ఆ బిలియనీర్ల సంపద 70 కోట్ల మందికి సమానం: కాంగ్రెస్

గత పది సంవత్సరాలలో దేశంలో అసమానతలు పెరిగిపోతునే ఉన్నాయని జైరాం రమేష్ ఆరోపించారు. 21 మంది బిలియనీర్ల దగ్గర 70 కోట్ల భారతీయుల సంపద ఉందని అన్నారు.

Update: 2024-07-17 11:14 GMT

దేశంలో రోజురోజుకి పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. గత పది సంవత్సరాల నుంచి విడుదలవుతున్న గణాంకాలన్నీ కూడా ధనికులు- పేదల మధ్య అంతరాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని సూచిస్తున్నాయని విమర్శించారు.

ధనవంతుల వినియోగ వ్యయానికి పేదల వినియోగ వ్యయానికి మధ్య వ్యత్యాసం దాదాపు 10 రెట్లు ఉందని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా నివేదికను పంచుకున్నారు. దేశంలో ధనిక, పేదల మధ్య అంతరం పెరుగుతోందన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే ఉందన్నారు.

మీడియా నివేదికను ఉటంకిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని దేశ జనాభాలో 5 శాతం మంది పేదల నెలవారీ వినియోగ వ్యయం కేవలం రూ. 1,373 అని, పట్టణ ప్రాంతాల్లోని టాప్ 5 శాతం ధనవంతుల నెలవారీ వినియోగ వ్యయం రూ.20,824 అని జైరాం రమేష్ పలు గణాంకాలను ఉదహరించారు.
"ఇది కొత్త డేటా. కానీ మీరు ఏ డేటాను చూసినా, ధనవంతులు- పేదల మధ్య పెరుగుతున్న అంతరానికి ఎన్నో రుజువులు ఉన్నాయి," అని రమేష్ ఎక్స్ లో హిందీలో పోస్ట్ చేశారు. 2012 నుంచి 2021 వరకు దేశంలో సృష్టించబడిన సంపదలో 40 శాతానికి పైగా కేవలం 1 శాతం జనాభాకు మాత్రమే చేరాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోని మొత్తం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో 64 శాతం పేదలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల నుంచి వస్తున్నాయని ఆయన చెప్పారు.

"గత పదేళ్లలో, ప్రభుత్వ ఆస్తులు, వనరులలో ఎక్కువ భాగం ఒకటి లేదా రెండు కంపెనీలకు విక్రయించబడ్డాయి. ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న గుత్తాధిపత్యం ద్రవ్యోల్బణానికి దారితీసిందని ఆర్థికవేత్తలు ఎత్తి చూపారు" అని రమేష్ చెప్పారు. నేడు, 21 మంది బిలియనీర్లు కలిసి 70 కోట్ల మంది భారతీయుల కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న అసమానతలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై కాంగ్రెస్, ప్రభుత్వంపై నిరంతరం ప్రభుత్వం పై పోరాడుతోందని, దాని విధానాలే ఆర్థిక అసమానతలకు కారణమని ఆరోపించారు.
Tags:    

Similar News