Air plane crash | దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో మృతులు 179 మంది
దక్షిణ కొరియాలో జరిగిన అతిపెద్ద ఘోర విమాన ప్రమాదాల్లో ఇది రెండవది. 1997లో గ్వామ్‌లో కొరియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలినప్పుడు 228 మంది మరణించారు.;
దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంతో మొత్తం 179 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 177 మృతదేహాలను వెలికితీశారు. వీటిలో 88 మందిని మాత్రమే గుర్తించగలిగారు. విమానంలో ఎక్కువగా దక్షిణ కొరియా ప్రయాణికులే ఉండగా ఇద్దరు థాయ్ పౌరులు ఉన్నారు. థాయ్ పౌరులిద్దరూ కూడా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రమాదం ఎలా జరిగింది?
ముయాన్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి రక్షణగోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. ఈ ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. ఇద్దరు సిబ్బంది తప్ప మిగిలిన వారంతా మరణించినట్లు తెలుస్తోంది. నేలపైకి దిగిన తర్వాత వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమై ఎయిర్‌పోర్టు గోడను ఢీకొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మంటలను అదుపులో చేసేందుకు మొత్తం 32 అగ్నిమాపక వాహనాలు, హెలికాప్టర్లను వినియోగించారు. మొత్తం 1,570 మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ అధికారులు, సైనికులు, ఇతర అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్సులు ఫ్లైట్ డేటా రికార్డర్ , కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
ఘటనపై దక్షిణ కొరియా ఫైర్ చీఫ్ లీ జియోంగ్ హైయూన్ స్పందించారు. విమానం ఇంజిన్‌ను పక్షి ఢీకొనడం, వాతావరణ పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ గేర్‌లో సమస్య కారణమై ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. జరిగిన ప్రమాదానికి థాయ్‌ల్యాండ్‌కు చెందిన జేజు ఎయిర్ సంస్థ క్షమాపణలు తెలిపింది. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని పేర్కొంది. దక్షిణ కొరియాలో జరిగిన అతిపెద్ద ఘోర విమాన ప్రమాదాల్లో ఇది రెండవది. 1997లో గ్వామ్‌లో కొరియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలినప్పుడు 228 మంది మరణించారు.