ఆ పని ఢిల్లీ ఎల్ జీ చూసుకుంటారు: సుప్రీంకోర్టు

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను తొలగించాలని దాఖలు చేసిన పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరిచింది. ఆ పని తమది కాదని వ్యాఖ్యానించింది.

Update: 2024-05-13 12:15 GMT

ఢిల్లీ సీఎంగా అర్వింద్ కేజ్రీవాల్ ను తొలగించాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.దీనికి చట్టబద్దమైన విచారణ అర్హత లేదని పేర్కొంది. కేజ్రీవాల్ పై చర్యలు తీసుకోవాలంటే ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ తీసుకుంటారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్‌ను తొలగించాలన్న తన అభ్యర్థనను కొట్టివేస్తూ గత నెలలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కాంత్ భాటి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం, సోమవారం ఈ పిటిషన్ ను విచారించింది. జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్లయితే, ఢిల్లీ ఎల్‌జీ వీకే సక్సేనా చర్య తీసుకోవలసి ఉందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం, తాను జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. పిటిషన్‌కు చట్టపరమైన అర్హత లేదని కోర్టు పేర్కొంది. "ఇది విశ్వాసానికి సంబంధించింది. " అని పేర్కొంది. వీటన్నింటిలోకి మనం ఎలా వెళ్లగలం, కావాలంటే ఎల్‌జీకి చర్య తీసుకోనివ్వండి...’’ అని కోర్టు పేర్కొంది.
ఎటువైపు వెళ్తుందో..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ తీహార్ జైలుకు పంపిన నాటి నుంచి ఆయన ఢిల్లీ సీఎంగా తొలగించాలని అనేక పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి.ఆయన మధ్యంతర బెయిల్ పై విడుదలై బయటకు వచ్చిన తరువాత కూడా పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ దాఖలైన పిటిషన్లను కోర్టులు నిరాకరిస్తూ.. ‘‘ప్రజాస్వామ్యం దాని సొంత నిర్ణయం తీసుకోనివ్వండి’’ అని న్యాయస్థానాలు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి.
కోర్టు వ్యాఖ్యలతో ఇది ఆప్- ఢిల్లీ లెప్టెనెంట్ గవర్నర్ మధ్య కొత్త యుద్ధానికి తీరతీసినట్లు అయింది. ప్రత్యేకంగా నిషేధిత ఖలీస్థాన్ ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ నుంచి ఆప్ అధినేత నిధులు పొందారనే అంశంపై ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణకు కోరారు. ఇంతకుముందు కూడా అనేక అంశాలలో ఢిల్లీ ప్రభుత్వం, లెప్టినెంట్ గవర్నర్ మధ్య అనేక అంశాలపై విభేదాలు ఏర్పడ్డాయి.
“అతనికి (సక్సేనా) మా మార్గదర్శకత్వం అవసరం లేదు. అతనికి సలహా ఇవ్వడానికి మేము ఎవరూ లేము. చట్టానికి లోబడి తాను చేయాల్సిందంతా చేస్తాడు' అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
2019 లో కూడా ఇలానే..
2019లో ఒక క్రిమినల్ కేసులో కేజ్రీవాల్ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొంటున్నప్పుడు కూడా కోర్టు ఇలాంటి పిటిషన్‌ను కొట్టివేసింది. “ప్రాసిక్యూషన్ ఇంకా కొనసాగుతోంది. అతను నిర్దోషిగా బయటపడవచ్చు. అప్పుడు మీరు ఏమి చేస్తారు? అతను దోషిగా నిర్ధారించబడిన తర్వాత రండి, ”అని అప్పటి ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేజ్రీవాల్ సర్కార్ ను గత రెండు సంవత్సరాలుగా మద్యం పాలసీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థలు తొమ్మిది సార్లు జారీ చేసిన నోటీసులను ఆయన పట్టించుకోలేదు. చివరకు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినప్పుడు ఆయనన్ను ఈడీ అరెస్ట్ చేసింది.
మద్యం పాలసీలకు సంబంధించి కుట్రదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని, వారి నుంచి భారీ స్థాయిలో ముడుపులు అందుకున్నారని ఈడీ ఆరోపించింది. ఈ మొత్తం దాదాపు రూ. 100 కోట్ల వరకూ ఉంటుందని, దీనిలో రూ. 45 కోట్లను గోవా ఎన్నికల సందర్భంగా వాడుకున్నారని, మిగిలిన మొత్తాలను పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఉపయోగించుకుందని ఆరోపించింది. అయితే వీటిని ఆప్ ఖండించింది. ఎన్నికల సందర్భంగా ఆప్ ను అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ చేసిన కుట్రగా అభివర్ణించింది.
మధ్యంతర బెయిల్‌ మంజూరు
అరెస్టు చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి నిరాకరించిన కేజ్రీవాల్, తనను ఇంకా దోషిగా నిర్ధారించాల్సి ఉందని వాదించారు. అయితే ఢిల్లీ సీఎంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదనే నిబంధనలతో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. మే 25న ఢిల్లీ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన తన పార్టీ తరపున ప్రచారం చేయాల్సి ఉందని కోర్టు అంగీకరించింది.
ఎన్నికైన ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ స్థానాన్ని నొక్కిచెప్పిన కోర్టు, "... ఇవి అసాధారణమైన పరిస్థితులు, అతను సాధారణ నేరస్థుడు కాదు. అని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే కేజ్రీవాల్ బెయిల్ ను ఈడీ వ్యతిరేకించింది. సాధారణ పౌరులకంటే కేజ్రీవాల్ ఎక్కువ హక్కులు లేవని అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో ఇలాంటి కేసులు 5000 వేల వరకూ ఉన్నాయని వారందరికి ఇదే విధంగా బెయిల్ ఇస్తారా అని కోర్టు ముందుకు తీసుకొచ్చింది. అయినా సుప్రీంకోర్టు వాటిని పట్టించుకోలేదు.
ఆయనకు జూన్ 1 వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2 న అతను జైలు అధికారుల ముందు లొంగిపోవాలని తీర్పుచెప్పింది. జూన్ 4న ఫలితాలు వెలువడే వరకు పొడిగించిన బెయిల్ కోసం అతను కోరాడు - అయితే కోర్టు దానిని తిరస్కరించింది.


Tags:    

Similar News