఉన్నా, నేరానికి సంబంధించిన ఆధారాలు లభిస్తే అరెస్ట్ చేయవచ్చని పేర్కొంది. ఇది నిష్పక్షపాత ఎన్నికల భావనను ప్రభావితం చేయదని పేర్కొంది.
"ఢిల్లీ సీఎం చేస్తున్న వాదనను అంగీకరిస్తే నేరం చేసి అరెస్ట్ అయినా ప్రతినాయకుడు ఎన్నికల్లో ప్రచారం, పోటీ చేయాలనే సాకుతో అరెస్ట్, విచారణల నుంచి తప్పించుకునే ప్రమాదం ఉంటుంది" అని అది పేర్కొంది.
అరెస్టును సమర్థించుకున్న ఈడీ
"అరెస్ట్ విషయంలో రాజకీయ నాయకుడిని సాధారణ నేరస్థుడి కంటే భిన్నంగా చూడటం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ని ఉల్లఘించినట్లే, అలాగే సమత్వాన్ని కూడా అసమానంగా చూడాలని పరోక్షంగా అంగీకరించినట్లే" అని పేర్కొంది. పీఎంఎల్‌ఏ కింద శిక్షార్హమైన మనీలాండరింగ్ నేరానికి సంబంధించిన నేరాన్ని సూచించే సెక్షన్ 19 కింద అవసరమైన మెటీరియల్‌ను దర్యాప్తు అధికారి స్వాధీనం చేసుకున్నందున కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ వెల్లడించింది.
"మనీలాండరింగ్ నేరానికి పాల్పడిన రాజకీయ నాయకుడికి అనుకూలంగా వ్యవహరించడం అంటే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణమైన 'రూల్ ఆఫ్ లా'ని ఉల్లంఘించినట్లే" అని పేర్కొంది. ఆయన అరెస్ట్ లో ఎటువంటి ఇతర కారణాలు లేవని న్యాయస్థానం ముందు వాదించింది. తన అరెస్ట్ దుర్మార్గపు చర్య అని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన కేజ్రీవాల్ వాదనలను దర్యాప్తుసంస్థ ఖండించింది. అవన్నీ నిరాధారమైన ఊహగాహాలనీ పేర్కొంది.