తనపై జరిగిన హత్యాయత్నంపై పోలీసులకు సల్మాన్ ఖాన్ ఏం చెప్పారు?
అసలు సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసింది. సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిందెవరు? పోలీసుల ఇంటరాగేషన్‌లో సల్మాన్ బ్రదర్స్ ఏం చెప్పారు?
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న పోలీసులు గురువారం సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన సోదరుడు అర్బాజ్‌ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సల్మాన్‌ను మూడు గంటల పాటు, అర్బాజ్‌ను రెండు గంటల పాటు ప్రశ్నించారు. పోలీసులు వారిని100కు పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని ముఠా నుండి తన సోదరుడి ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయం తనకు తెలుసని సల్మాన్ సోదరుడు అర్బాజ్ పోలీసులకు చెప్పారు.
మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన ఇంటిపై కాల్పులు జరపడంతో తుపాకీ కాల్పుల శబ్దానికి తనకు మెలకువ వచ్చిందని 58 ఏళ్ల సల్మాన్ ఖాన్ పోలీసులకు చెప్పారు. ఘటనకు ముందు రోజు రాత్రి పార్టీ తర్వాత తాను ఆలస్యంగా నిద్రపోయానని చెప్పారు. బాల్కనీకి తగిలిన బుల్లెట్ శబ్దం విని లేచానని, పరుగెత్తుకుంటూ బాల్కనీలోకి వెళ్లి బయటకి చూస్తే ఎవరికీ కనిపించలేదని సమాధానమిచ్చారు.
అదుపులో నిందితులు..
సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన వారిలో పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లను గుజరాత్‌లో అరెస్టు చేయగా, పంజాబ్‌లో అనుజ్ థాపన్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో థాపన్ చనిపోయాడు.
పాకిస్తాన్ లింక్..
జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్, కెనడాకు చెందిన అతని బంధువు అన్మోల్ బిష్ణోయ్, సహచరుడు గోల్డీ బ్రార్ నుంచి AK-47, M-16 స్వాధీనం చేసుకున్నారు. వీటిని పాకిస్తాన్ నుంచి పొందినట్లు పోలీసులు గుర్తించారు.
సల్మాన్ ఖాన్‌ను ఎందుకు టార్గెట్ చేశారు?
"హమ్ సాథ్ సాథ్ హై" సినిమా చిత్రీకరణ సమయంలో రాజస్థాన్‌లోని కంకణిలో రెండు కృష్ణజింకలను వేటాడి చంపాడని 58 ఏళ్ల సల్మాన్ ఖాన్ మీదున్న అభియోగం. అయనపై పోలీసులు భారతీయ వన్యప్రాణి (రక్షణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. కృష్ణజింకను పవిత్రంగా భావించే బిష్ణోయ్ కమ్యూనిటీ కమ్యూనిటీ వాటిని చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018లో కోర్టుకు హాజరైనప్పుడు సల్మాన్‌ను చంపేస్తానని లారెన్స్ బిష్ణోయ్ బెదిరించాడు.