పాకిస్తాన్ కష్టాలు రెట్టింపు కాబోతున్నాయా?
కస్టడీలో కీలక సమాచారాలు వెల్లడిస్తున్న ముంబై దాడుల ఉగ్రవాదీ తహవ్వుర్ రాణా, ఇస్లామాబాద్ కు అధికారికంగా లేఖ పంపబోతున్న ఎన్ఐఏ;
Translated by : Praveen Chepyala
Update: 2025-04-22 06:22 GMT
(రాజేశ్ అహుజా)
ముంబై దాడుల ఉగ్రవాది తహవ్వూర్ రాణా విచారణ అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పాకిస్తాన్ ను కార్నర్ చేయడానికి వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తోంది. ప్రస్తుతం కోర్టు ద్వారా దర్యాప్తులో పాకిస్తాన్ ను సాయం కోరాలని నిర్ణయం తీసుకుంది.
చట్టపరిధిలో జరిగే ఈ వ్యవహారాన్ని ‘‘లెటర్ రోగటరీ’’ అంటారు. అంటే ఒకదేశంలోని కోర్టు మరోదేశంలోని కోర్టుకు లేఖ రాసి సాయాన్ని కోరుతుంది. ఇక్కడ ఎన్ఐఏ కూడా ఇదే అంశాన్ని ఉపయోగించుకోబోతోంది.
ఉగ్రవాది రాణా దర్యాప్తులో అనేక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ముంబైతో పాటు దేశంలోని అనేక ఇతర కీలక నగరాల్లో ఏకకాలంలో దాడులు చేయాలని విస్తృతమైన ప్రణాళికను బయటపెట్టాడు.
అమెరికా దర్యాప్తు సంస్థలు రాణాను అరెస్ట్ చేసిన తరువాత భారత్ ఈ ఉగ్రవాదిని దిగ్విజయంగా ఇక్కడకు రప్పించింది. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత ఈ ప్రక్రియ పూర్తయింది. రాణా రాగానే కోర్టులో హజరుపరిచిన జాతీయ దర్యాప్తు సంస్థ.. కస్టడీకి తీసుకుని కీలక విషయాలు రాబట్టింది.
అనేక దాడుల ప్రణాళికలు..
ముంబై దాడుల కోసం రాణా, హెడ్లీల సాయంతో పదిమంది ఆత్మాహుతి ఉగ్రవాదులను లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ సముద్ర మార్గంలో పంపింది. అయితే దాడుల తరువాత మరోమారు దేశంలోని కీలక నగరాలపై దాడులు చేయాలనే పన్నాగం పాక్ లోని ఉగ్రవాద సంస్థలు ప్రణాళికలు రచించాయని తెలిసింది. ఇందుకోసం హెడ్లీని సంప్రదించాయి. ఆ ఉగ్రవాది అనేక లక్ష్యాలపై రెక్కీ నిర్వహించాడు. ఇందులో ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ సైతం ఉన్నట్లు తేలింది.
లష్కర్ ఉగ్రవాదీ సాజిద్ మీర్, హెడ్లీ అలియాస్ దావుద్ గిలానికి 2009 లో ఓ ఈ మెయిల్ పంపాడు. దాని ప్రకారం.. భారత్ లోని ఇతర నగరాలపై దాడుల గురించి సీక్రెట్ కోడ్ లో మాట్లాడుకున్నారు. ఈ కేసును విచారించిన ముంబై పోలీసులు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు.
పాక్ ఉగ్రవాదీ అజ్మల్ కసబ్ సజీవంగా దొరకడంతో విచారించిన న్యాయస్థానాలు అతడికి ఉరిశిక్ష విధించాయి. రెండో నిందితుడు అబు జిందాల్ కు ముంబై కి వచ్చే ఉగ్రవాదుల గుర్తింపును దాచడంతో పాటు ఇక్కడ శైలిలో మాట్లాడేందుకు శిక్షణ ఇవ్వాలని కోరినట్లు తేలింది.
26/11 దాడుల వెనక ఎవరున్నారు?
సాజిర్ మీర్ పంపిన ఈ మెయిల్ పంపిన ప్రకారం దీనివెనక అనేక పెద్ద కుట్ర ఉంది. రాణాను అమెరికా నుంచి తీసుకు వచ్చిన తరువాత పూర్తి విషయం జాతీయ దర్యాప్తు సంస్థకు అర్థమయింది.
రాణా, హెడ్లీ అలియాస్ గిలానీలను యూఎస్ 2009 లో అరెస్ట్ చేసింది. వారిని విచారించిన పోలీసులకు భారత్ లో జరిగిన దాడులకు సంబంధించిన చాలా పెద్ద కుట్ర బయటపడింది. ఇందులో ఇతర నగరాలపై కూడా ఇరువురు స్నేహితులు కుట్ర చేశారని తేలింది.
ముంబై దాడుల పై విచారణ చేసిన ఎన్ఐఏ కూడా 2011 లో చార్జీషీట్ దాఖలు చేసింది. ఇందులో రాణా, హెడ్లీ అలియాస్ గిలానీ, ఎల్ఈటీ ఉగ్రవాదులు సాజిద్ మీర్, హఫీజ్ సయీద్, అతని డిప్యూటీ జకీర్ ఉర్ రెహమాన్ లక్వీ, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మేజర్ ఇక్భాల్, మేజర్ సమీర్ అలీ పాకిస్తాన్ మాజీ ఆర్మీ మేజర్ అబ్డుల్ రహమాన్ హషీమ్ అలియాస్ పాషా, అల్ ఖైదా మిలిటరీ కమాండర్ ఇలియాస్ కాశ్మీర్ ఇందులో కీలక సూత్రధారులని పేర్కొంది. ఇందులో ఇలియాస్ ను అమెరికా డ్రోన్ దాడిలో మట్టుబెట్టింది.
కొత్త ఆధారాలు..
ఈ కేసుకు సంబంధించిన ఎన్ఐఏ చార్జీషీట్ దాఖలు చేయడానికి ముందే దర్యాప్తు సాయం చేయాల్సిందిగా పాకిస్తాన్ కు ఈ మెయిల్ పంపారు. కానీ దానికి ఎలాంటి జవాబును ఇస్లామాబాద్ పంపలేదు ఇప్పటి వరకూ.
‘‘భారత్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని హెడ్లీ, రాణాకు అందజేస్తూనే ఉన్నాడు. ముంబాయి తో పాటు దేశంలోని ఇతర నగరాలపై రెక్కీ నిర్వహించాలనే కుట్రకు వీరు తెరతీశారు.
రాణాతో పాటు లష్కర్ ఏ తోయిబాకు సంబంధించిన అగ్రనాయకత్వానికి సమాచారం ఇస్తూనే ఉన్నారు. రాణా అరెస్ట్ తరువాత ఈ కుట్ర వెనక దాగి ఉన్న మొత్తం సమాచారం ఇప్పుడు ఎన్ఐకి లభించింది’’ అని కొన్ని సోర్స్ లు జాతీయ మీడియాకు నివేదించాయి.
ఎన్ఐఏ ఇప్పుడు లభించిన ఆధారాలతో పాకిస్తాన్ కు మరోసారి లేఖను కోర్టు ద్వారా అందజేసే అవకాశం కనిపిస్తోంది. హెడ్లీ అలియాస్ గిలానీ ఉగ్రవాద సంస్థ లష్కర్ తో ఎప్పటికప్పడు సమాచారం పంచుకుంటూనే ఉన్నాడనే ఆధారాలను తాజా విచారణలో బయటపడ్డాయి. వీటి ద్వారా పాక్ ను దర్యాప్తు లో సాయం చేయమని కోరే వీలుంది.
పాకిస్తాన్ ఏం చేయబోతోంది..
కొన్ని నివేదికల ప్రకారం భారత్ మరో లెటర్ రోగరేటరీని పాకిస్తాన్ కు పంపే అవకాశం ఉంది. దీనిని న్యూఢిల్లీ అంతర్జాతీయ సమాజంలో ఇస్లామాబాద్ చేస్తున్న అరాచకాలను బయటపెట్టేందుకు వాడుకునే అవకాశం కనిపిస్తోంది.
పాక్ లోని ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే, ప్రపంచాన్ని నమ్మించడానికి కొత్త ఎత్తులు వేస్తుందని ఆధారాలతో బయట పెట్టే అవకాశం ఉంది.
ముంబై ఉగ్రదాడులకు సంబంధించి పాకిస్తాన్ దర్యాప్తు సంస్థలు కూడా రావల్పిండి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశాయి. ఇందులో కీలక పాత్ర పోషించింది లష్కర్ ఉగ్రవాదీ జకీర్ ఉర్ రెహమాన్ లక్వీ అని అతడితో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు మోపింది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే లక్వీ జైలులో ఉన్నట్లు పాకిస్తాన్ ప్రకటించినప్పటికీ అతడికి భార్య మరో బిడ్డకు జన్మనిచ్చిందని భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పటి వరకూ దాని పూర్తి దర్యాప్తును పూర్తి చేయలేదు. రాణా అరెస్ట్ తో పాకిస్తాన్ కు సంబంధించి కీలక పాత్ర దర్యాప్తులో బయటపడే అవకాశం ఉంది.