కర్ణాటకలో ఐటీ ఉద్యోగుల పని గంటలు పెంచుతారా?

IT రంగంలోని 45 శాతం మంది ఉద్యోగులు డిప్రెషన్ లాంటి మానసిక ఆరోగ్య సమస్యలను బాధపడుతున్నారు. 55 శాతం మంది శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Update: 2024-07-21 13:13 GMT

ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల పని గంటలను రోజుకు 10 నుంచి 14 గంటలకు పెంచాలని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. ఆమోదించాలని కోరుతూ తమ ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ మేరకు చట్టాన్ని సవరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామంపై కర్నాటక స్టేట్ IT/ ITES ఎంప్లాయీస్ యూనియన్ (KITU) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమానవీయ చర్యగా అభివర్ణించింది. ఆందోళనకు సిద్ధమవుతోంది.

ఇటీవల కార్మిక శాఖ పరిశ్రమల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పనిగంటల సవరణ ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం త్వరలో కేబినెట్‌లో చర్చకు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో ఒక గంట ఓవర్ టైమ్‌ను కలుపుకుని మొత్తం 10 గంటలు పనిచేస్తున్నారు.

ఇప్పడు ఐటి కంపెనీలు 14 గంటలకు (12 గంటలు + 2 గంటల ఓవర్ టైం) పొడిగించాలని కోరుతున్నాయి.

ఇక వ్యక్తిగత జీవితం ఉండదు.

"చట్ట సవరణ జరిగితే కార్మికులకు ఇక వ్యక్తిగత జీవితం ఉండదు. రోజుకు గరిష్టంగా 10 గంటల పాటు పని చేసే చట్టాన్ని రద్దు చేసి, పని గంటలను ఇంకా పొడిగించాలనుకోవడం దారుణం’’ అని యూనియన్ పేర్కొంది.

సిబ్బంది కోత కూడా..

“ఈ సవరణతో ప్రస్తుత మూడు-షిఫ్ట్‌లకు బదులుగా రెండు షిఫ్ట్‌లు చేసే ఆలోచనలు కంపెనీలు ఉన్నాయి. ఈ లెక్కన సిబ్బందిని కూడా తగ్గించేస్తారు.’’ అని KITU ప్రధాన కార్యదర్శి సుహాస్ అడిగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘మేం మనుషులం’

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మనుషులుగా కాకుండా యంత్రాలుగా భావిస్తోందని యూనియన్ మండిపడింది. ఐటీ సంస్థల డిమాండ్‌ను అమలు చేయవద్దని సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కోరింది.

“KCCI (Kanara Chamber of Commerce and Industry) నివేదిక ప్రకారం.. IT రంగంలోని 45 శాతం మంది ఉద్యోగులు డిప్రెషన్ లాంటి మానసిక ఆరోగ్య సమస్యలను బాధపడుతున్నారు. 55 శాతం మంది శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పని గంటలు పెంచడం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది’’ అని పేర్కొంది.

Tags:    

Similar News