అమెరికా ఎన్నికలు- అప్ డేట్స్: కమలకే ఛాన్స్ అంటున్న సర్వేలు
అగ్రరాజ్యంలోనూ కంప్యూటర్లు మొరాయించాయి. బాంబు బెదిరింపులు వచ్చాయి. నవంబర్ 6 బుధవారం ఉదంయ 6.30 గంటల నుంచి ఎగ్జిట్ సర్వే ఫలితాలు వెలువడనున్నాయి.
అమెరికా సర్వేలు కమలా హారిస్ వైపు మొగ్గుచూపుతున్నాయి. ప్రముఖ పోలింగ్ సంస్థ ‘ఫైవ్ థర్టీ ఎయిట్-538’ తన తుది సర్వేను అర్థరాత్రి దాటిన తర్వాత విడుదల చేసినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. నిన్నటి వరకు ట్రంప్ ఆధిక్యంలో ఉన్న చోట కమలా హారిస్ పుంజుకున్నట్లు ప్రకటించింది. ఇక స్వింగ్ స్టేట్స్‌లో పోటీ ఫలితాలను అంచనాలకు అందడం లేదని తెలిపింది.
ఈ సంస్థ అంచనా ప్రకారం కమలా హారిస్ గెలించేందుకు 50.015శాతం, ట్రంప్ కి 49.985 శాతం ఛాన్స్ ఉందని పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్ కమలా హారిస్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తేల్చిచెప్పింది.
దిహారిస్ ఎక్స్-ఫోర్బ్స్ నిర్వహించిన సర్వేలో కమల ముందంజలో ఉంది. ఆమెకు 49శాతం, ట్రంప్ కి 48 శాతం మంది మద్దతు తెలిపారు.
ఎన్‌బీఎస్ న్యూస్ తుది పోల్స్‌లో కూడా డెమోక్రట్లు, రిపబ్లికన్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని తేల్చింది. ఇద్దరూ 49శాతం ఓట్లతో నిలవనున్నట్లు పేర్కొంది. ఇక యాహూ న్యూస్-యూగవ్‌లో కూడా ఇద్దరికీ 47శాతం లభించాయి.
పీబీఎస్ న్యూస్-ఎన్‌పీఆర్-మారిస్ట్ సర్వేలో కూడా హారిస్‌కే ఆధిక్యం ఉన్నట్లు పేర్కొంది. కమలా హారిస్ 51శాతం ఓట్లతో ముందంజలో ఉండగా.. ట్రంప్‌నకు 47 శాతం లభించాయి.
మార్నింగ్ కన్సల్ట్ తుది సర్వే కమలకి 49శాతం, ట్రంప్‌కి 46 శాతం ఓట్లు వస్తాయని లెక్కకట్టింది.
ఎకానమిస్ట్-యూగవ్ నిర్వహించిన సర్వేలో మాత్రం హారిస్‌కు 3శాతం ఆధిక్యం లభించింది. ఆమెకు 49శాతం.. ట్రంప్‌నకు 47 శాతం లభించాయి.
పోలింగ్ కేంద్రాల వద్ద చాంతాడంత క్యూలు ఉన్న చోట ఓటర్లకు బోర్ కొట్టకుండా స్వచ్ఛంద సంస్థలు మ్యూజిక్ షోలు ఏర్పాటు చేశాయి. హోరాహోరీ అంటున్న నాలుగు రాష్ట్రాలు - అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియా, పెన్సిల్వేనియా - లో పార్టీలతో సంబంధం లేని గ్రూపు- జాయ్ టు ది పోల్స్- పేరిట DJలు, బ్యాండ్ ట్రూప్స్ తో ఆట పాటలతో అదరగొట్టాయి. ఓటర్లకు కాళ్లు నొప్పులు పుట్టకుండా అలరించాయి. కాళ్లు నొప్పులన్నా వారి పాదాలకు మసాజ్ కూడా చేశారు. "మీరు ఓటుకు రండి, మేము సంగీతాన్ని తీసుకువస్తాం!" అనే నినాదం పేరిట ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.