తొలి తెలుగు న్యూస్ రీడర్ మృతి.. సీఎం రేవంత్ సంతాపం

తెలుగులో మొట్టమొదటి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇకలేరు. అనారోగ్యానికి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

Update: 2024-04-05 07:34 GMT

తెలుగు వార్తా రంగంలో తొలిసారి న్యూస్ రీడర్‌గా చేసిన శాంతి స్వరూప్ ఇకలేరు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్సకు చేరిన ఆయన బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన తన జీవితంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. తెలుగులో వార్తలను చదివి వినిపించిన తొలి న్యూస్ రీడర్‌గా తెలుగు మీడియా రంగంపై చెరగని ముద్ర వేశారు. ఆయన 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించారు. 2011లో పదవీ విరమణ చేశారు. ఆయన తన సేవకు గానూ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.

సీఎం రేవంత్ సంతాపం

తెలుగులో తొలి న్యూస్ రీడర్ అయిన శాంతి స్వరూప్ మరణ వార్తపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు. కుటుంబీకులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు మీడియా రంగానికి శాంతి స్వరూప్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబు సానుభూతి
శాంతి స్వరూప్ మరణంపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం శాంతిస్వరూప్‌తో తాను కలిసి చేసిన కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘తెలుగు దూరదర్శన్‌లో వార్తలు అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి శాంతి స్వరూప్. ఉమ్మడి రాష్ట్రానికి నేను సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం చేసేవాళ్లం. ఆ కార్యక్రమం ఆరు సంవత్సరాలు సాగింది. మా ఇద్దరి మధ్య అనుబంధం చాలా సుదీర్ఘమైనది. శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ కష్ట కాలంలో ఆయన కుటుంబీకులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’అని ట్వీట్ చేశారు చంద్రబాబు,



Tags:    

Similar News