రాజకీయ రంగు పులుముకున్న దూరదర్శన్ ‘లోగో ’
దూరదర్శన్ లోగో రంగు మారింది. కాషాయ వర్ణంలో కనిపించడంతో రాజకీయ రంగు పులుముకుంది. అసలు రంగు ఎందుకు మార్చారు? కారణమేంటి?
నేషనల్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్ లోగో రంగు మారింది. ఎరుపు పోయి కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది. లోగో రంగు మార్పుపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఎన్నికల నిబంధన ఉల్లంఘించడమేనని కొందరంటున్నారు.
లోగోను కొత్తగా ఆవిష్కరించాం..
లోగో రంగు మార్పుపై DD న్యూస్ తన అధికారిక ఎక్స్‌లో ఇలా పేర్కొంది. “మా విలువలు మారలేదు. వార్తలను కొత్తగా ప్రజెంట్ చేయడంలో భాగంగా కొన్నింటిని మార్చాం. సరికొత్తగా DD వార్తలను వీక్షించండి.” అని పేర్కొంది.
రంగు మార్పు బాధాకరం..
కొత్త లోగో అదికూడా ఎన్నికలకు ముందు కాషాయ రంగులో ఉండడాన్ని కొందరు తప్పపట్టారు. దూరదర్శన్ మాతృ సంస్థ ప్రసార భారతి మాజీ బాస్, TMC ఎంపీ జవహర్ సిర్కార్ కూడా ఎన్నికలకు ముందు లోగోను "కాషాయ రంగు"లో చూడటం బాధ కలిగించిందన్నారు. ప్రసార భారతిని ప్రచార భారతిగా అభివర్ణించారు కూడా. ఈ నిర్ణయం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమేనన్నారు.
సిర్కార్ 2012 నుండి 2016 వరకు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోను పర్యవేక్షిస్తున్న ప్రసార భారతికి CEOగా పనిచేశారు.
తొలుత కాషాయికరణ.. ఆపై స్వాధీనం..
ప్రభుత్వ సంస్థలను కైవసం చేసుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మాజీ సమాచార ప్రసార శాఖ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ఆరోపించారు.“ప్రభుత్వ సంస్థలను కాషాయీకరణ చేసి స్వాధీనం చేసుకునేందుకు చూస్తున్నారని, లోగో రంగు మార్చడం పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ విశ్వసనీయతను బలహీనపరుస్తుందన్నారు.
ఆరోపణలను తిప్పికొట్టిన సీఈవో ..
సిర్కార్ వ్యాఖ్యలతో ప్రసార భారతి CEO గౌరవ్ ద్వివేది విభేదించారు. కంటికి ఇంపుగా కనిపించేందుకు లోగో రంగు మారిందని చెప్పుకొచ్చారు.
“ లోగో మాత్రమే కాదు. కొత్తగా లైటింగ్ పరికరాలు వచ్చాయి. లేటెస్టు ఇక్విప్‌మెంట్ తెప్పించాం. వార్తలను కాస్త కొత్తగా ప్రజెంట్ చేయడంలో భాగంగా ఈ మార్పులు జరిగాయి. గత ఎనిమిది మాసాలుగా DD రూపాన్ని, అనుభూతిని మార్చే పనిలో నిమగ్నమయ్యాం. అయితే రంగుపై రాజకీయం చేయడం దురదృష్టకరం.’’ అని ద్వివేది పేర్కొన్నారు.
యాంకర్లకు ఖాదీ దుస్తులు..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దూరదర్శన్ న్యూస్ యాంకర్లు ఖాదీ దుస్తులు ధరించడాన్ని కేంద్రం గత నెలలో తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఇండియా పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్, ప్రసార భారతి, ఖాదీ ఇండియా మధ్య సెప్టెంబర్ 2023లో ఒప్పందం కుదిరింది.యాంకర్లు ఖాదీ దుస్తులను ధరించడం వెనక దేశ వారసత్వానికి నిదర్శనం. రోజు అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహానికి చేసే పూజకార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని DD ప్రకటించిన విషయం తెలిసిందే.
లోగోలో రంగులు..
1959లో దూరదర్శన్‌ను ప్రసారాలను ప్రారంభించినప్పుడు, లోగో కాషాయ రంగులో ఉండేదని ప్రసార భారతి అధికారులు చెబుతున్నారు. తరువాత నీలం, పసుపు, ఎరుపు రంగుల్లోకి మారిందంటున్నారు. అయితే మధ్యలో గ్లోబ్, దాని చుట్టూ రెండు రేకులు అలాగే ఉన్నాయని చెప్పారు. లోగోలో “సత్యం శివం సుందరం” అనే పదాలు కూడా ఉండేవని అయితే వాటిని తర్వాత కాలంలో తొలగించారని పేర్కొన్నారు.
దూరదర్శన్ ఆవిర్భావం..
దూరదర్శన్ ప్రసారాలు తొలిసారిగా సెప్టెంబర్ 15, 1959న అందుబాటులోకి వచ్చాయి. తొలుత ఢిల్లీ వరకు మాత్రమే పరిమితమైన ప్రసారాలు.. 1975 నాటికి ముంబై, అమృత్‌సర్ ఇతర నగరాలకు విస్తరించాయి. ఏప్రిల్ 1, 1976 నాటికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖగా ఏర్పడి, 1982లో దూరదర్శన్ జాతీయ ప్రసార సంస్థగా మారింది. 1984లో DD నెట్‌వర్క్ లోకి మరిన్ని ఛానెళ్లు వచ్చి చేరాయి. ప్రస్తుతం దూరదర్శన్ ఆరు జాతీయ, 17 ప్రాంతీయ ఛానెల్‌లను నిర్వహిస్తోంది.