' శశి మధనం ' వెబ్ సీరిస్ ఓటిటి రివ్యూ

ఓటీటీలో కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా బాగుంటున్నాయి. దాంతో అవి కూడా బాగా చూస్తున్నారు.

Update: 2024-07-11 10:44 GMT

ఓటీటీలో కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా బాగుంటున్నాయి. దాంతో అవి కూడా బాగా చూస్తున్నారు. అయితే మన తెలుగు వెబ్ సీరిస్ లు బాగా తక్కువనే చెప్పాలి. వచ్చిన వాటిల్లో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. తాజాగా ' శశి మధనం ' వెబ్ సీరిస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవటం మొదలెట్టింది. ఈ సీరిస్ కు మంచి అప్లాజ్ వస్తోంది. కాన్సెప్టు పాతదైనా డీల్ చేసిన విధానం మెప్పిస్తోంది. ఇంతకీ ఈ సీరిస్ కథేంటి..చూడదగ్గ కంటంటేనా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఐదు లక్షలు అప్పులు పాలవుతాడు మ‌ద‌న్ (ప‌వ‌న్ సిద్ధు) .అప్పులు వాళ్ల నుంచి వార్నింగ్ లు, ప్రెజర్ ఎక్కువైపోతుంది. దాంతో దాక్కోవటానికి ఓ ప్లేస్ అత్యవసరం. అప్పుడే అదృష్టం కొద్ది అతని లవర్ శశి రేఖ (సోనియా సింగ్‌) కాల్‌ చేస్తుంది. తన ఫ్యామిలీ అంతా ఊరెళ్తోందని, కొన్ని రోజుల వరకూ రారని క్లూ ఇస్తుంది. మదన్ ఎగిరి గంతేస్తాడు. తన సమస్యకు సరైన సొల్యూషన్ దొరికిందనుకుంటాడు. ఎగేసుకుంటూ ఆమె ఇంటికి వెళ్లిపోతాడు.

అయితే రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పదన్నట్లు... హ్యాపీగా తన గర్ల్ ప్రెండ్ తో ఉండచ్చు, అప్పులు వాళ్ల బారి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్న టైమ్ లో ట్విస్ట్ పడుతుంది. శశి ఫ్యామిలీ వెళ్లిన పెళ్లి కాన్సిల్ అయ్యి వాళ్లు వెనక్కి తిరిగి వచ్చేస్తారు. దాంతో ఆ ఇంట్లో ఇరుక్కుపోతాడు. అక్కడ నుంచి శశి రేఖ ఎన్ని తిప్పలు పడి తన లవర్ మదన్ ని వాళ్ల కంటపడకుండా దాచింది. ఆ క్రమంలో సీన్ లోకి వచ్చి గందరగోళం సృష్టించే పాత్రలు ఎవరు...చివరకు ఎలా బయిటపడ్డారు. అప్పులు వాళ్ల నుంచి అతను బయిటపడగలిగాడా...ఏమైంటి వంటి విషయాలు తెలియాలంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

ఎక్కువగా ఓటిటిలో కంటెంట్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్, హర్రర్ కామెడీ మాత్రమే కనపడుతుంది. అవే సక్సెస్ అవుతున్నాయి. అయితే ఎన్నని అవే చూస్తారు. వరస పెట్టి చూస్తుంటే ఎంత గొప్ప కంటెంట్ అయినా రోత పుడుతుంది. అలాంటప్పుడు కాస్త ఆ ట్రెండ్ కు డిఫరెంట్ గా ఉన్నవే వర్కవుట్ అవుతాయి. ఈ వెబ్ సీరిస్ ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ రావటంతో జనాలకు బాగా నచ్చుతోంది. అందులోను స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. కొంత రొటీన్ ఫార్మెట్ లో ఉన్నట్లు అనిపించినా చూసేయచ్చు. క్లైమాక్స్‌ కూడా మన ఊహకు తగ్గట్టే ఉంటుంది. మొత్తం ఆరు ఎపిసోడ్లు (ఒక్కో ఎపిసోడ్‌ నిడివి 30 నిమిషాల్లోపే) కావటం ఓ ప్లస్ అయ్యింది. పెద్దగా శ్రమ పడకుండా అప్పుడే అయ్యిపోయిందా అనిపించింది.

నిజానికి ఇది కొత్త కాన్సెప్టు కాదు. ఇంట్లో ఎవరూ లేరనే విషయం తెలిసి లవర్ ఇంటికొచ్చి ఇరుక్కుపోయిన సీన్స్ బోలెడు మనం చూసి ఉన్నాం. అయితే దాన్నే ఆరు ఎపిసోడ్స్ గా రాసుకోవటం మాత్రం పెద్ద టాస్కే. ఎంటర్టైన్మెంట్ తో దాన్ని నడిపించటం కలిసొచ్చింది. సాధ్యమైన మేరకు బాగానే నవ్వించారు. అయితే ఫస్ట్ మూడు ఎపిసోడ్స్ ఇంకాస్త టైట్ గా ఉంటే మరింత ఇంట్రస్టింగ్ గా అనిపించేది. ఆరు ఎపిసోడ్స్ లో కథ చెప్పాలనుకుని మొదట కొంత సాగతీసారు.

అసలు కాంప్లిక్ట్ లోకి రావటానికి చాలా టైమ్ తీసుకున్నట్లు అనిపించింది. మొదటే అలా ఉంటే చాల్లే ఇంకేమి చూస్తాం అని ప్రక్కన పెట్టేస్తాం. ఓపిగ్గా తర్వాత ఏదో ఉంది అని తెలియదు. అంత ఓపిక ఈ డిజిటల్ యుగంలో ఎవరికి ఉంది. ఇక శ‌శి మ‌థ‌నం సిరీస్ చాలా వ‌ర‌కు ఒకే ఇంట్లో నడపటంతో అక్కడక్కడే తిరుగుతన్నట్లు అనిపిస్తుంది. దానికి తోడు ఐదారు ప్ర‌ధాన పాత్ర‌లే ఎంతసేపు కనపడుతూంటాయి. అయితే డైరక్టర్ మేజిక్ అక్కడే చేసారు .. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో కొత్త క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇచ్చేలా స్క్రీన్‌ప్లే రాసుకోవటమే కలిసొచ్చింది.

టెక్నికల్ గా...

ఆర్టిస్ట్ లలో ప్రధాన పాత్రలైన పవన్‌ సిద్ధు, అతడి కోసం ఎంత రిస్క్‌ తీసుకునే లవర్ గా సోనియా సింగ్‌ పోటీ పడీ మరీ చేసారు.రంగమ్మత్తగా రూపాలక్ష్మి, శశి తాతగా అశోక్‌ చంద్ర బాగా చేసారు. టెక్నికల్ గా సిరీస్ మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. సిన్జిత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరిస్తుంది. పాటలు పెట్టకుండా ఉంటే బాగుండేది. కెమెరా వర్క్ నీట్ గా ఉంది. ఎడిటింగ్ బాగా చేసారు.

చూడచ్చా

కామెడీతో నడిచే తెలుగు సీరిస్ కాబట్టి చూడవచ్చు. నిరాశపరచదు.

ఎక్కడుంది.

ఈటీవీ విన్‌ లో తెలుగులో ఉంది.

నటీనటులు: సోనియా సింగ్‌, పవన్‌ సిద్ధు, రూపాలక్ష్మి, ప్రదీప్‌ రాపర్తి, కేశవ్‌ దీపక్‌, అశోక్‌ చంద్ర తదితరులు;

సంగీతం: సిన్జిత్‌ యర్రమిల్లి;

ఛాయాగ్రహణం: రెహాన్‌ షేక్‌;

నిర్మాత: హరీశ్‌ కొహిర్కర్‌;

దర్శకత్వం: వినోద్‌ గాలి;

ఓటిటి: ఈటీవీ విన్‌.

Tags:    

Similar News