‘మైనార్టీలు, హిందువులపై దాడులు సరికావు ’

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై జరుగుతోన్న దాడులు అత్యంత హేయమని ఆ దేశ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ పేర్కొన్నారు.

Update: 2024-08-11 07:05 GMT

హిందువులపై హింసను ఖండిస్తూ ఢాకాలోని షాబాగ్ కూడలిలో నిరసన తెలుపుతున్న బంగ్లాదేశ్ హిందూ కమ్యూనిటీ సభ్యులు

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై జరుగుతోన్న దాడులు అత్యంత హేయమని ఆ దేశ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. హిందూ, క్రైస్తవ, బౌద్ధ కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఆయన యువతను కోరారు.

హిందూ సంస్థలయిన బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్‌, బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ ప్రకారం.. ఆగస్టు 5న షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనం అయినప్పటి నుండి మైనారిటీ కమ్యూనిటీల సభ్యులపై బంగ్లాదేశ్‌లోని 52 జిల్లాల్లో కనీసం 205 దాడులు జరిగాయి. ప్రాణభయంతో వేలాది మంది బంగ్లాదేశ్ హిందువులు దేశం వీడి పొరుగున ఉన్న భారతదేశానికి చేరుకుంటున్నారు.

రంగ్‌పూర్ నగరంలోని బేగం రోకేయా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి యూనస్ మాట్లాడుతూ ..“వారు ఈ దేశ ప్రజలు కాదా? దేశాన్ని రక్షించగలిగిన మీరు కొన్ని కుటుంబాలను రక్షించలేరా? వారు నా సోదరులు. మనం కలిసి పోరాడాం. కలిసి ఉందాం..” అని అన్నారు.

యువ నాయకత్వం ప్రాముఖ్యత గురించి నొక్కిచెబుతూ.."ఈ బంగ్లాదేశ్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీకు కావలసిన చోటికి తీసుకెళ్లే శక్తి మీకు ఉంది." అని అన్నారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడానికి దారితీసిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన సమయంలో విద్యార్థి కార్యకర్త అబూ సయ్యద్ ధైర్యంగా నిలబడిన తీరును బంగ్లాదేశ్ ప్రజలు అనుసరించాలని కోరారు. జూలై 16న వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం సందర్భంగా పోలీసుల కాల్పుల్లో మరణించిన మొదటి నిరసనకారులలో రంగ్‌పూర్‌లోని బేగం రోకేయా విశ్వవిద్యాలయానికి చెందిన 25 ఏళ్ల సయ్యద్ ఉన్నాడు.

సయ్యద్ కుటుంబసభ్యులను పరామర్శించిన యూనస్..

మధ్యంతర ప్రభుత్వాధినేతగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన యూనస్ రంగ్‌పూర్‌లోని పిర్‌గంజ్ ఉపజిల్లాలో సయ్యద్ కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారని ది డైలీ స్టార్ వార్తాపత్రిక నివేదించింది. “అబూ సయ్యద్ ధైర్యాన్ని చూశాం. ఎలా ఎదురొడ్డాదో చూశాం... అబూ సయీద్ తల్లి అందరికీ తల్లి. మనం ఆమెను రక్షించాలి. ఆమె సోదరీమణులను, సోదరులను రక్షించాలి. ఈ పని అందరం కలసికట్టుగా చేయాలి’’ అని సయ్యద్ కుటుంబాన్ని కలిసిన అనంతరం యూనస్ విలేఖరులతో అన్నారు.

ప్రతి బంగ్లాదేశీయుడి బాధ్యత..

కొత్త బంగ్లాదేశ్‌ను నిర్మించాల్సిన బాధ్యత ప్రతి బంగ్లాదేశీయుడిపై ఉందని యూనస్ కోరారు. ‘‘సయ్యద్ ఇప్పుడు కేవలం ఒకే కుటుంబ సభ్యుడు కాదు. అతను బంగ్లాదేశ్‌లోని అన్ని కుటుంబాల బిడ్డ. పెద్దయ్యాక స్కూలు, కాలేజీల్లో చేరే పిల్లలకు అబూ సయ్యద్ గురించి తెలిసి, 'నేను కూడా న్యాయం కోసం పోరాడతాను' అని తమలో తాము చెప్పుకుంటారు. అబూ సయ్యద్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నాడు.’’ అని పేర్కొన్నారు.

హిందువుల నిరసన..

దేశంలోని వివిధ ప్రాంతాలలో తమ ఇళ్లు, దుకాణాలు, దేవాలయాలపై దాడులను నిరసిస్తూ విద్యార్థులతో సహా వేలాది మంది హిందూ ఆందోళనకారులు వరుసగా రెండవ రోజు శనివారం షాబాగ్ కూడలిని అడ్డుకున్నారని ది డైలీ స్టార్ వార్తాపత్రిక నివేదించింది. హిందువులపై వేధింపులను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోకుంటే నిరంతరం నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆందోళనకారులు హెచ్చరించారు.

చీఫ్ జస్టిస్, ఐదుగురు జడ్జీలు రాజీనామా..

మరో పరిణామంలో.. బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్, ఐదుగురు ఇతర న్యాయమూర్తులు శనివారం తమ రాజీనామాలను సమర్పించారు. హసీనా పాలన పతనమైన ఐదు రోజుల తర్వాత.. న్యాయవ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సుప్రీం కోర్టు వైపు కవాతు నిర్వహించారు. 65 ఏళ్ల అత్యున్నత న్యాయమూర్తి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమానికి చెందిన నిరసనకారులు సుప్రీంకోర్టు ప్రాంగణంలో సమావేశమైన తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించారు. మధ్యాహ్నం 1 గంటలోగా రాజీనామా చేయాలని విద్యార్థులు ఆయనకు అల్టిమేటం జారీ చేశారు. హసన్ రాజీనామాతో అప్పిలేట్ డివిజన్ జస్టిస్ ఎండీ అష్ఫాకుల్ ఇస్లాం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనట్లు సుప్రీంకోర్టు ప్రజా సంబంధాల అధికారి ఎండీ షఫీకుల్ ఇస్లాం మీడియాకు తెలిపారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఢాకా యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ మక్సూద్ కమల్, బంగ్లా అకాడమీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ హరున్-ఉర్-రషీద్ అస్కారీతో సహా పలువురు ఇతర ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు.

Tags:    

Similar News